పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. అతడిని శాశ్వతంగా జట్టు నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లో రిజ్వాన్ బ్యాటింగ్ చేసిన తీరే ఇందుకు కారణం.
పాక్ వన్డే, టీ20 కెప్టెన్‌గా బాబర్ ఆజం స్థానంలో రిజ్వాన్ ఇటీవలే పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో తొలుత ఆస్ట్రేలియాలో పర్యటించిన పాక్ జట్టు.. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు సఫారీ గడ్డపై అడుగుపెట్టింది.
ఈ క్రమంలో డర్బన్ వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం రాత్రి తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా.. డేవిడ్ మిల్లర్ అద్బుత ఆట తీరుతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే 82 పరుగులతో మిల్లర్ దుమ్ములేపాడు. మిగతా వాళ్లలో జార్జ్ లిండే 24 బంతుల్లో 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆతిథ్య సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బాబర్ ఆజం.. 18 ఏళ్ల క్వెనా మఫాకా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ రిజ్వాన్ ఆచితూచి ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సయీమ్ ఆయుబ్ (15 బంతుల్లో 31) అతడికి సహకారం అందించాడు.
అయితే, మిగతా వాళ్లలో తయ్యబ్ తాహిర్(18) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ల(9, 9, 1,0,2*,5*)కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్.. 172 పరుగులే చేసింది. విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఇక ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా 62 బంతులు తానే ఆడాడు. సగం కంటే ఎక్కువ బంతులను తీసుకున్నా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 74 పరుగులే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 119.35. ఈ నేపథ్యంలోనే రిజ్వాన్‌పై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిజ్వాన్ టీ20లా కాకుండా వన్డేలా ఆడినందుకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని.. ఇలాంటి ఆటగాడు తమ కెప్టెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం ఘోర ఓటమి నుంచి రిజ్వానే రక్షించాడని.. అతడి వల్లే కాస్తైనా పరువు దక్కిందని అండగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment