టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ఘాటు విమర్శలు చేశాడు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఈ ఢిల్లీ బ్యాటర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడని.. అతడికి బదులు యువ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నా బాగుండేదని పేర్కొన్నాడు. కోహ్లి సగటున సాధిస్తున్న పరుగులు చూస్తుంటే.. ఇప్పడిప్పుడే జట్టులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లను తలపిస్తున్నాడని విమర్శించాడు.
ఆ సెంచరీ మినహా..
శతకాల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి గత కొన్నేళ్లుగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)తో బిజీగా ఉన్న కోహ్లి.. పెర్త్ టెస్టులో శతకం మినహా మిగిలిన మూడు టెస్టుల్లో విఫలమయ్యాడు. కంగారూ గడ్డపై గొప్ప చరిత్ర ఉన్న ఈ రన్‌మెషీన్ ఈసారి మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.
ఇప్పటి వరకు ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కోహ్లి వరుసగా 5, 100(నాటౌట్), 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడటంతో.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు భారంగా మారాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కోహ్లి.
భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?
ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి ఐదేళ్లు గడిచాయి. ఇలాంటి గొప్ప ఆటగాడి సగటు మరీ 28కి పడిపోతే ఎలా?.. భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు తగునా?
ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందే
తమ అత్యుత్తమ ఆటగాడి బ్యాటింగ్ సగటు 28కి దగ్గరగా ఉండటం సబబేనా?.. కచ్చితంగా కానేకాదు. జట్టుకు ఇంతకంటే గొప్పగా ఆడే బ్యాటర్ అవసరం ఉంది. అక్టోబరు 2024 నుంచి అతడి బ్యాటింగ్ సగటు మరీ 21గా ఉంది. టీమిండియాకు ఇలాంటి వాళ్లు అవసరం లేదు.
యువ ఆటగాడు కూడా సగటున 21 పరుగులు చేయగలడు. విరాట్ నుంచి మనం కోరుకునేది ఇది కాదు కదా!.. ఓ ఆటగాడి కెరీర్‌లో సగటు 50 కంటే తక్కువగా ఉందంటే.. ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందే’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
పదే పదే అదే తప్పు.. తెలివైన వారు అలా చేయరు!
కాగా 2020 నుంచి 2024 వరకు కోహ్లి 38 టెస్టుల్లో కలిపి సగటున 31.32తో 2005 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడు టెస్టుల్లో కోహ్లి మరీ దారుణంగా 260 పరుగులకే పరిమితమయ్యాడు. సగటు 21.67. ఇక ఆసీస్‌తో టెస్టుల్లో ఒకే తరహాలో కోహ్లి అవుట్ కావడం పట్ల కూడా ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేశాడు.
ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో ఓసారి విఫలమైనా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశాడని పఠాన్ విమర్శించాడు. తెలివైన ఆటగాళ్లు ఇలా ఒకే రకమైన తప్పులు చేయరంటూ పరోక్షంగా కోహ్లికి చురకలు అంటించాడు. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో ఐదో టెస్టు(జనవరి 3-7) జరుగనుంది.
రోహిత్ పరిస్థితి మరీ దారుణం
ఈ మ్యాచ్‌లో రాణిస్తేనే కోహ్లి టెస్టు భవితవ్యం బాగుంటుంది. లేదంటే.. రిటైర్మెంట్ ప్రకటించి.. యువ ఆటగాళ్లకు న్యాయం చేయాలనే డిమాండ్లు మరింత ఎక్కువవుతాయి. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే.. రోహిత్ శర్మ మరీ దారుణంగా ఆడుతూ.. పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నాడు. వెంటనే అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పాలంటూ సూచనలు, సలహాలు ఎక్కువయ్యాయి.
చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను
Comments
Please login to add a commentAdd a comment