ausis
-
వాళ్లు అందుకే గెలిచారు: సుప్రీం మాజీ జడ్జి కట్జూ సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ (World cup 2023) ఫైనల్లో భారత జట్టు ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీమిండియా ఘోర ఓటమిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతుండగా, వింత వాదనతో ఈ జాబితాలో మార్కండేయ కట్జూ చేరారు. ఆయన చెప్పిన కారణం వింటే నెటిజన్లు షాకవుతున్నారు. మహాభారత కాలంలో ఆస్ట్రేలియా ఆనాటి పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. వారు (ఆస్ట్రేలియా) ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం అంటూ జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ఒక రేంజ్లో స్పందించారు. ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేని అతని విచిత్రమైన సిద్ధాంతంపై నెటిజన్లుమండిపడుతున్నారు. ధన్యవాదాలు సార్...మీరు కామెడీ చేసి చాలా రోజులైందంటూ ఒక యూజర్ విమర్శించారు. దుబాయ్‌ని మిస్టర్ దూబే, ఈజిప్ట్ (హిందీలోమిస్ర్) మిశ్రా రూపొందించారు, ఇజ్రాయెల్‌ను యాదవులు, బహ్రెయిన్‌ను బ్రహ్మ దేవుడు, సౌదీ అరేబియాను సరస్వతి దేవి సృష్టించారా? అంటూ మరొక వినియోగదారుడు జస్టిస్ కట్జూపై మరొక యూజర్ ధ్వజమెత్తారు. Australia was the storage centre of the 'Astras' of Pandavas. It was called 'Astralaya'. This is the real reason why they won the World Cup. — Markandey Katju (@mkatju) November 20, 2023 కాగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటి మొదలు పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో స్లిప్-అప్ల వరకు, అన్ని మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చివరికి ట్రోఫీని అందుకునే అదృష్టాన్ని దక్కించుకోలేకపోవడంపై నిపుణులుమొదలు సామాన్యుడి దాకా అనేక విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన కట్జూ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి కారణాలను చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిస్ కట్జూ 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఏప్రిల్ 2006లో భారత సుప్రీంకోర్టు జడ్జికావడానికంటే ముందు వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. సెప్టెంబర్, 2011లో పదవీ విరమణ చేశారు. -
టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన శక్తి, వారి అభిరుచి మ్యాచ్ అంతా కనిపించిందని, ఈ గెలుపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జట్టుకు అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ తెలిపారు. (చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్క్ష్మణ్, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. కాగా ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌గా భావించే బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) January 19, 2021 EVERY SESSION WE DISCOVERED A NEW HERO. Every time we got hit, we stayed put & stood taller. We pushed boundaries of belief to play fearless but not careless cricket. Injuries & uncertainties were countered with poise & confidence. One of the greatest series wins! Congrats India. pic.twitter.com/ZtCChUURLV — Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021 Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND — VVS Laxman (@VVSLaxman281) January 19, 2021 The champions & the greatest chase!🙌#TeamIndia has proved it again by team efforts, great character, courage & max determination! Despite the bruises, the team made it possible for our country. That’s why we play for the country’s flag to go high every time we perfom🇮🇳#INDvAUS — Ishant Sharma (@ImIshant) January 19, 2021 -
నాలుగో వన్డేలో భారత్ పరాజయం
-
టర్నర్ విన్నర్
359 పరుగుల భారీ విజయలక్ష్యం... 12 పరుగులకే 2 వికెట్లు... అయితే ఆస్ట్రేలియా బెదరలేదు. తమకు అచ్చి వచ్చిన మైదానంలో ఆ జట్టు పట్టుదలగా నిలబడింది. హ్యాండ్స్కోంబ్, ఖాజా ఒక్కో పరుగు పేర్చుకుంటూ 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవకాశం సృష్టించారు. అయినా సరే వీరిద్దరితో పాటు మ్యాక్స్‌వెల్ వెనుదిరిగాక పరిస్థితి కష్టంగానే కనిపించింది. ఇంతలో ఇన్నింగ్స్‌ను తమవైపు టర్న్ చేస్తూ టర్నర్ దూసుకొచ్చాడు. కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న అతను ఒక్కసారిగా భారత బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కోహ్లి సేన ఈ అనూహ్య షాక్ నుంచి కోలుకునే లోపే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఫలితంగా తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించి ఆసీస్ సిరీస్‌లో నిలబడింది. అంతకుముందు వన్డేల్లో 100వసారి ఓపెనింగ్ భాగస్వాములుగా బరిలోకి దిగిన ధావన్, రోహిత్ శర్మ తమ స్థాయిని ప్రదర్శించారు. ఫలితంగా తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు భారీ పునాది పడింది. విరాట్ విఫలమైనా ఇతర బ్యాట్స్‌మెన్ తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరు నమోదైంది. అయితే ఇది కూడా జట్టు విజయానికి సరిపోలేదు. మంచు ప్రభావం ఉంటుందని తెలిసీ తమ బౌలర్లకు అలవాటేనంటూ కోహ్లి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా... చివర్లో మన బౌలర్లు చేతులారా మ్యాచ్‌ను వదిలేశారు. మొహాలీ: ఆస్ట్రేలియా అద్భుత ఆటతీరుతో వన్డే సిరీస్‌లో సమంగా నిలిచింది. ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (115 బంతుల్లో 143; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు. రోహిత్ శర్మ (92 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కమిన్స్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది. పీటర్ హ్యాండ్స్కోంబ్ (105 బంతుల్లో 117; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం నమోదు చేయగా, ఉస్మాన్ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆస్టన్ టర్నర్ (43 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో వన్డే బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓపెనింగ్ అదిరింది... వరల్డ్ కప్‌కు ముందు ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ధావన్ అందులో సఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలచి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతను చివరి వరకు అదే జోరును కొనసాగించాడు. వరుస బౌండరీలతో చెలరేగిన అతను ఒక దశలో 17 బంతుల వ్యవధిలో మరో 6 ఫోర్లు కొట్టడం విశేషం. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. ఇందులో ధావన్ 42 చేస్తే రోహిత్ చేసినవి 16 పరుగులే. ఆ వెంటనే ధావన్ 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 61 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరు ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. అయితే సెంచరీకి చేరువలో రోహిత్ వెనుదిరిగాడు. జంపా వేసిన తర్వాతి ఓవర్లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి ధావన్ (97 బంతుల్లో) శతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ధావన్ తాను ఎదుర్కొన్న 17 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా బెహ్రన్‌డార్ఫ్ ఓవర్లో వరుస బంతుల్లో కొట్టిన 4, 6, 4 అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఎట్టకేలకు కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతని ఆట ముగిసింది. ధావన్ ఔటయ్యాక 38 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 256/2. తర్వాతి 12 ఓవర్లలో జట్టు 102 పరుగులు జోడించగలిగింది. కోహ్లి (7) అరుదైన రీతిలో విఫలమైనా... రిషభ్ పంత్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) చలవతో స్కోరు 350 పరుగులు దాటగలిగింది. మరోవైపు మూడో స్థానంలో బరిలోకి దిగి తనకు లభించిన అతి కీలకమైన అవకాశాన్ని రాహుల్ (26; 1 ఫోర్) పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. కేదార్ జాదవ్ (10) కూడా విఫలం కాగా, 27 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన బుమ్రా... తన అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి సిక్స్ కొట్టడం విశేషం. భారీ భాగస్వామ్యం... ఆసీస్ ఇన్నింగ్స్‌లోని తొలి ఓవర్ నాలుగో బంతికే ఫించ్ (0)ను భువనేశ్వర్ బౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. కొద్ది సేపటికే షాన్ మార్‡్ష (6)ను బుమ్రా పెవిలియన్ పంపించాడు. అయితే ఖాజా, హ్యాండ్స్కోంబ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ భారీ భాగస్వామ్యంతో ఆసీస్‌ను ఆదుకున్నారు. ఈ జోడీని విడదీయడానికి భారత్ అన్ని ప్రయత్నాలూ చేసింది. జాదవ్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఫోర్ బాదిన హ్యాండ్స్కోంబ్ 99 వద్దకు చేరుకోగా... తర్వాతి ఓవర్లోనే ఖాజా ఔటై వరుసగా రెండో సెంచరీని చేజార్చుకున్నాడు. 92 బంతుల్లో హ్యాండ్స్కోంబ్ శతకం పూర్తి చేసుకోగా... క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) స్విచ్హిట్కు ప్రయత్నించి కుల్దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే కుల్దీప్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లతో 13 పరుగులు రాబట్టిన ఆసీస్ తమ జోరును కొనసాగించింది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి చహల్ బౌలింగ్‌లో హ్యాండ్స్కోంబ్ వెనుదిరగడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అయితే క్యారీ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు) అండగా టర్నర్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో మ్యాచ్ గతిని మార్చేసి 13 బంతుల ముందే గెలిపించాడు. టర్నింగ్ పాయింట్... ఆస్టన్ టర్నర్ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి ఆసీస్ 14 ఓవర్లలో 130 పరుగులు చేయాల్సి ఉంది. సొంతగడ్డపై భారత బౌలింగ్ బలగాన్ని బట్టి చూస్తే ప్రత్యర్థికి ఇది దాదాపు అసాధ్యమైన లక్ష్యం! కానీ టర్నర్ దానిని చేసి చూపించాడు. తానొక్కడే 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ప్రతీ బౌలర్‌పై అతను విరుచుకుపడ్డ తీరు అభినందనీయం. కుల్దీప్ బౌలింగ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో మొదలు పెట్టి చహల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో జోరును కొనసాగించాడు. భువనేశ్వర్ వేసిన 45వ ఓవర్లో టర్నర్ 2 సిక్సర్లు, ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గింది. బుమ్రా బౌలింగ్‌లో పూర్తిగా కుడి వైపునకు జరిగి ఫైన్ లెగ్ మీదుగా టర్నర్ కొట్టిన సిక్సర్ ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్. భువీ తర్వాతి ఓవర్లో అతను మళ్లీ 6, 4 బాదగా క్యారీ మరో ఫోర్‌తో దానిని కొనసాగించడంతో ఆసీస్ విజయానికి అడ్డు లేకుండా పోయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 38 పరుగులిచ్చాడు. ► 6 ఆరేళ్ళ విరామం తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయింది. ►27 వన్డేల్లో భారత జట్టు 350 అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన సందర్భాలు. ఈ విషయంలో దక్షిణాఫ్రికాతో భారత్ సమానంగా నిలిచింది. ►1 వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ధోని (217) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ (218) సవరించాడు. ఓవరాల్‌గా ధోని 224 సిక్స్‌లు కొట్టినా... ఏడు సిక్స్‌లు ఆసియా జట్టు తరఫున ఆడినపుడు వచ్చాయి. మళ్లీ మళ్లీ మిస్సింగ్... టర్నర్ 38 పరుగుల వద్ద ఉన్నప్పుడు చహల్ బౌలింగ్‌లో పంత్ సునాయాస స్టంప్‌ను వదిలేయడం కూడా భారత్ ఓటమికి కారణమైంది. ఆ తర్వాత అతను తన దూకుడుతో మరో 46 పరుగులు అదనంగా జోడించాడు. ఆ తర్వాత రెండు బంతుల వ్యవధిలో టర్నర్ ఇచ్చిన క్యాచ్‌లను జాదవ్, ధావన్ వదిలేశారు. మంచు ప్రభావం వల్ల బౌలర్లకు పట్టు చిక్కలేదనేది వాస్తవమే అయినా ఇంత భారీ స్కోరును కూడా భారత్ కాపాడుకోలేకపోవడం అనూహ్యం. ఎవరీ టర్నర్? హైదరాబాద్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన టర్నర్‌కు ఇది రెండో వన్డే మాత్రమే. 2017 ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన టర్నర్ గత రెండేళ్లలో మూడు సార్లు గాయపడటంతో మూడు సార్లు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. వన్డేలకు ముందు 5 టి20లు ఆడినా మొత్తం కలిపి చేసింది 26 పరుగులే. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా కెరీర్‌ను ఆరంభించినా ఆ తర్వాత సూపర్ ఫినిషర్‌గా మారాడు. గత రెండేళ్లలో బిగ్‌బాష్ లీగ్‌లో 15 నుంచి 20 ఓవర్ల మధ్య అతనిలా 194.69 స్ట్రయిక్‌రేట్‌తో... 48.40 సగటుతో ఎవరూ పరుగులు చేయలేకపోయారు. 2019 బిగ్‌బాష్‌లో అతను ఆసీస్ క్రికెట్లో కొత్త సంచలనంగా మారాడు. ఇందులో పెర్త్ స్కార్చర్స్ తరఫున టర్నర్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వరుసగా 49, 24, 60 నాటౌట్, 43 నాటౌట్, 60, 1 పరుగులు చేశాడు. చాలా కాలంగా ఆసీస్‌ను వేధిస్తున్న డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కొరతను టర్నర్ పూర్తి చేయగలడని సెలక్టర్లు నమ్మారు. సొంతగడ్డపై భారత్‌తో సిరీస్ ఎంపికైనా మ్యాచ్ అవకాశం దక్కలేదు. మొహాలీ వన్డేలో కూడా స్టొయినిస్ గాయంతో దూరం కావడంతో తుది జట్టులోకి వచ్చాడు. భారత గడ్డపై టర్నర్ తాజా ప్రదర్శన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌ను కచ్చితంగా సంతోషపెట్టి ఉంటుంది. ఫినిషర్ రూపంలో టర్నర్‌ను చూస్తున్న ఆ జట్టు రూ. 50 లక్షలకు అతడిని దక్కించుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్ అవకాశం చేజారింది. ఫీల్డింగ్ బాగా లేదు. డీఆర్ఎస్ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది. – కోహ్లి, భారత కెప్టెన్ -
విరాట్ వీరోచితం సరిపోలేదు
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి సెంచరీ చేయడం... భారత్ గెలవకపోవడమా! గతంలో 24 శతకాల్లో మూడు సార్లు మాత్రమే ఇలా జరిగింది. ఇది శుక్రవారం రాంచీలో మళ్లీ చోటు చేసుకుంది. తనకే సాధ్యమైన రీతిలో వరుసగా మరో శతకంతో భారత కెప్టెన్ మెరిసినా చివరకు విజయానందం మాత్రం దక్కలేదు. ముందుగా బ్యాటింగ్‌లో, ఆ తర్వాత బౌలింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా తొలి విజయంతో వన్డే సిరీస్‌లో నిలిచింది. ఖాజా తొలి సెంచరీ, ఫించ్ చక్కటి బ్యాటింగ్ ఆ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపిరి పోస్తే... 314 పరుగుల లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో కోహ్లి మినహా మరే బ్యాట్స్‌మన్ కూడా కనీసం 40 పరుగులు చేయలేకపోవడం టీమిండియా ఓటమికి కారణమైంది. సొంత అభిమానుల మధ్య చివరి మ్యాచ్‌లో వారి జయజయధ్వానాల మధ్య బరిలోకి దిగిన ధోని ఆటగాడిగా మాత్రం అద్భుతం చేయలేకపోయాడు. రాంచీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సొంతం చేసుకునే లక్ష్యంతో మూడో వన్డే బరిలోకి దిగిన భారత్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (113 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (99 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించడం విశేషం. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తనవంతు పాత్ర పోషించగా, కుల్దీప్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (95 బంతుల్లో 123; 16 ఫోర్లు, 1 సిక్స్) వన్డేల్లో 41వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్, కమిన్స్, జంపా తలా 3 వికెట్లు తీశారు. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం... భారత బౌలర్ల అరుదైన వైఫల్యంతో ఈ పర్యటనలో ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించగలిగారు. ఫించ్ ఫామ్‌లోకి రాగా, ఖాజా మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు కొట్టగా... అదే ఓవర్లో ఫించ్ ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్ఎస్ను ఆశ్రయించిన భారత్ తమ రివ్యూను కూడా కోల్పోయింది. జడేజా తొలి ఓవర్లో ఖాజా స్కోరు 17 వద్ద ధావన్ క్యాచ్ వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్ స్కోరు 52 పరుగులకు చేరింది. ‘ట్రంప్‌కార్డ్’ జాదవ్ ఓవర్లో ఫించ్ పండగ చేసుకున్నాడు. వరుస బంతుల్లో 6, 4, 6 బాదిన అతను 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికే ఖాజా హాఫ్ సెంచరీ (56 బంతుల్లో) కూడా పూర్తయింది. మరికొన్ని చక్కటి షాట్ల తర్వాత సెంచరీకి చేరువవుతున్న తరుణంలో వివాదాస్పద నిర్ణయంతో ఫించ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో చెలరేగి స్కోరు జోరును కొనసాగించాడు. జడేజా ఓవర్లో అతను వరుసగా 6, 4, 4 బాదాడు. అదే ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా సింగిల్ తీసి ఖాజా తన కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే వెంటనే షమీ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 244 పరుగులు. ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ స్థితినుంచి భారత బౌలింగ్ ఒక్కసారిగా కట్టుదిట్టంగా మారిపోయింది. జడేజా చక్కటి ఫీల్డింగ్‌కు ధోని చురుకుదనం తోడై మ్యాక్స్‌వెల్ రనౌట్ కాగా...కుల్దీప్ ఒకే ఓవర్లో షాన్ మార్‡్ష (7), హ్యాండ్స్కోంబ్ (0)లను ఔట్ చేశాడు. స్టొయినిస్ (26 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు), అలెక్స్ క్యారీ (17 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 50 పరుగులు జోడించినా... చివరి పది ఓవర్లలో ఆసీస్ 69 పరుగులే చేయగలిగింది. కొనసాగిన కోహ్లి జోరు... ఛేదనలో భారత బ్యాటింగ్ కూడా తడబడింది. 27 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. తన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా వేసిన రిచర్డ్సన్... ధావన్ (1) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత కమిన్స్ వరుసగా రెండు ఓవర్లలో రోహిత్ (14), అంబటి రాయుడు (2)లను ఔట్ చేశాడు. ఈ దశలో కోహ్లి, ధోని (42 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకున్నారు. సొంత ప్రేక్షకుల సమక్షంలో ధోని కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రిచర్డ్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అనంతరం లయన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా ధోని కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే జంపా వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని మాజీ కెప్టెన్ నిష్క్రమించడంతో రాంచీ మైదానం ఒక్కసారిగా మూగబోయింది. మరోవైపు కోహ్లి మాత్రం తన స్థాయికి తగిన ఆటతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఆసీస్ జట్టులో బలహీన బౌలర్ అయిన స్టొయినిస్ వేసిన వరుస రెండు ఓవర్లలో కలిపి అతను 5 ఫోర్లు బాదడం విశేషం. కోహ్లికి సహకరించిన జాదవ్ (39 బంతుల్లో 26; 3 ఫోర్లు)ను జంపా ఔట్ చేయడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో 98 పరుగుల వద్ద కీపర్ క్యారీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి అదే ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ కావడంతో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో విజయ్ శంకర్ (30 బంతుల్లో 32; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (31 బంతుల్లో 24; 1 సిక్స్) కొంత పోరాడినా లాభం లేకపోయింది. ‘ఆర్మీ’ క్యాప్లతో బరిలోకి... పుల్వామా ఘటనలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు భారత క్రికెటర్లు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. మూడో వన్డేలో జట్టు సభ్యులంతా ఆర్మీ అధికారులు ధరించే ‘క్యామోఫ్లాగ్’ క్యాప్‌లు ధరించి బరిలోకి దిగారు. బీసీసీఐ లోగోతో ఉన్న ఈ క్యాప్‌ను నైకీ ప్రత్యేకంగా రూపొందించింది. రాంచీ వన్డే ద్వారా తమకు లభించే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (సుమారు కోటి రూపాయలు) కూడా ‘జాతీయ రక్షణ నిధి’కి అందిస్తున్నట్లు కెప్టెన్ కోహ్లి ప్రకటించాడు. ‘ప్రత్యేక క్యాప్’ను ధరించే విషయంలో నిబంధనల గురించి ఐసీసీకి బీసీసీఐ ముందుగానే సమాచారం అందించి అనుమతి పొందింది. వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోనిదే ఈ ఆలోచన. భారత సైన్యంలో గౌరవ హోదాలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న అతనే స్వయంగా జట్టు సహచరులకు క్యాప్‌లు అందించాడు. కామెంటరీ బృందంలో ఉన్న గావస్కర్, మంజ్రేకర్ తదితర భారత మాజీలు కూడా ఇవే క్యాప్‌లను ధరించారు. టాస్కు డయానా ఎడుల్జీ... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ క్రికెటర్, ప్రస్తుత సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీని బీసీసీఐ టాస్ వేసే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది. టాస్ వేసేందుకు కోహ్లికి ఎడుల్జీ నాణెం అందించింది. 63 ఏళ్ల ఎడుల్జీ భారత్ తరఫున 20 టెస్టులు, 34 వన్డేలు ఆడింది. రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. తర్వాతి మ్యాచ్‌లకు మార్పులు ఖాయం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి. – కోహ్లి చివరి 2 వన్డేలకు ధోని దూరం ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు వన్డేలలో ఎమ్మెస్ ధోని బరిలోకి దిగడం లేదు. ఈ మ్యాచ్‌ల నుంచి అతను విశ్రాంతి కోరాడని భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ నిర్ధారించాడు. వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యే అవకాశం ఉండటంతో... తన స్వస్థలం రాంచీలో మూడో వన్డే ఆడిన ధోనికి బహుశా స్వదేశంలో ఇదే చివరి మ్యాచ్ కావచ్చు. ధోని గైర్హాజరులో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఆడించే అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లలో కచ్చితంగా మార్పులు ఉంటాయని కెప్టెన్ కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. -
నిదాహస్ పాఠాలు నేర్పింది!
నాగపూర్: గత ఏడాది మార్చి 18న నిదాహస్ ట్రోఫీ ఫైనల్ తర్వాత విజయ్ శంకర్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. కెరీర్లో తొలి టోర్నీ ఆడుతున్న అతను ఒత్తిడిలో సరైన విధంగా స్పందించలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో వరుసగా డాట్ బంతులు ఆడటం, కనీసం స్ట్రయిక్ రొటేట్ చేయలేకపోవడంతో ఒక దశలో భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. చివరకు దినేశ్ కార్తీక్ చలవతో మ్యాచ్ గెలిచినా... అభిమానులు విజయ్‌పై మాత్రం విరుచుకుపడ్డారు. ఇప్పుడు సరిగ్గా సంవత్సరం తర్వాత అతను బౌలింగ్‌లో ఒక చక్కటి ఓవర్‌తో భారత్‌ను గెలిపించాడు. అయితే నాటి మ్యాచ్‌ను తాను మర్చిపోలేదని, దాని నుంచి ఎంతో నేర్చుకున్నానని శంకర్ అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నిదాహస్ ట్రోఫీ నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. స్థితప్రజ్ఞతతో ఉండటం ఎలాగో తెలిసింది. పరిస్థితులు చాలా బాగా ఉన్నా, ప్రతికూలంగా కనిపిస్తున్నా అన్ని సమయాల్లో ప్రశాంతంగా, తటస్థంగా ఉండాలని అర్థమైంది’ అతని అతను చెప్పుకొచ్చాడు. రెండో వన్డే చివరి ఓవర్లలో ఏదో ఒకటి తాను వేయాల్సి వస్తుందని ముందే ఊహించానని, 10–15 పరుగులను కాపాడుకోవాల్సి వస్తుంది కాబట్టి మానసికంగా సిద్ధంగానే ఉన్నానని అతను వెల్లడించాడు. బంతి కొంత రివర్స్ స్వింగ్ అవుతోందని, సరైన లెంగ్త్‌లో నేరుగా వికెట్లపైకి వేస్తేనే ఫలితం దక్కుతుందని బుమ్రా చెప్పిన సూచనను తాను పాటించానన్నాడు. తాజా ప్రదర్శనతో వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమైందా అనే ప్రశ్నకు స్పందిస్తూ విజయ్... దాని గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ‘జట్టులో చోటు, వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికవంటి వాటి గురించి నేను అతిగా ఆలోచించను. ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. ఇందులో ప్రతీ మ్యాచ్ కీలకమే. నేను బాగా ఆడి జట్టును గెలిపించడమే ముఖ్యం’ అని ఈ తమిళనాడు ఆల్‌రౌండర్ పునరుద్ఘాటించాడు. -
నేడు హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే
-
కౌంట్‌డౌన్ 5..4..3..2..1...
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అనేది పేరుకు మాత్రమే. అటు భారత ఆటగాళ్ల దృష్టిలో, మన అభిమానుల కోణంలో కూడా రాబోయే వరల్డ్ కప్ గురించే ఆలోచనలన్నీ. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు మనవాళ్లు ఎలా ఆడతారు? మిగిలిపోయిన లోపాలేమైనా ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకుంటారు? అన్ని బాగా కుదిరాయి అనుకున్నా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయేమో? ఆసీస్‌తో సిరీస్‌ను కెప్టెన్ కోహ్లి సహా టీమ్ మేనేజ్మెంట్ ఇదే రీతిలో చూస్తోంది. ప్రపంచ కప్ కోసం దాదాపుగా ఇదే జట్టు అయినా చివరి ఒకటి లేదా రెండు స్థానాలు దక్కించుకునే ప్రయత్నంలో అవకాశం అందుకున్న వారు ఎలా రాణిస్తారనేది కీలకం కానుంది. ఈ నేపథ్యంలో విశ్వపోరుకు కౌంట్‌డౌన్‌గా సాగబోతున్న సిరీస్ తొలి మ్యాచ్‌కు భాగ్యనగరం వేదికైంది. టి20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా 50 ఓవర్ల పోరును ఎలా ప్రారంభిస్తుందనేది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్:వన్డే ప్రపంచ కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు దాదాపు వంద రోజుల సమయం ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్‌తో ఇప్పటి నుంచే వరల్డ్ కప్ వేడి కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో పోరుకు తెర లేవనుంది. అనూహ్యంగా స్వదేశంలో టి20 సిరీస్ ఓడిన అనంతరం కోహ్లి సేన తన అసలు సత్తాను ప్రదర్శించాలని పట్టుదలగా ఉండగా, అటు విజయం ఇచ్చిన కొత్త ఉత్సాహంతో కంగారూలు ఆటకు సిద్ధమయ్యారు. రాహుల్‌కు అవకాశముందా! కోహ్లి నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో చివరిసారిగా ఆడింది. సిరీస్ గెలిచాక జరిగిన తర్వాతి రెండు వన్డేలలో టీమిండియా ప్రయోగాలు చేసింది. కాబట్టి మూడో వన్డే జట్టునే తీసుకుంటే తుది 11 మంది విషయంలో సందేహాలు అనవసరం. రోహిత్, ధావన్‌ల ఓపెనింగ్‌కు తోడు కోహ్లి మూడో స్థానంలో ఎప్పటిలా చెలరేగితే భారత్ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. నాలుగో స్థానాన్ని ఖాయం చేసుకున్న అంబటి రాయుడు సొంతగడ్డపై తనదైన శైలిలో మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్లో ఆ తర్వాత జాదవ్, ధోని అతడిని అనుసరిస్తారు. వీరిద్దరినుంచి జట్టు మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యా గైర్హాజరు నేపథ్యంలో ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌కు మరో అవకాశం దక్కడం ఖాయం. ఇద్దరు స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్ యాదవ్ మళ్లీ చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. బుమ్రా, షమీ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగుతారు. కాబట్టి మూడో పేసర్‌గా సిద్ధార్థ్ కౌల్ తొలి రెండు వన్డేలకు ఎంపికైనా... అతనికి తుది జట్టులో చోటు కష్టమే. మరోవైపు వన్డేల్లో సత్తా నిరూపించుకోవాలని ఆశిస్తున్న కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు మేనేజ్మెంట్ ఎలా అవకాశం కల్పిస్తుందనేది చూడాలి. విజయ్ శంకర్‌కు బదులుగా వీరిద్దరిలో ఒకరికి చోటిస్తే ఐదో బౌలర్ కోటా పూర్తి చేయడం కష్టమవుతుంది. రాహుల్‌పై జట్టు పెంచుకున్న నమ్మకం, కోహ్లి మద్దతు చూస్తే అతడిని ఈ సిరీస్‌లో తగిన విధంగా పరీక్షించాలని జట్టు భావిస్తోంది. అదే జరిగితే రాయుడు స్థానంలో ఆడించవచ్చు. మరోవైపు అనూహ్యంగా వన్డేల్లో చోటు కోల్పోయిన దినేశ్ కార్తీక్ కూడా టీమ్ బయట నుంచి జట్టు ప్రదర్శన చూస్తూ తన ఆశలు పెంచుకుంటాడనడంలో సందేహం లేదు. ఫించ్తోనే సమస్య! టి20 సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న జోరులో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. భారత గడ్డపై వన్డేల్లో మంచి రికార్డు ఉండటం ఆసీస్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఆసీస్ టి20, వన్డే సిరీస్‌ల కోసం ఒకే జట్టుతో భారత్‌కు వచ్చింది. అయితే కొందరు ప్రధాన ఆటగాళ్లు వన్డేల్లోకి బరిలోకి దిగనున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు ఫించ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, హ్యాండ్స్కోంబ్లను మినహాయిస్తే కొన్ని మార్పులు ఉంటాయి. వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా, మూడో స్థానంలో ఉస్మాన్ ఖాజా ఆడతాడు. ఇద్దరు స్పిన్నర్ల కూర్పు అయితే∙ఆడమ్ జంపాతో పాటు ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ బరిలోకి దిగుతాడు. టెస్టుల్లో అద్భుతమైన ఆటగాడైన లయన్ భారత గడ్డపై తెల్ల బంతితో ఎలా రాణిస్తాడో చూడాలి. వన్డే స్పెషలిస్ట్ ఆస్టన్ టర్నర్‌పై కూడా ఆసీస్ బాగా ఆశలు పెట్టుకుంది. అయితే టి20లతో పోలిస్తే భారత బౌలింగ్‌ను ఎదుర్కొని 50 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా నిలబడగలదా అనేదే సమస్య. ఇటీవల సొంతగడ్డపైనే ఆ జట్టు భారత్ చేతిలో సిరీస్ కోల్పోయింది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు చెలరేగుతుండగా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా తన ముద్ర వేయలేకపోయారు. సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన షాన్ మార్‡్ష వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమయ్యాడు. శుక్రవారం ఉదయమే అతను హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అన్నింటికి మించి కెప్టెన్ ఫించ్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. గత 7 వన్డేల్లో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. టాపార్డర్‌లో అతను చెలరేగితేనే ఆసీస్ విజయంపై ఆశలు పెంచుకోవచ్చు. పేస్‌లో కమిన్స్‌తో పాటు కూల్టర్‌నీల్, రిచర్డ్సన్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. పిచ్, వాతావరణం రాజీవ్‌గాంధీ స్టేడియంలో చక్కటి బ్యాటింగ్ వికెట్ సిద్ధం. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. నగరంలో మార్చి తొలి వారం ఎండలు ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి వాతావరణం వల్ల ఆటకు ఎలాంటి సమస్య లేదు. ఆ ‘175’ గుర్తుందా? 463 వన్డేలాడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్లో డబుల్ సెంచరీ తర్వాతి స్థానం 175 పరుగుల ఇన్నింగ్స్‌దే. దానికి వేదికగా నిలిచింది ఉప్పల్ మైదానమే. నాటి ప్రత్యర్థి కూడా ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2009 నవంబరు 5న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో తొలుత వీరేంద్ర సెహ్వాగ్ (38), తర్వాత సురేశ్ రైనా (59) తోడుగా సచిన్ వీరోచిత ఇన్నింగ్స్ (141 బంతుల్లో 175; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడాడు. కానీ, లక్ష్యానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమైన స్థితిలో సచిన్ ఔటవడంతో టీమిండియా 347 పరుగుల వద్దే ఆగి 3 పరుగులతో ఓడింది. అయినా సరే భారీ స్కోర్ల ఈ మ్యాచ్ అభిమానులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 0–2 ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 వన్డేలు జరగ్గా రెండూ ఆసీస్ గెలిచింది. 2007లో 47 పరుగులతో, 2009లో 3 పరుగులతో నెగ్గింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు/రాహుల్, జాదవ్, ధోని, విజయ్ శంకర్, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖాజా, టర్నర్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, కారీ, జంపా, కమిన్స్, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్/లయన్. ఓటమి ఎదురైనా ప్రయోగాలు చేయాలని లేదు... ఒక్కో ఆటగాడిని వేర్వేరు పరిస్థితుల్లో పరీక్షిస్తున్నాం. ప్రతీ జట్టులాగే వరల్డ్ కప్‌కు ముందు అన్నీ చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నాలుగో స్థానంలో ఆడేందుకు నాకెలాంటి సమస్య లేదు. çవరల్డ్ కప్ తుది జట్టు ఎలా ఉంటుందో నేను చెప్పలేను కానీ రాహుల్ తన ఆటతో కచ్చితంగా అవకాశం సృష్టించుకున్నాడు. టి20 సిరీస్ ముగిసిన కథ. బాగా ఆడలేదు కాబట్టే ఓడాం. ఓటమి ఎదురైనా ప్రయోగాలు చేయాలని నేను అనుకోను. మేమంతా గెలవడం కోసమే ఆడుతున్నాం. వరల్డ్ కప్ జట్టు ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన పాత్ర ఏమీ ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ మొదలయ్యే సమయానికే జట్టు ఏమిటో తెలిసిపోతుంది. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ ►మధ్యాహ్నం గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
విజయమే సమంజసం
2008లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో పరాజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే... టి20 ఫార్మాట్లో టీమిండియా ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాకు సిరీస్‌ను కోల్పోలేదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లను గెల్చుకోవడమో లేదా సమంగా ముగించడమో చేసింది. కానీ, ఇప్పుడు సొంతగడ్డపై ఓటమి ముప్పు పొంచి ఉంది. దీనిని తప్పించుకోవాలంటే... తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కోహ్లి సేన బెంగళూరులో అమీతుమీకి సిద్ధమవుతోంది. అజేయ రికార్డును నిలబెట్టుకోవాలన్నా, అపజయ శకునాలు లేకుండా ప్రపంచ కప్‌నకు సిద్ధమవ్వాలన్నా చిన్నస్వామి స్టేడియంలో భారత్ పెద్ద ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. మరి ఇందులో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి. బెంగళూరు: బ్యాటింగ్‌లో విఫలమై బౌలింగ్‌లో అనూహ్యంగా పుంజుకున్నా, విశాఖపట్నంలో జరిగిన తొలి టి20ని త్రుటిలో ఆస్ట్రేలియాకు చేజార్చుకుంది టీమిండియా. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనుకబడి ఆత్మరక్షణలో పడింది. పొట్టి ఫార్మాట్లో తొలిసారిగా, అందులోనూ స్వదేశంలో ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయారన్న విమర్శలను తప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో చిక్కుకుంది. దీంతో బుధవారం బెంగళూరులో జరుగనున్న రెండో మ్యాచ్‌ను కోహ్లి సేన తీవ్రంగా తీసుకోనుంది. మరోవైపు ఇన్నాళ్లూ కొంత బలహీనంగా ఉన్న టి20ల్లో కంగారూలు క్రమంగా మెరుగవుతూ వస్తున్నారు. ఒత్తిడిని తట్టుకుని విశాఖలో సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దీనికితోడు భారత్‌పై ‘తొలిసారి’ టి20 సిరీస్ గెలుపు వారిని ఉత్సాహపరుస్తోంది. ఇరు జట్లకూ ప్రతిష్ఠాత్మకమైన నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో జరిగే ఈ మ్యాచ్ అభిమానులకు వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తోంది. మార్పులు ఎన్ని? తొలి టి20లో రెగ్యులర్ ఓపెనర్ ధావన్‌ను తప్పించిన భారత జట్టు మేనేజ్మెంట్... ఈసారి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానాల్లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, పేసర్ సిద్థార్థ్ కౌల్‌ను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంత టి20 అయినా తుది జట్టులో ఒకేసారి మూడు మార్పులు చేస్తారా? అనేది అనుమానం. ఓపెనర్ల రొటేషన్, ఒత్తిడి తగ్గించడం అనే కోణంలో ఆలోచిస్తే రోహిత్ స్థానంలో ధావన్ రావొచ్చు. బౌలింగ్‌లో మరో ప్రత్యామ్నాయం కావాలని భావిస్తే శంకర్‌కు చోటు దక్కుతుంది. విశాఖలో ఉమేశ్ చివరి ఓవర్ వైఫల్యం కౌల్‌ను ఎంచుకునేలా చేస్తోంది. మరోవైపు పునరాగమనంలో రాహుల్ ఆకట్టుకున్నాడు. సొంత నగరంలో మరింత చెలరేగితే అతడితో పాటు జట్టుకూ మేలు. పంత్ లేకుంటే దినేశ్ కార్తీక్‌పై మరింత భారం పడుతుంది. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన అతడు పొట్టి ఫార్మాట్లోనూ వేటు పడకుండా ఉండాలంటే కచ్చితంగా రాణించాలి. కెప్టెన్ కోహ్లి తనదైన ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. నెమ్మదైన పిచ్‌ను ఓ కారణంగా చెప్పుకొన్నా, చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ వెటరన్ ధోని విశాఖలో పరుగులు సాధించలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరులో వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీరంతా పుంజుకుని భారీ స్కోర్లు చేస్తే కంగారూలకు కష్టాలు తప్పవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బుమ్రా పేస్‌ను ఎదుర్కొనడం ఎంత కష్టమో ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లో తెలిసొచ్చింది. ముఖ్యంగా అతడి యార్కర్ల పదునేంటో 19వ ఓవర్లో వేసిన బంతి చెబుతోంది. అంచనాలు నిలబెట్టుకుంటే కౌల్ స్థిరమైన కెరీర్‌కు బాటలు పడతాయి. స్పిన్ త్రయంలో కృనాల్ పాండ్యా తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. కొత్త కుర్రాడు మయాంక్ మార్కండే మాయాజాలం అంతర్జాతీయ స్థాయికి చాటాలి. వీరిద్దరితో పోలిస్తే చహల్ కొంత వెనుకంజలో ఉన్నట్లే. ప్రత్యర్థులు అతడి బౌలింగ్‌ను చదివేసినట్లు కనిపిస్తోంది. చహల్ మేల్కొనాల్సిన సమయం వచ్చింది. ఆసీస్... అలాగే(నా)! చివరి ఓవర్లో అయినప్పటికీ తొలి మ్యాచ్ విజయం ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చి ఉంటుంది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ మెరుపులు, పేసర్ల పొదుపైన బౌలింగ్ ఆకట్టుకుంది. అయితే, బెంగళూరులో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పులో మార్పులుండొచ్చు. స్టొయినిస్‌లాంటి ఆటగాడిని ఓపెనర్‌గా పంపడంపై పునరాలోచన చేయొచ్చు. కెప్టెన్ అరోన్ ఫించ్ వన్‌డౌన్‌లోనే వస్తాడంటున్నారు. దీంతో టర్నర్‌ను పక్కనపెట్టి ఇన్నింగ్స్‌ను ఆరంభించగల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీని తీసుకుంటారని భావిస్తున్నారు. తద్వారా హ్యాండ్స్‌కోంబ్‌ను పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా పంపొచ్చు. విశాఖలో పేసర్లు కమిన్స్, బెహ్రెన్‌డార్ఫ్ పరుగులు కట్టడి చేయగా, కూల్టర్‌నీల్ టీమిండియాను దెబ్బకొట్టాడు. ఏకైక స్పిన్నర్‌గా ఆడమ్ జంపానే ఆడించొచ్చు. మొత్తమ్మీద ఒక్క మార్పుతోనే ఆసీస్ బరిలోకి దిగుతుందని అంచనా. తుది జట్లు (అంచనా) భారత్: రాహుల్, రోహిత్/ధావన్, కోహ్లి (కెప్టెన్), పంత్/విజయ్ శంకర్, ధోని, దినేశ్ కార్తీక్, కృనాల్, ఉమేశ్/సిద్ధార్థ్ కౌల్, చహల్, మార్కండే, బుమ్రా. ఆస్ట్రేలియా: స్టొయినిస్, షార్ట్, ఫించ్ (కెప్టెన్), మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్కోంబ్, టర్నర్, కూల్టర్‌నీల్, కమిన్స్, జే రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్, జంపా. ►రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం చిన్నస్వామి మైదానం పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం. వాతావరణం వేడిగా ఉండనుంది. -
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె...
ఆస్ట్రేలియా గడ్డపై మ్యాచ్‌లు అంటే మన దగ్గర శీతాకాలంలో సూర్యోదయానికి ముందే లేచి చలిలో వణుకుతూ కూడా ఆటను చూడటం నాటి లాలా అమర్నాథ్ తరం నుంచి నేటి ధోని తరం భారత అభిమానుల వరకు అందరికీ అనుభవమే. క్రికెట్‌ను ఆస్వాదించడంలో ఎక్కడా తగ్గకపోయినా తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం చివరకు మనకు నిరాశే. ఈసారి గెలుస్తారేమో... తప్పక గెలుస్తారు... గెలవడం తప్ప మరో మాటకు తావు లేదు... ఇప్పుడైనా గెలుస్తారేమో... ప్రతీ సిరీస్‌కు ముందు ఆశలు పెట్టుకోని అభిమాని లేడు. మధ్యలో కొన్ని సార్లు గెలుపునకు అతి చేరువగా వచ్చి కూడా అనూహ్యంగా ఆ ఆనందాన్ని దూరం చేసిన క్షణాలు కూడా బోలెడు. అయితే ఇక గెలవగలరా అనే మాట తలపున కూడా రానీయకుండా... భారత జట్టు సిరీస్ విజయం కోసం తపించిన ప్రతీ అభిమాని గర్వపడే రోజు వచ్చింది. ఇంతకంటే మంచి అవకాశం లేదంటూ కంగారూ గడ్డపై అడుగు పెట్టిన కోహ్లి సేన దానిని చేసి చూపించింది. ఆసీస్ గడ్డపై తొలిసారి సిరీస్ జయకేతనాన్ని ఎగరవేసింది. గావస్కర్, కపిల్ దేవ్‌లాంటి దిగ్గజాలు ప్రయత్నించారు. బిషన్ సింగ్ బేది బృందం త్రుటిలో అవకాశం చేజార్చుకుంది. అజహరుద్దీన్‌కు విజయం అందనంత దూరంలో నిలిస్తే కుంబ్లేకు కూడా అది సాధ్యం కాలేదు. మధ్యలో గంగూలీ విజయసౌరభం విరబూయించినా ఆఖరి మెట్టుపై అదృష్ట దేవత దూరంగా వెళ్లిపోయింది. కంగారూ గడ్డపై కెప్టెన్‌గా ధోనికి మిగిలింది అవమానభారమే. సర్వాంతర్యామి సచిన్ టెండూల్కర్... ఆసీస్ ఆటగాళ్ల గుండెల్లో నిద్రబోయిన వీవీఎస్ లక్ష్మణుడు... విధ్వంసానికి మారుపేరైన వీరేంద్రుడు... ‘వాల్’ రాహుల్‌లాంటి వాళ్ల జమానాలో కూడా సిరీస్ గెలుపు కలగానే మిగిలి పోయింది. కానీ విరాట్ బృందం విశ్వరూపం చూపించింది. ఒక సెషన్‌లోనో, ఒక రోజులోనో పట్టు బిగించి తర్వాత దానిని సడలించే పాత కాలపు అలవాటును ఛేదించింది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రత్యర్థిని వారి సొంతగడ్డపై ఒక ఆటాడుకుంది. మధ్యలో ఓటమి ఎదురైనా కుంగిపోలేదు. అంతే వేగంతో మళ్లీ పైకి లేచి కొత్త చరిత్రను సృష్టించింది. ఎన్నాళ్లుగానో వేచిన ‘ఉదయాన్ని’ అభిమానులకు చూపించి సంబరాల్లో ముంచింది. సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం పూర్తయింది. వర్షం కారణంగా చివరిదైన నాలుగో టెస్టు ఆఖరి రోజు ఒక్క బంతి కూడా పడలేదు. ఆసీస్ ఓవర్‌నైట్ స్కోరు 6/0 వద్దనే ఆట ఆగిపోయింది. దాంతో సిడ్నీ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. అడిలైడ్, మెల్బోర్న్ టెస్టులలో భారత్ గెలవగా... పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. ఫలితంగా ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారి సిరీస్ గెలిచినట్లయింది. ఎప్పుడో 1947–48 సిరీస్‌తో మొదలు పెట్టి 2014–15 వరకు 11 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా 8 సార్లు ఓడిపోగా... 3 సార్లు సమంగా నిలిచింది. ఎట్టకేలకు 72 ఏళ్ల తర్వాత 12వ ప్రయత్నంలో విజయం భారత్ సొంతమైంది. సోమవారం ఆస్ట్రేలియా సమయం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సింది. అయితే వర్షం వెంటాడటంతో ఆటగాళ్లు గ్రౌండ్లోకి వెళ్లాల్సిన అవసరమే రాలేదు. పదే పదే అంపైర్లు తనిఖీలు, చర్చల అనంతరం చివరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో భారత్ సిరీస్ విజయం ఖాయమైంది. చతేశ్వర్ పుజారా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో పాటు మొత్తంగా సిరీస్‌లో మూడు సెంచరీలు సహా 74.42 సగటుతో 521 చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’అవార్డు కూడా గెలుచుకున్నాడు. సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 622/7 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 300; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 6/0. ప్రశంసలు వెల్లువెత్తాయిలా... ►కంగారూ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తదితరులు కోహ్లిసేనను ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు. ► ఆసీస్‌లో టెస్టు సిరీస్ గెలవాలన్న భారత క్రికెట్ అంతిమ లక్ష్యాన్ని కోహ్లి అండ్ కో పూర్తిచేసింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో సాధించిన ఈ విజయం మమ్మల్ని గర్వపడేలా చేసింది. ఇకపై దీన్నే అలవాటుగా చేసుకోవాలి – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ►ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమిండియాకు శుభాభినందనలు. ఈ సిరీస్‌లో సమష్టిగా అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత్‌కే విజయార్హత ఉంది. – ప్రధాని నరేంద్ర మోదీ ► ఆసీస్‌లో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా ఘనచరిత్ర సృష్టించిన టీమిండియాకు అభినందనలు. విరాట్ సారథ్యం, పుజారా బ్యాటింగ్ అద్భుతం. కొత్తేడాదిలో జాతికి గొప్ప కానుక ఇచ్చారు. వన్డేల్లోనూ ఇదే జోరు కొనసాగాలి. –బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ► ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు అభినందనలు. మనందరికీ ఇది గర్వపడే క్షణం. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ► భారత జట్టుకు అభినందనలు. చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిస్తే బౌలింగ్‌లో బుమ్రా అద్భుతం. –హర్భజన్ సింగ్ భారత క్రికెట్లో గొప్ప రోజు. ఆటగాళ్ల పట్టుదల అపూర్వం. కుర్రాళ్ల ప్రదర్శన గర్వకారణం. వారితో కలిసి సీనియర్లు బాధ్యత పంచుకోవడంతో ప్రత్యేక విజయం సాధ్యమైంది. రిషభ్, కుల్దీప్లకు మంచి భవిష్యత్తు ఉంది. – సచిన్ టెండూల్కర్ ► చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఇది సమష్టి ప్రదర్శన. కుర్రాళ్లు సాధించిన ఘనతను చూస్తే చాలా సంతృప్తికరంగా ఉంది. – వీవీఎస్ లక్ష్మణ్ ►ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్ గెలిచిన కోహ్లి, అతని సహచరులకు నా అభినందనలు. అన్ని రంగాల్లో ఆసీస్‌పై ఆ జట్టు ఆధిపత్యం కనబర్చింది. – మెక్‌గ్రాత్ ►ఈ విజయాన్ని ఆస్వాదించండి. స్మిత్, వార్నర్ లేకపోవడం గురించి కోడిగుడ్డుకు ఈకలు పీకే చర్చ మాత్రం చేయకండి. – గౌతం గంభీర్ ► నా దృష్టిలో 1983 ప్రపంచకప్, 1985 వరల్డ్ సిరీస్ విజయాలకంటే ఇదే పెద్ద గెలుపు. ఎందుకంటే టెస్టు ఫార్మాట్ అన్నింటికంటే ఉత్తమమని, కఠినమైనదని నేను నమ్ముతా. నాపై వచ్చిన విమర్శలు పేలని తూటాల్లాంటివి (గావస్కర్‌ను ఉద్దేశించి). అవి భారత్ నుంచి ఇçక్కడికి చేరేలోపే గాల్లో కలిసిపోతాయి. ఈ విజయం కోసం జట్టు ఎంతగా కష్టపడిందో నాకు బాగా తెలుసు. మేం మాత్రం ఆసీస్‌పై సరిగ్గా గురి చూసి గన్ పేల్చాం. గతంలో ఇక్కడ ఆడిన కెప్టెన్లు, భవిష్యత్తు గురించి నేను మాట్లాడను. ఈ రోజు గురించే ఆలోచిస్తా. 72 ఏళ్ల తర్వాత గెలిచాం. గెలిపించిన కెప్టెన్ కోహ్లికి నా సెల్యూట్. ఎందుకంటే అంత కసితో టెస్టులు ఎవరూ ఆడరు. ఈ జట్టులో సీనియర్లు, జూనియర్లు లేదా దేవుడు, దైవాంశ సంభూతులు ఎవరూ లేరు. అంతా భారత జట్టు సభ్యులే. పట్టుదల, అంకితభావం కనబర్చిన ఆటగాళ్లకు హ్యాట్సాఫ్. – రవిశాస్త్రి, భారత కోచ్ ► విదేశాల్లో సిరీస్ గెలవాలని మేం చాలా కాలంగా శ్రమిస్తున్నాం. అదీ ఆస్ట్రేలియాలో అంటే అంత సులువు కాదు. ఇందులో నా భాగస్వామ్యం ఉండటం గర్వంగా ఉంది. తొలి టెస్టులో సాధించిన సెంచరీ నాకు అన్నింటికంటే ప్రత్యేకం. కఠోర సాధన, సన్నద్ధత వల్లే ఇది సాధ్యమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలని నేనూ కోరుకుంటున్నా. కానీ ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యత మాత్రం టెస్టులకే. – పుజారా భారత బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది. వారు సిరీస్ ఆసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారు. తొలి టెస్టులో మాకు అంది వచ్చిన పలు అవకాశాలను చేజార్చుకోవడమే ఫలితాన్ని శాసించింది. అక్కడ పట్టు కొనసాగించి ఉంటే 2–1తో మేమే గెలిచేవాళ్లమేమో. సొంతగడ్డపై మేం భారత్‌ను ఓడించగలమని సిరీస్‌కు ముందు నమ్మాం. కానీ భారత ఆటగాళ్లు కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నారు. భారత్‌నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మా టాప్–7 మొత్తం విఫలమైంది. – టిమ్ పైన్, ఆసీస్ కెప్టెన్ అది మా తప్పు కాదు! ఆస్ట్రేలియా జట్టులో స్మిత్, వార్నర్ లేకపోవడం భారత్ తప్పు కాదు. వారిపై తక్కువ సమయం పాటు నిషేధం విధించాల్సింది. తమకు ఎదురైన ప్రత్యర్థితో తలపడటమే ఆటగాళ్ల పని. టీమిండియా సాధించిన విజయం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. గతంలో కూడా ఆసీస్ గడ్డపై భారత జట్లు విజయం కోసమే ఆడాయి. అయితే కోహ్లి మార్గనిర్దేశనంలో ఫిట్నెస్పరంగా ఈ జట్టు ఉత్తమంగా నిలిచింది. – సునీల్ గావస్కర్ మేరీ దేశ్ కీ ధర్తీ... విజయానంతరం భారత ఆటగాళ్ల జోష్‌కు అంతు లేకుండా పోయింది. ముఖ్యంగా సిరీస్ హీరో పుజారాతో డ్యాన్స్ చేయించేందుకు పంత్ తదితరులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తన వల్ల కాదన్నట్లుగా రెండు సార్లు గట్టిగా చేతులు మాత్రమే కదిలించి అతను ఊరుకున్నాడు. ‘దీనిని పుజారా డ్యాన్స్ అనాలేమో. అతను మామూలుగా నడిచినప్పుడు కూడా చేతులు పెద్దగా కదల్చడు. చిన్న స్టెప్ కూడా వేయలేకపోవడం చూస్తే పుజారా ఎలాంటి సింపుల్ మనిషో మనకు అర్థమవుతుంది’ అని కోహ్లి సరదాగా అన్నాడు. హోటల్లోనూ అభిమా నులు క్రికెటర్లను ఆటపాటలతో ఆహ్వానించారు. ‘పుకార్’ సినిమాలోని దేశభక్తి పాట ‘మేరీ దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే...’కు అభిమానులతో కలిసి కోహ్లి డ్యాన్స్ చేశాడు. -
గావస్కర్‌కు అందని సీఏ ఆహ్వానం
ముంబై: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ పేరేమో ‘బోర్డర్–గావస్కర్’ టోర్నీ. చిత్రంగా ట్రోఫీ ప్రదానోత్సవానికి మాత్రం భారత దిగ్గజం సునీల్ గావస్కర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ఆహ్వానం పంపలేదు. దీంతో సన్నీ అక్కడికి వెళ్లడం లేదు. బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందించడం లేదు. 1996 నుంచి జరుగుతున్న ఈ సిరీస్ విజేతకు ఈసారి మాత్రం అలెన్ బోర్డర్ ఒక్కడే ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ గత మే నెలలో గావస్కర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్ తన 17 ఏళ్ల సుదీర్ఘ పదవీ కాలానికి బైబై చెప్పారు. ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం సీఏ నుంచి అధికారిక ఆహ్వానమేదీ సన్నీకి అందలేదు. ఒకవేళ సీఏ హడావుడిగా ఇప్పుడు ఆహ్వానం పంపినా గావస్కర్ వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే సన్నీ ‘సోనీ నెట్వర్క్’తో ఒప్పందం చేసుకున్నారు. ముంబై నుంచి వ్యాఖ్యానం చేస్తున్నారు. కనీసం సిరీస్‌కు ముందైనా చెబితే సోనీ సంస్థ ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకునేదని ఇప్పుడు మాత్రం ఏ అవకాశం లేదని సన్నీ చెప్పారు. దీంతో భారత దిగ్గజం గైర్హాజరు కానున్నారు. మరోవైపు సీఏ కమ్యూనికేషన్స్ హెడ్ టిమ్ విటకెర్ మాట్లాడుతూ... జూన్‌లో ఒకసారి, ఆగస్టులో మరోసారి గావస్కర్‌కు ఆహ్వానాలు పంపామని చెప్పారు. అయితే ఈ ఆహ్వానాల స్క్రీన్‌షాట్స్ చూపగలరా అంటే మాత్రం ‘మీడియాకు మా అధికారిక ఆహ్వానాలు వెల్లడించం’ అని బదులిచ్చారు. సీఏ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2015లో చివరి నిమిషంలో ఆహ్వానించింది. అక్కడే ఉండటంతో సన్నీ సరేనన్నారు. 2007–08లోనూ ఇలాగే చేసింది. 2000లో ఆస్ట్రేలియా శతాబ్ది జట్టును ఎంపిక చేసేందుకు సీఏ గావస్కర్‌ను ఆ ప్యానెల్లో సెలెక్టర్‌గా నియమించింది. వేడుకకి మాత్రం పిలవలేదు. -
ఈసారి వదలొద్దు..
70 ఏళ్ల ప్రయాణంలో 12 పర్యటనల్లో 47 టెస్టుల పరంపరలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారిగా 2–1 ఆధిక్యంలో నిలిచింది. మరొక్క విజయం సాధించినా... కనీసం ‘డ్రా’ చేసుకున్నా ... సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కుతుంది. ఏ తీరుగా చూసినా మళ్లీ ఎప్పటికి వస్తుందోచెప్పలేనంతటి గొప్ప అవకాశం ఇది. ఏమాత్రం పొరపాటు జరుగకుండా చూసుకోవాల్సిన అరుదైన సందర్భం ఇది. ఈ చారిత్రక మలుపును కోహ్లి సేన గెలుపు పిలుపుతో మురిపిస్తుందని ఆశిద్దాం...! సాక్షి క్రీడా విభాగం : 2003–04 ఆసీస్ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1–0తో పైచేయి సాధించింది. అయితే, తర్వాతి దాంట్లో ఓడిపోవడంతో ఆధిక్యం చేజారింది. ఈ సిరీస్‌లో మొదటి, నాలుగో టెస్టులు ‘డ్రా’గా ముగియడంతో తుది ఫలితం 1–1గా మారింది. అంతకుముందు 1977–78లో 2–2తో సమంగా ఉన్న స్థితిలో ఐదో మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఈ రెండు మాత్రమే భారత్ సిరీస్ విజయానికి చేరువగా వచ్చిన సందర్భాలు. కానీ, ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో సిడ్నీలో అడబోతోంది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా కోహ్లి సేన చరిత్ర తిరగరాసినట్లవుతుంది. పట్టిన పట్టు విడవొద్దు... పైన చెప్పుకొన్న ఉదాహరణల్లో మొదటి దాంట్లో భారత్ చేజేతులా పట్టు జారవిడిచింది. స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేక మెల్బోర్న్లో జరిగిన మూడో టెస్టులో ఓడింది. 1977–78 సిరీస్‌లో మాత్రం ఐదో టెస్టులో అతి భారీ లక్ష్యాన్ని (492) ఛేదిస్తూ 445 పరుగుల వద్ద ఆగిపోయింది. పోరాటం ఎలా ఉన్నా... ఈ రెండు సార్లూ ‘బ్యాటింగ్’దే ప్రధాన పాత్ర కావడం గమనార్హం. ప్రస్తుతం కూడా బ్యాటింగే జట్టును కొంత కలవరపెడుతోంది. మెల్బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ కుప్పకూలిన వైనమే దీనికి నిదర్శనం. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన భారీ ఆధిక్యానికి రెండో ఇన్నింగ్స్‌లో కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్ విలువైన పరుగులు జోడించడంతో ఇబ్బంది లేకపోయింది. ఆసీస్ ఓడిన తేడా (137 పరుగులు)ను పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరి ఇన్నింగ్స్ విలువ తెలుస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ‘ఓడినా పోయేదేమీ లేదుగా’ అనే భావనను వీడి ఏమాత్రం అలసత్వం వహించకుండా పకడ్బందీగా ఆడాల్సి ఉంటుంది. ఆ పొరపాట్లు చేయొద్దు... పిచ్ గురించి అంచనా వేయలేక, అతి విశ్వాసంతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. కనీసం ముందస్తు ఊహాగానాలనూ పట్టించుకోకుండా బరిలో దిగి ఫలితం అనుభవించారు. సిడ్నీ టెస్టుకు మాత్రం వాతావరణం సహా అన్ని విషయాలనూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఫిట్నెస్ సంతరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిడ్నీలో వాతావరణం వేడిగా ఉంది. పిచ్ పొడిగా కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా లయన్‌కు తోడుగా స్పిన్నర్ లబషేన్‌ను ఆడిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా? లేదా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలా? అనేదానిపై టీమిండియా కచ్చితంగా ముందే ఓ అభిప్రాయానికి రావాలి. అద్భుత ఫామ్‌తో పాటు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నందున ముగ్గురు పేసర్లతో సరిపెట్టుకుని, హార్దిక్ బదులు పూర్తి ఫిట్‌గా ఉంటే అశ్విన్‌నే ఆడించడం ఉత్తమం. బ్యాటింగ్‌లోనూ అశ్విన్ సామర్థ్యాన్ని తక్కువగా చూడలేం. మెల్బోర్న్లో ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ కంటే జడేజా మెరుగ్గా రాణించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్... పేసర్ బుమ్రా తర్వాత జడేజా బౌలింగ్‌లోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు పక్కటెముకల గాయంతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అశ్విన్ ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అనుమానం ఉన్నా, అతడిని తుది జట్టులో చేర్చకపోవడమే మేలు. రెండో స్పిన్నర్‌గా హనుమ విహారిని ఉపయోగించుకోవచ్చు. బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా... పుజారా, కోహ్లి... ఈ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా మోస్తున్నారు. అయితే, నిర్ణయాత్మకమైన స్థితిలో వీరిద్దరికి మిగతా వారూ సహకరించాల్సిన అవసరం ఉంది. అరుదైనదే అయినా మెల్బోర్న్ రెండో ఇన్నింగ్స్‌లోలా పుజారా, కోహ్లి పరుగులు సాధించలేకపోతే.. రహానే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మూడో టెస్టులో తమ పాత్ర సమర్థంగా పోషించిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి సిడ్నీలోనూ దానిని కొనసాగించాలి. రోహిత్ లేనందున లోయరార్డర్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరింత కీలకం కానున్నాడు. పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ అతడు మరిన్ని పరుగులు జోడిస్తే అవే కీలకం అవుతాయి. ఏదేమైనా, కోహ్లి సేన జోరును కొనసాగిస్తూ, గెలుపు ఊపును నిలబెట్టుకుంటూ కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే దేశానికి అద్భుతమైన కానుక ఇస్తుందని బలంగా ఆశిద్దాం... విజయోస్తు టీమిండియా! -
మళ్లీ నోరుజారిన ఆసీస్ కామెంటేటర్
మెల్బోర్న్: మూడో టెస్టు తొలి రోజు ‘జలంధర్ రైల్వే క్యాంటీన్ నౌకర్ల’ బౌలింగ్‌లో రంజీ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడంటూ మయాంక్ అగర్వాల్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ కెరీ ఓ కీఫ్ మళ్లీ మాట తూలాడు. తన గత వ్యాఖ్యపై క్షమాపణలు చెప్పిన అతను నాలుగో రోజు అదే తరహాలో భారత ఆటగాళ్ల గురించి పరుషంగా మాట్లాడాడు. జడేజా, పుజారాల పేర్లను సరిగ్గా పలకలేక సహచర కామెంటేటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కీఫ్ ఈ పేర్లపై తన అక్కసు వెళ్లగట్టాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. కీఫ్ వ్యాఖ్యల గురించి భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ...‘ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే కొంత బాధిస్తాయి. కానీ వాటిని మనం నియంత్రించలేం. అయితే ఆ బాధను కసిగా మార్చుకొని మైదానంలో చెలరేగితే అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చినట్లే’ అని అభిప్రాయపడ్డారు. లెగ్‌స్పిన్ బౌలర్ అయిన 69 ఏళ్ల కెరీ ఒ కీఫ్ ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. -
ధోని మళ్లీ వచ్చాడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టి20ల్లో మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో అతను జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం ధోనిని సెలక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు. భారత్ ఆడిన గత రెండు టి20 సిరీస్‌లలో (సొంతగడ్డపై వెస్టిండీస్‌తో, ఆస్ట్రేలియాతో) ధోనికి చోటు దక్కలేదు. దాంతో పొట్టి ఫార్మాట్లో అతని ఆటకు ఫుల్స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా ధోనికి మరోసారి అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లు, న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ కోసం సోమవారం సెలక్టర్లు జట్లను ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు మాజీ కెప్టెన్‌కు సాధ్యమైనంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకే అతడిని తిరిగి టి20 జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ మరో ఎనిమిది వన్డేలు (ఆసీస్‌తో 3, న్యూజిలాండ్‌తో 5) మాత్రమే ఆడనుంది. ధోని గైర్హాజరులో పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, దినేశ్ కార్తీక్ రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. ఇప్పుడు ధోనితో పాటు వీరిద్దరు కూడా 15 మంది సభ్యుల టి20 జట్టులో ఉండటం విశేషం. ‘టి20 ఫార్మాట్లో పంత్‌లాంటి కుర్రాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిదని ధోని భావించాడు. అందుకే తనంతట తానే తప్పుకున్నాడు’ అని విండీస్‌తో సిరీస్‌కు ముందు కోహ్లి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడాలని నిర్ణయించుకోవడం అనూహ్యం. వన్డేలకు కార్తీక్... ఆసియా కప్ తర్వాత వన్డే టీమ్‌లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్ కూడా పునరాగమనం చేశాడు. పంత్ స్థానంలో అతనికి చోటు లభించింది. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాకు ఊహించినట్లుగానే రెండు ఫార్మాట్లలో కూడా స్థానం దక్కింది. వెస్టిండీస్ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడి స్థానం కోల్పోయిన షమీని కూడా వన్డేల కోసం ఎంపిక చేశారు. మరో పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు జట్లలోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో రెగ్యులరే అయినా టి20ల్లో పెద్దగా ఆడని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు కూడా చోటు దక్కింది. జాదవ్ తన ఆఖరి టి20 మ్యాచ్‌ను 2017 అక్టోబరులో ఆడాడు. పాండే, ఉమేశ్ ఔట్... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే రెండు జట్లలోనూ స్థానం కోల్పోయాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఆసీస్‌తో మూడు టి20ల్లోనూ పాండేకు ఆడే అవకాశమే రాలేదు. విండీస్‌తో రెండు టి20లు ఆడిన అతను 19, 4 నాటౌట్ పరుగులు చేశాడు. వన్డే, టి20ల్లోనూ సభ్యుడిగా ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు పక్కన పెట్టారు. పునరాగమనం తర్వాత 2 వన్డేలు, 1 టి20 ఆడిన ఉమేశ్ ఘోరంగా విఫలమయ్యాడు. టి20 టీమ్ సభ్యులుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశం లభించకుండానే చోటు కోల్పోయారు. ‘ఎ’ జట్టు తరఫున పంత్... భారత సీనియర్ జట్టులోకి వేగంగా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ జోరుకు సెలక్టర్లు చిన్న విరామం ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న పంత్‌పై వన్డేల్లో వేటు పడింది. విండీస్‌తో సిరీస్‌లో పంత్ మూడు వన్డేలు ఆడగా... ధోని జట్టులో ఉండటంతో వికెట్ కీపింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు టి20ల్లో కూడా ధోని పునరాగమనం చేయడంతో అతను ఇక్కడా తుది జట్టులో ఉండటం సందేహమే. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే పంత్ స్వదేశం పయనమవుతాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతను భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జనవరి 12, 15, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న భారత్... జనవరి 23నుంచి ఐదు వన్డేలు, 3 టి20ల కోసం కివీస్ పర్యటనకు వెళుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, అంబటి రాయుడు, జడేజా, షమీ. న్యూజిలాండ్‌తో టి20లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, పంత్. -
ఓపెనింగ్‌పై తర్జనభర్జన.. ఎవరో? ఏమిటో?
పట్టుమని పది ఓవర్లయినా నిలవలేని ఓపెనర్లు... పూర్తి ఫిట్నెస్ కొరవడిన ప్రధాన స్పిన్నర్లు... ఆడించాలా? వద్దా? అనే స్థితిలో ఆల్‌రౌండర్! వెరసి... ‘బాక్సింగ్ డే’ టెస్టుకు ముందు టీమిండియాలో పెద్ద డైలమా? ఎలాంటి సమస్యలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన కోహ్లి సేనను... ఇప్పుడు ప్రత్యర్థి కంటే గాయాలు, ఫామ్ లేమి ఎక్కువగా భయపెడుతున్నాయి. మరి... సిరీస్ కీలక దశలో మెల్బోర్న్లో టీమిండియా ఏం చేస్తుంది? చిక్కుముడులను ఎలా విప్పుతుంది? సాక్షి క్రీడా విభాగం: తుది జట్టు ఖరారులో బహుశా గతంలో ఎన్నడూ ఎదుర్కొననంత సందిగ్ధంలో ఉందిప్పుడు టీమిండియా. స్వదేశంలో అయినా, విదేశంలో అయినా సహజంగా ఒకటీ, రెండు స్థానాలపైనే ఊగిసలాట ఉంటుంది. కానీ, కోహ్లి సేన మూడో టెస్టుకు నాలుగు స్థానాలపై ఆందోళన చెందుతోంది. 11 మందికిగాను ఫామ్, ఫిట్నెస్ ప్రకారం నికరంగా ఏడుగురు ఆటగాళ్లే అందుబాటులో ఉన్నట్లయింది పరిస్థితి. ఎటొచ్చి... మెల్బోర్న్లో ‘మార్పు’ తప్పనిసరి! కానీ, అదెలాగన్నదే తేలాల్సి ఉంది. ఓపెనర్లు ఎవరో? 49, 48... విజయ్, రాహుల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన స్కోర్లివి. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోని 44 పరు గులు మినహాయిస్తే రాహుల్ చేసినవి నాలుగే పరుగులు. యువ సంచలనం పృథ్వీ షా గాయంతో పూర్తిగా దూరం కాగా, వీరిలో ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్నపళంగా కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను రప్పించారు. విజయ్ కొంత ఎక్కువసేపు క్రీజులో ఉంటున్నా ప్రతి పరుగుకు శ్రమిస్తున్నాడు. ఆడినప్పుడే ఆడినట్లుంటోంది రాహుల్ కథ. పోతే పోనీ ఈ ఒక్కసారికి కొనసాగిద్దామనుకుంటారా? లేక మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా? అనేది చూడాలి? జడ్డూ సంగతేంటో? ఎడమ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉన్నాడని ప్రకటనలైతే వస్తున్నాయి. అయితే, అది కోచ్ రవిశాస్త్రి లెక్కల్లోలాగ 70–80 శాతమా? బీసీసీఐ చెప్పినట్లు 100 శాతమా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. కోచ్ మాట ప్రకారం 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా ఆడిస్తారా? అశ్విన్ దూరమై, గత్యంతరం లేకపోతే జడేజాను దించినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అశ్విన్ ‘ఫిట్టు’ కానట్టే? ఇంగ్లండ్‌లో గాయంతోనే సౌతాం ప్టన్ టెస్టులో ఆడి, వైఫల్యం మూటగట్టుకుని ఆపై చివరి టెస్టుకు దూరమైన అశ్విన్... పాత కథనే పునరావృతం చేసేలా ఉన్నాడు. అశ్విన్ పరిస్థితిని రెండ్రోజుల్లో చెబుతామని కోచ్ రవిశాస్త్రి ఆదివారం వ్యాఖ్యానించడం దీనినే సూచిస్తోంది. సోమవారం నెట్స్‌లోనూ అతడు రనప్ లేకుండానే బౌలింగ్ చేశాడు. బుధవారం నాటికైనా ఫిట్నెస్ సంతరించుకుంటే జట్టుకది శుభవార్త లాంటిదే. హార్దిక్‌ను పిలిపించారు...కానీ! ఆసియా కప్‌లో గాయపడి.. మూడు నెలల తర్వాత ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడీ ఆల్‌రౌండర్. 7 వికెట్లు తీసి, అర్ధశతకమూ సాధించి ఫిట్‌గానే ఉన్నానని చాటుకున్నాడు. కానీ, 70–80 శాతం ఫిట్నెస్తో జడేజాను మైదానంలో దించిన కోచ్ రవిశాస్త్రి... హార్దిక్‌ను మాత్రం ఇప్పుడే ఆడించి రిస్క్ తీసుకోలేం అంటున్నాడు. అంటే, ఇతడి విషయమూ చెప్పలేం అనే తెలుస్తోంది. మయాంక్ వైపు మొగ్గితే...? అసలే ఆస్ట్రేలియా... ఆపై కూకాబుర్రా బంతులు! వీటికితోడు పదునైన ప్రత్యర్థి పేస్. ఇలాంటిచోట కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా మయాంక్ అగర్వాల్‌ను నేరుగా దించడం అంత మంచిది కాదన్నది మాజీల మాట. మరోవైపు 2017–18 సీజన్లో శతకాల మీద శతకాలు బాదిన మయాంక్ ప్రస్తుతం అంత గొప్ప ఫామ్‌లో లేడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో రెండే అర్ధ శతకాలు సాధించాడు. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడించి ఉంటే తనపై ఒత్తిడి లేకుండేది. ఇప్పుడు జట్టుకు అత్యంత అవసరమైన సందర్భంలో, రాణించాలన్న తీవ్ర ఒత్తిడి మధ్య ఆసీస్‌పై అరంగేట్రం అంటే అతడిని నిప్పుల్లోకి తోసినట్లే. రోహిత్... వచ్చేస్తానన్నాడు తొలి టెస్టులో మంచి అవకాశాలను చేజార్చుకుని విమర్శలపాలై... రెండో టెస్టుకు వెన్నునొప్పితో దూరమైన రోహిత్ శర్మది చిత్రమైన పరిస్థితి. భార్య ప్రసవ సమయం దగ్గరపడుతుండటంతో భారత్ వచ్చేద్దామని అతడు ప్రణాళికలు వేసుకున్నాడు. దీంతో మూడో టెస్టుకు అందుబాటులో ఉండడనే భావించారు. కానీ, ఇంకా జట్టుతోనే ఉన్నాడు. వెన్నునొప్పి తగ్గింది కానీ, మెల్బోర్న్ టెస్టుకు అనుమానమే అంటున్నాడు రవిశాస్త్రి. -
నా కళ్ల ముందు ఇంత జరుగుతున్నా..
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మెలమెల్లగా ఆటకు చేరువవుతున్నాడు. ఇటీవలే బిగ్‌బాష్ లీగ్ ప్రచార వీడియోలో దర్శనమిచ్చిన అతను శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్వదేశం చేరుకొని ఉద్వేగభరితంగా మాట్లాడిన అతను... మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాటి ఘటనను మరో సారి గుర్తు చేసుకున్న స్మిత్ తన భవిష్యత్తు గురించి చెప్పాడు. ‘స్యాండ్ పేపర్‌తో ట్యాంపరింగ్ గురించి వార్నర్, బాన్‌క్రాఫ్ట్ చెబుతుంటే నేను పట్టించుకోకుండా వెళ్లిపోయాను. నిజానికి దానిని అక్కడే ఆపాల్సింది. కెప్టెన్‌గా అది నా వైఫల్యం. మైదానంలో కూడా మరో అవకాశం వచ్చింది. కనీసం అక్కడ కూడా దానిని ఆపలేకపోయాను. అదీ నా తప్పే. నా కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఏమీ చేయకుండా ఊరుకున్నాను కాబట్టే తప్పును అంగీకరించి శిక్షను అనుభవిస్తున్నాను. బయట ఏమో గాని ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి’ అని స్మిత్ అన్నాడు. ఈ వివాదం తర్వాత కూడా వార్నర్‌తో తన సంబంధాలు బాగున్నాయని అతను స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత తన జీవితంలో చీకటి రోజులు గడిచాయని, అయితే సన్నిహితుల అండతో కోలుకోగలిగానని స్టీవ్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్ తనకు బాగా ఉపయోగపడుతుందని, వన్డేల్లో వేగం పెరిగిన నేపథ్యంలో టి20 తరహా ఆటతో సిద్ధం కావడం సరైందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ను బయటనుంచి చాలా కష్టంగా అనిపిస్తోందన్న స్మిత్... పెర్త్ టెస్టు ప్రదర్శనపై సంతోషంగా ఉందంటూ కెప్టెన్ టిమ్ పైన్‌పై ప్రశంసలు కురిపించాడు. -
నేను ఔటైన తీరును వివాదం చేయదల్చుకోలేదు: కోహ్లి
అశ్విన్ ఫిట్‌గా ఉన్నా కూడా నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగేవాళ్లం. రవీంద్ర జడేజా గురించి అసలు ఆలోచనే రాలేదు. పిచ్‌ను చూసిన తర్వాత ఇది స్పిన్‌కంటే పేస్కే ఎక్కువగా అనుకూలిస్తుందని మేం నమ్మాం. మొదటి మూడు రోజులు సరిగ్గా అదే జరిగింది. సరిగ్గా చూస్తే గరుకు ప్రాంతం వల్ల పెద్దగా సహకారం లేదు. లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి వేగాన్నే ఎక్కువగా ఉపయోగించుకొని అతను వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భువనేశ్వర్ ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. అటు ఉమేశ్ తన ఆఖరి టెస్టులో 10 వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. అందుకే అతడిని ఎంపిక చేశాం. నలుగురు పేసర్లు ఉంటే బ్యాటింగ్ బలహీనంగా మారుతుందని తెలుసు. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని అది ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి కట్టుబడాల్సిందే. మ్యాచ్ ముందుకు సాగుతున్నకొద్దీ పరిస్థితులు మారిపోతుంటాయి కాబట్టి మనకు ఏం కావాలో మొదటి రోజే తేల్చుకోవాలి. అసభ్యంగా దూషించనంత వరకు, వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడనంత వరకు గీత దాటనట్లే. మైదానంలో పోటీతత్వం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఈ విషయంపై చర్చ అనవసరం. తొలి ఇన్నింగ్స్‌లో నేను ఔటైన తీరును వివాదం చేయదల్చుకోలేదు. మైదానంలో ఒక నిర్ణయం తీసుకున్నాక దాని పని అయిపోయింది. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
అతను నీ కెప్టెన్.. కానీ నువ్వు కూడా అతణ్ణి ఇష్టపడవు!
మేం మంచివాళ్లుగా మారిపోయాం అంటూ ఆస్ట్రేలియన్లు ఎంతగా చెప్పుకున్నా, ఎక్కడో ఒక చోట ప్రత్యర్థిని కవ్వించేందుకు వారి ‘లోపలి మనిషి’ బయటకు వస్తూనే ఉంటాడు. పెర్త్ టెస్టులో కూడా ఇలాగే జరిగింది. భారత కెప్టెన్ కోహ్లి, ఆసీస్ కెప్టెన్ పైన్ మధ్య మాటల యుద్ధం ఆపేందుకు... చివరకు అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆసీస్ ఇన్నింగ్స్ 71వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బుమ్రా బౌలింగ్‌లో మిడ్‌వికెట్ దిశగా ఆడిన పైన్ సింగిల్ పూర్తి చేసుకోబోతున్న సమయంలో లాంగాఫ్‌లో ఉన్న కోహ్లి క్రీజ్ వైపు నడిచాడు. వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు. దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు’ అంటూ పైన్ బదులిచ్చాడు! దాంతో అంపైర్ క్రిస్ గాఫ్నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్ వ్యాఖ్యానించడం విశేషం! అయితే, ఆట ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు మొహమ్మద్ షమీ, హాజల్‌వుడ్ దీనిని తేలిగ్గా తీసుకున్నారు. ఐదు రోజుల పాటు సాగే మ్యాచ్‌లో ఇలాంటివి జరుగుతుంటాయని, వాటిని సరదాగా తీసుకోవాలని అన్నారు. -
పృథ్వీషా ఔట్!
సన్నాహక మ్యాచ్‌లు ఆడకనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు కోల్పోయారన్న విమర్శల కారణంగా... ఆస్ట్రేలియాలో మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవాలన్న సూచనలతో... పర్యటన ప్రారంభానికి ముందు ఓ నాలుగు రోజుల మ్యాచ్ ఏర్పాటు చేసుకున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం సీఏ ఎలెవెన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ యువ సంచలనం పృథ్వీ షా మడమ గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత దృష్ట్యా పృథ్వీ ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో ప్రాక్టీస్ సంగతి ఏమో కాని, ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సేవలను కోల్పోయి అసలుకే ఎసరొచ్చినట్లయింది. అనవసర ప్రయత్నంతో.. సీఏ ఎలెవెన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ దిశగా మ్యాక్స్ బ్రయాంట్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద పృథ్వీ అందుకునేందుకు యత్నించాడు. పరుగున వచ్చిన అతడు... బంతిని క్యాచ్ పట్టాడు కానీ, నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో అతడి ఎడమ పాదం పూర్తిగా మెలికపడింది. ఆ నొప్పితోనే అతడు బంతి సహా బౌండరీ లైన్ దాటేశాడు. అంతగా ప్రయత్నించాల్సిన పని లేకున్నా... పృథ్వీ అనవసరంగా తొందరపడి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. జట్టుకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. మరోవైపు పృథ్వీ ప్రస్తుతానికి తొలి టెస్టుకే అందుబాటులో ఉండడని అంటున్నారు. గాయం తీరు చూస్తే రెండో టెస్టు నాటికీ అతడు కోలుకోవడం అనుమానంగానే ఉంది. మైదానం నుంచి పృథ్వీని ఫిజియో, సహాయక సిబ్బంది చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లగా... ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడు క్రచెస్ (ఊత కర్రల)సాయంతో బయటకు రావడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. ఓపెనింగ్ జోడీ ఎవరో? నిన్నటివరకు పృథ్వీకి ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహులా? మురళీ విజయా? అనే సందిగ్ధం ఉండేది. ఇప్పుడు యువ బ్యాట్స్‌మన్ గాయంతో వైదొలగడంతో అసలు ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరో తేలడం లేదు. ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే ప్రాథమికంగా స్పెషలిస్ట్ ఓపెనర్లైనందున రాహుల్, విజయ్‌నే దింపే అవకాశం ఉంది. కానీ, ఈ ఇద్దరి ఫామ్ దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పక్కనే ఉన్న న్యూజిలాండ్‌లో ‘ఎ’ జట్ల సిరీస్‌లో పాల్గొంటున్న మయాంక్ అగర్వాల్‌ను రప్పించినా, పూర్తిగా కొత్తవాడైన అతడిని ఆస్ట్రేలియా వంటి జట్టుపై బరిలో దింపడం సాహసమే అవుతుంది. అయితే, మరో ప్రయత్నమూ చేయొచ్చని అనిపిస్తోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ రోహిత్‌శర్మను ఓపెనర్‌గా పంపడం. రోహిత్ ఇప్పటివరకు ఆరో స్థానానికే పోటీదారుగా ఉన్నాడు. మరోవైపు జట్టు అవసరాలను గుర్తించిన అతడు కొంతకాలం క్రితం టెస్టుల్లో తాను ఓపెనింగ్‌కైనా సిద్ధమని ప్రకటించాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేమీ లేదని టీం మేనేజ్మెంట్ భావిస్తే... ఆడిలైడ్ టెస్టులో రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించినా ఆశ్చర్యం లేదు. చూద్దాం... ఏం జరుగుతుందో? -
షార్ట్... సిక్సర్ల సునామీ
సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీఆర్సీ షార్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జేఎల్టీ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ క్వీన్స్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 23 సిక్స్‌లతో అతడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున బరిలో దిగిన షార్ట్... 148 బంతుల్లో 15 ఫోర్లు సహా 257 పరుగులు సాధించాడు. అతడి జోరుతో జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. 100, 150, 200, 250 వ్యక్తిగత స్కోరును షార్ట్ సిక్సర్లతోనే అందుకోవడం విశేషం. ఇందులో 200, 250 మార్క్‌ను మూడేసి వరుస సిక్సర్లతో చేరుకోవడం గమనార్హం. ఛేదనలో హీజ్లెట్ (107), క్రిస్ లిన్ (58) రాణించినా... ఆండ్రూ టై (6/46) ధాటికి క్వీన్స్‌ల్యాండ్ 271 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 116 పరుగులతో విజయం సాధించింది. ►షార్ట్ ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ► ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత సిక్స్‌ల రికార్డు నమీబియా ఆటగాడు జి.స్నైమన్ (113 బంతుల్లో 196; 7 ఫోర్లు, 17 సిక్స్‌లు, 2007లో యూఏఈపై) పేరిట ఉంది. క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై), రోహిత్ శర్మ (2013లో ఆస్ట్రేలియాపై) 16 సిక్స్‌లు కొట్టారు. షార్ట్ 23 సిక్స్‌లతో వీటన్నిటిని బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ► తన రికార్డు ఇన్నింగ్స్‌తో షార్ట్ లిస్ట్ ‘ఎ’ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్లో అత్యధిక మూడో వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సర్రే ఆటగాడు (ఇంగ్లండ్) అలిస్టర్ డంకన్ బ్రౌన్ (160 బంతుల్లో 268; 30 ఫోర్లు, 12 సిక్స్‌లు; గ్లామోర్గన్‌పై 2002లో), భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (173 బంతుల్లో 264; 33 ఫోర్లు, 9 సిక్స్‌లు; శ్రీలంకపై 2014లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
భరత్ సెంచరీ
బెంగళూరు: ఆంధ్ర బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ సెంచరీతో (106; 12 ఫోర్లు, సిక్స్) అదరగొట్టాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (52; 5 ఫోర్లు) బ్యాటింగ్‌లో రాణించాడు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టుకు 159 పరుగుల ఆధిక్యం లభించింది. సోమవారం 223/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ కాసేపటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన భరత్, శుభ్‌మన్ గిల్ (50; 7 ఫోర్లు)కు జతయ్యాడు. ఇద్దరు కలిసి స్కోరును 300 పరుగులకు చేర్చారు. అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే గిల్ నిష్క్రమించగా... గౌతమ్ (20), కుల్దీప్ యాదవ్‌ల అండతో శ్రీకర్ శతకాన్ని సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. -
మళ్లీ ఓడిన జింబాబ్వే
హరారే: సొంతగడ్డపై ముక్కోణపు టి20 టోర్నీలో జింబాబ్వేకు ఒక్క విజయం కూడా దక్కలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ముందుగా జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మిరే (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రూ టై (3/28) జింబాబ్వేను దెబ్బ తీశాడు. ఆసీస్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 56; 1 ఫోర్, 5 సిక్సర్లు), హెడ్ (42 బంతుల్లో 48; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 71 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
బర్మింగ్‌హామ్‌లో కలుద్దాం!
గోల్డ్‌కోస్ట్: లక్షల మంది ప్రేక్షకుల్ని మురిపించిన వేడుక, వేలమంది అథ్లెట్లను మెరిపించిన ఆటల పండుగ ముగిసింది. 12 రోజుల పాటు గోల్డ్ కోస్ట్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్గేమ్స్ ఆద్యంతం అలరించాయి. ఆసీస్ వాసులు ఆరంభం నుంచి గేమ్స్‌కు బ్రహ్మరథం పట్టారు. విజేతలకు జేజేలు పలికి క్రీడాస్ఫూర్తిని చాటారు. గేమ్స్‌కు ముందు అట్టహాసంగా ప్రారంభమైన వేడుకల్లో ఆసీస్ చరిత్రను, సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తే... ముగింపు వేడుకల్లో ఘనమైన పార్టీతో వీడ్కోలు పలికారు. బాణాసంచా వెలుగులు, మిరుమిట్లు గొలిపే కాంతులు స్టేడియాన్ని వర్ణరంజితం చేశాయి. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని 2022 గేమ్స్‌కు ఆతిథ్యమివ్వనున్న బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్) అధికారులకు అందజేశారు. ముగింపు వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమ తమ జాతీయ జెండాలతో, పతకాలు గెలిచిన విజయగర్వంతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి బాక్సర్ మేరీకోమ్ నేతృత్వం వహించింది. -
తండ్రి గ్లౌవ్స్... తనయుడి పంచ్
గోల్డ్‌కోస్ట్: అమెచ్యూర్ బాక్సర్ అయిన తండ్రి కెరీర్ చేయి విరగడంతో అర్ధాంతరంగా ముగిసింది. కానీ... తనయుడి కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్టయింది. కెనడాకు చెందిన 20 ఏళ్ల థామస్ బ్లుమెన్ఫీల్డ్కు నాన్న బాబ్ అంటే ప్రాణం. ఆయన్నే ఫాలో అయ్యేవాడు. తన తండ్రి బాక్సింగ్ గ్లౌవ్స్‌కు ఇచ్చే విలువేంటో తెలుసుకున్న థామస్ అవే బాక్సింగ్ గ్లౌవ్స్ (తండ్రి గ్లౌవ్స్‌ను తను 8 ఏళ్ల వయస్సప్పుడు దాచిపెట్టుకున్నాడు)తో ఇప్పుడు గోల్డ్‌కోస్ట్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. లైట్ వెల్టర్ వెయిట్లో ఫైనల్ చేరిన అతను ఇప్పుడు స్వర్ణం వేటలో ఉన్నాడు. ఆసీస్‌లో కొడుకు వెన్నంటే లేకపోయినప్పటికీ బాబ్ టీవీల్లో తనయుడి విజయాన్ని తనివితీరా ఆస్వాదించి ఉంటారు. తన విజయంపై థామస్ మాట్లాడుతూ ‘నాకు బాక్సింగ్ కంటే నాన్నంటేనే ఇష్టం. ఆయన బాక్సింగ్ కాకుండా టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఏది ఆడినా నేను దాన్నే అనుసరించేవాణ్ని’ అని అన్నాడు. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
ముంబై: ఫార్మాట్ మారినా భారత మహిళా క్రికెట్ జట్టు రాత మారలేదు. ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో 0–3తో చిత్తయిన మన జట్టు... ఇప్పుడు టి20 ముక్కోణపు టోర్నీని కూడా పరాజయంతో ప్రారంభించింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో భారత్‌పై సునాయాసంగా గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (41 బంతుల్లో 67; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (18) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 9.3 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. ముఖ్యంగా మైదానం నలువైపులా షాట్లు కొట్టిన స్మృతిమంధాన 30 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది. మరో ఎండ్‌లో మిథాలీ అవుటైనా ఆమె జోరు కొనసాగించింది. టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధశతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మంధాన 13వ ఓవర్లో గార్డ్నర్ (2/21) బౌలింగ్‌లో అవుటైంది. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13), జెమీమా (1) విఫలమవడంతో రన్‌రేట్‌పై ప్రభావం పడింది. వేదా కృష్ణమూర్తి (10 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), అనూజ పాటిల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో బ్యాట్ ఝళిపించారు. లక్ష్య ఛేదనలో భారత పేసర్ జులన్ గోస్వామి (3/30) ధాటికి ఆసీస్ 29 పరుగులకే ఓపెనర్ అలీసా హీలీ (4), గార్డ్నర్ (15)ల వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ మూనీ (32 బంతుల్లో 45; 8 ఫోర్లు), విలానీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆదుకున్నారు. లానింగ్ (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ మరో 11 బంతులు ఉండగానే విజయం సాధించింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో తలపడుతుంది.