‘‘విరాట్ కోహ్లి ప్రపంచస్థాయి క్రికెటర్.. అతడి పరుగుల దాహం ఎప్పటికీ తీరదు’’ అని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న ఈ రన్‌మెషీన్‌కు పూర్తి మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టుల్లో పాత కోహ్లిని చూడబోతున్నామంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొంతకాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. చివరగా 2023లో దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో ఈ కుడిచేతి వాటం అర్ధ శతకం(76) సాధించాడు. తాను ఆడిన గత ఎనిమిది ఇన్నింగ్స్‌లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోరు.
కోహ్లి ఆట తీరుపై విమర్శలు
ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లోనూ కోహ్లి ఆకట్టుకోలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో కేవలం 23 పరుగులే చేసిన అతడు.. రెండో టెస్టు(47, 29*)లో ఫర్వాలేదనిపించాడు. అయితే, టాప్ బ్యాటర్‌గా తన పాత్రకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ స్పందిస్తూ.. ‘‘కోహ్లి వరల్డ్‌క్లాస్ క్రికెటర్. విరాట్ గురించి నేనెప్పుడూ ఇదే మాట చెబుతూ ఉంటాను. సుదీర్ఘకాలంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న బ్యాటర్ అతడు. అరంగేట్రం చేసినపుడు అతడి పరుగుల దాహం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది.
కోహ్లి లాంటి ఆటగాళ్లను...
అందుకే అతడు ప్రపంచస్థాయి క్రికెటర్‌గా ప్రసిద్ధి చెందాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాలోనూ పరుగులు రాబట్టేందుకు కోహ్లి ఎదురుచూస్తున్నాడు. కోహ్లి లాంటి ఆటగాళ్లను ఒక్క మ్యాచ్ లేదంటే ఒక్క సిరీస్‌లో వైఫల్యం కారణంగా జడ్జ్ చేయవద్దు.
ఎవరి కెరీర్‌లోనైనా ఎత్తుపళ్లాలు సహజం. అయినా.. ప్రతిసారీ వారిని వేలెత్తిచూపడం మంచిది కాదు. ఆటలో వైఫల్యాలు ఉంటాయి. అయితే, వాటిని అధిగమించి ముందుకు వెళ్తే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు అత్యుత్తమంగా రాణించలేరు.
ఎవరినీ తప్పించాలనే ఉద్దేశం ఉండదు
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ.. తగిన సూచనలు ఇవ్వడం నా విధి. జట్టుకు ఉపయోగపడే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను మాత్రమే మేము ఎంచుకుంటాం. అంతేగానీ.. ఎవరినీ తప్పించాలనే ఉద్దేశం మాకు ఉండదు.
వరుసగా ఎనిమిది టెస్టులు ఆడబోతున్నాం. మా వాళ్లంతా పరుగుల ఆకలి మీద ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాలని పట్టుదలగా ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి టీమిండియా టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో గంభీర్ సోమవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడాడు.
చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!
Comments
Please login to add a commentAdd a comment