సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మెలమెల్లగా ఆటకు చేరువవుతున్నాడు. ఇటీవలే బిగ్‌బాష్ లీగ్ ప్రచార వీడియోలో దర్శనమిచ్చిన అతను శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్వదేశం చేరుకొని ఉద్వేగభరితంగా మాట్లాడిన అతను... మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాటి ఘటనను మరో సారి గుర్తు చేసుకున్న స్మిత్ తన భవిష్యత్తు గురించి చెప్పాడు. ‘స్యాండ్ పేపర్‌తో ట్యాంపరింగ్ గురించి వార్నర్, బాన్‌క్రాఫ్ట్ చెబుతుంటే నేను పట్టించుకోకుండా వెళ్లిపోయాను. నిజానికి దానిని అక్కడే ఆపాల్సింది. కెప్టెన్‌గా అది నా వైఫల్యం. మైదానంలో కూడా మరో అవకాశం వచ్చింది. కనీసం అక్కడ కూడా దానిని ఆపలేకపోయాను. అదీ నా తప్పే. నా కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఏమీ చేయకుండా ఊరుకున్నాను కాబట్టే తప్పును అంగీకరించి శిక్షను అనుభవిస్తున్నాను.
బయట ఏమో గాని ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి’ అని స్మిత్ అన్నాడు. ఈ వివాదం తర్వాత కూడా వార్నర్‌తో తన సంబంధాలు బాగున్నాయని అతను స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత తన జీవితంలో చీకటి రోజులు గడిచాయని, అయితే సన్నిహితుల అండతో కోలుకోగలిగానని స్టీవ్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్ తనకు బాగా ఉపయోగపడుతుందని, వన్డేల్లో వేగం పెరిగిన నేపథ్యంలో టి20 తరహా ఆటతో సిద్ధం కావడం సరైందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ను బయటనుంచి చాలా కష్టంగా అనిపిస్తోందన్న స్మిత్... పెర్త్ టెస్టు ప్రదర్శనపై సంతోషంగా ఉందంటూ కెప్టెన్ టిమ్ పైన్‌పై ప్రశంసలు కురిపించాడు.
తప్పును ఆపలేకపోయా!
Published Sat, Dec 22 2018 12:52 AM | Last Updated on Sat, Dec 22 2018 11:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment