టెస్టుల్లో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. గత తొమ్మిది టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కేవలం మూడే విజయాలు సాధించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చేదు అనుభవాలు చవిచూసింది.
స్వదేశంలో ఘోర పరాభవం
స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి ఇంతటి ఘోర పరాభవం చవిచూసిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ పరాభవాన్ని మరిపించేలా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో రాణించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.
ఆసీస్‌లో శుభారంభం చేసినా..
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఆసీస్‌ను ఎదుర్కొన్న టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చిందనే సంకేతాలు ఇచ్చింది. కానీ.. రోహిత్ శర్మ జట్టుతో చేరిన తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.
వరుస ఓటములతో
ఆసీస్‌తో అడిలైడ్ టెస్టులో ఓడిన టీమిండియా.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే, మెల్‌బోర్న్ టెస్టులో మాత్రం చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుని.. 184 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలని.. గంభీర్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలగాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం కూడా హీటెక్కినట్లు సమాచారం. రోహిత్, గంభీర్‌పై చర్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపక్రమించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.
అతడి కోసం పట్టుబట్టిన గంభీర్..
ఆసీస్ పర్యటనకు టీమిండియా వెటరన్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను ఎంపిక చేయాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. అయితే, సెలక్టర్లు మాత్రం అతడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పెర్త్ టెస్టు తర్వాత అయినా.. పుజారాను పిలిపిస్తే బాగుంటుందని గంభీర్ సూచించినా.. మేనేజ్‌మెంట్ మాత్రం అతడి మాటను పట్టించుకోలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్ర
కాగా పుజారాకు ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్ర ఉంది. 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పుజారా 1258 బంతులు ఎదుర్కొని.. 521 పరుగులు చేశాడు. తద్వారా భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2020-21 సీజన్‌లోనూ రాణించాడు. ఇక ఓవరాల్‌గా కంగారూ గడ్డపై పుజారా పదకొండు మ్యాచ్‌లు ఆడి 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు.
ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భాగంగా ఆఖరిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన పుజారా.. 14, 27 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల ఈ సౌరాష్ట్ర బ్యాటర్ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీల్లో, దేశీ రంజీల్లో రాణిస్తున్నాడు.
లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
ఈ నేపథ్యంలోనే పుజారా గురించి గంభీర్ ప్రస్తావించగా.. సెలక్టర్లు మాత్రం అతడి పేరును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి గౌతీ మాట చెల్లడం లేదని.. త్వరలోనే అతడిపై వేటు తప్పదనే వదంతులు వ్యాపిస్తున్నాయి.
చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment