
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ ‘రన్‌మెషీన్’ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కోహ్లి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడే వద్దు
అయితే, సెలక్టర్లు మాత్రం కోహ్లిని మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి కోహ్లి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు.
అయితే, ఇంగ్లండ్‌తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో కోహ్లి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతడు మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
రోహిత్ గుడ్‌బై
కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో ఆటగాడిగానూ విఫలమైన రోహిత్.. ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.
కోహ్లికి ఘనమైన రికార్డులు
ఇక ఈ రెండు సిరీస్‌లలో కోహ్లి కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్‌తో పెర్త్‌లో శతకం బాదడం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరపులేవీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, కోహ్లి టెస్టు కెరీర్ ఎంతో ఘనమైనది. ముఖ్యంగా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్‌ను గెలిపించిన రికార్డు అతడి సొంతం.
కాబట్టి రోహిత్ విషయంలో రిటైర్మెంట్‌కు సులువుగానే ఓకే చెప్పిన సెలక్టర్లు.. కోహ్లిని మాత్రం కొనసాగాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో మొదటిదైన ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాగా 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లి ఇప్పటికి 123 మ్యాచ్‌లు ఆడాడు. సగటున 46.85తో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్టు శతకాలు, 31 హాఫ్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
వన్డేలలో ఇద్దరూ కొనసాగుతారు!
మరోవైపు.. రోహిత్ విషయానికొస్తే.. భారత్ తరఫున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి కూడా రోహిత్‌తో పాటే తానూ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.
ఇప్పుడు రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. కోహ్లి కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్‌కప్-2027 వరకు యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!