టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలనే.. లేదంటే ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.
తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌పై 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోని వచ్చినా.. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడింది.
బ్యాటర్‌గానూ విఫలం
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు చేసిన పరుగులు తొమ్మిది. ఈ నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారా స్టార్ రోహిత్ గురించి మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ను కేవలం కెప్టెన్‌గానో.. ఆటగాడిగానో చూడలేం. నా దృష్టిలో అతడు రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించలగడు.
అయితే, ప్రస్తుతం అతడు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వీలైనంత త్వరగా ఫామ్‌లోకి వస్తేనే అన్ని విధాలా బాగుంటుంది. కెప్టెనే ఫామ్‌లో లేకపోతే.. ఆ ప్రభావం జట్టుపై పడుతుంది. రోహిత్ స్కోరు చేస్తేనే జట్టుకు కూడా సానుకూలంగా ఉంటుంది.
20 -30 పరుగులు చేశాడంటే..
రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన ఆటగాడు. బ్యాటింగ్ చేస్తున్నపుడు పరుగులు ఎలా రాబట్టాలో అతడికి తెలుసు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగా లేకపోవచ్చు. అయితే, ఒక్కసారి క్రీజులో కుదురుకుని 20 -30 పరుగులు చేశాడంటే.. తన ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచగలడు.
ఒకవేళ బ్యాటర్‌గా రోహిత్ విఫలమైతే..
కాబట్టి మూడో టెస్టు ఆరంభంలోనే అతడు ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. అలా అయితేనే టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ బ్యాటర్‌గా రోహిత్ విఫలమైతే.. ఆ ప్రభావం కెప్టెన్సీపై కూడా పడుతుంది’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు పుజారా స్పోర్ట్స్ షోలో రోహిత్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.
చదవండి: మా కెప్టెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం: రిజ్వాన్‌పై పాక్ ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment