స్టీవ్ స్మిత్‌తో మిచెల్ స్టార్క్ (ఫైల్ ఫొటో)
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం విషయంలో మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ తీరును ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తప్పుపట్టాడు. ఎలాగో ట్యాంపరింగ్ జరిగిపోయిందని, అప్పుడైనా తమ తప్పును స్మిత్, అందుకు సహకరించిన ఆసీస్ క్రికెటర్లు ఒప్పుకోక పోవడం దారుణమన్నాడు. ఈ కారణంగా ఆసీస్ జట్టును, ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లైన నన్ను, హజెల్‌వుడ్, నాథన్ లయన్ లాంటి ప్లేయర్లు ట్యాంపరింగ్‌కు కారకులుగా భావించారని తెలిపాడు.
వివాదం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న స్టీవ్‌స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు నిజాలు చెప్పి ఉంటే జట్టుకు కూడా మంచి జరిగేదన్నాడు. కానీ తప్పిదం చేసిన వారితో పాటు జట్టు మొత్తానికి కళంకం అంటించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్పొరేట్ అడ్వైజర్ సూ కెటో సలహా ప్రకారం స్మిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. కొన్ని వాస్తవాలు మాత్రమే వెల్లడించాడని పేర్కొన్నాడు. జట్టుతో పాటు మరో వర్గం కలిసి కొన్ని నిజాలు దాచిపెట్టడంతో అంతా నాశనమైందన్నాడు. ఇతర క్రికెటర్ల పేరు, ప్రఖ్యాతలు మంటకలిసిపోతాయని ఎందుకు ఆలోచించలేదంటూ స్మిత్, అతడి మద్దతుదారులను ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రశ్నించాడు.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాపరింగ్‌కు యత్నించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, ట్యాంపరింగ్‌కు యత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment