‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.
గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు.
నాడు అద్భుత రీతిలో
సిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.
అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే.
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్
ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?
ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి
రిషభ్ పంత్ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.
పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.
పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్‌ను సమర్థించాడు.
సిడ్నీలో ఐదో టెస్టు
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.
చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి!
Comments
Please login to add a commentAdd a comment