
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (VIrat Kohli) రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లిని మరికొన్నాళ్లు టెస్టుల్లో కొనసాగేలా ఒప్పించేందుకు.. భారత క్రికెట్‌లో అత్యంత అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిని రంగంలోకి దించినట్లు సమాచారం.
ప్రకటన చేయకపోయినా...
కాగా టీమిండియా కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు గుడ్‌బై చెప్పిన మూడు రోజుల్లోపే భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో వార్త శనివారం వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాడు, జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి కూడా టెస్టులనుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు దాని సారాంశం.
ఈ ‘రన్‌మెషీన్’ అధికారికంగా తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోయినా... తాను టెస్టులనుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు బోర్డుకు అతడు సమాచారం అందించాడు.
కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!
ఇంగ్లండ్‌తో కీలకమైన సిరీస్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే తన మనసులో మాటను కోహ్లి బీసీసీఐకి తన నిర్ణయం గురించి తెలియజేశాడు. అయితే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా బీసీసీఐ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రోహిత్ రిటైర్ కాగా, శుబ్‌మన్ గిల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో సమరంలో జట్టులో అనుభవలేమి సమస్య కావచ్చు. అందుకే కనీసం ఈ సిరీస్ వరకైనా కోహ్లి జట్టులో కొనసాగాలని బోర్డు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఒకరితో కోహ్లిని ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అతడితో మాట్లాడిన తర్వాతే కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్‌పై అధికారిక ప్రకటన చేయవచ్చు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లి కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు. అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్‌తో పాటే అతడు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.
టెస్టు క్రికెట్‌లోనూ ప్రత్యేక స్థానం
కాగా విరాట్ కోహ్లి వన్డే రికార్డులు చాలా గొప్పగా, ఘనంగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతడు గొప్ప వన్డే ఆటగాడే అయినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో తనకంటూ కోహ్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలతో కాకుండా ఈతరం క్రికెటర్లలో టెస్టులను బతికించేందుకు సిద్ధపడిన ఏకైక బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.
సంప్రదాయ ఫార్మాట్‌కు ఒక ‘దిక్సూచి’లా నిలబడి పునరుత్తేజం నింపేందుకు కోహ్లి ప్రయత్నించాడు. టెస్టుల్లో గతంలో కనిపించని దూకుడు, వ్యూహాలతో అత్యుత్తమ కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే టెస్టుల్లో అతడి బ్యాటింగ్ ప్రదర్శన ఇటీవల అంత గొప్పగా లేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆస్ట్రేలియాపై పెర్త్‌లో కోహ్లి సెంచరీ చేశాడు. అయితే సిరీస్‌లోని మిగతా టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు.
గత రెండేళ్లలో కోహ్లి సగటు 32.56 మాత్రమే. ఇదే ఫామ్‌తో ఇంగ్లండ్‌కు వెళితే కోహ్లి ఎంత బాగా ఆడతాడనేది సందేహమే. పైగా రోహిత్ కూడా లేకపోవడంతో అందరి దృష్టీ తనపైనే ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఖాయం. జట్టు సంధి దశలో తానూ తప్పుకుంటే మెరుగని కోహ్లి ఆలోచిస్తుండవచ్చు.
ఇక కెరీర్‌లో 123 టెస్టులు ఆడిన కోహ్లి 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరో 770 పరుగులు చేస్తే అతను 10 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!