9 డాలర్ల పందెం... రెండేళ్ల నిషేధం!
శిక్షకు గురైన ఆసీస్ మహిళా క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై చాలా మందిలాగే ఆమె కూడా అమితోత్సాహం చూపించింది. అంతటితో ఆగకుండా సరదాగా బెట్టింగ్ చేసింది. ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఎవరికి దక్కుతుందనేదే పందెం. దాని విలువ అక్షరాలా 9 డాలర్లు మాత్రమే (సుమారు రూ. 432). అయితే సదరు మహిళ ఆస్ట్రేలియా క్రికెటర్ కావడం వల్ల ఆ నేరం ‘విలువ’ పెరిగిపోయింది. అంతే...క్రికెట్ ఆస్ట్రేలియా తమ బౌలర్ ఏంజెలా రీక్స్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.
ఇటీవలే ఈ బెట్టింగ్ విషయం బయటపడింది. ఆసీస్ బోర్డు నిబంధనల ప్రకారం ‘ఎలైట్’ గ్రూప్‌లో ఉన్న గుర్తింపు గల క్రికెటర్లు ఎవరూ బెట్టింగ్‌కు పాల్పడకూడదు. నిషేధంతో పాటు అవినీతి వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనాల్సి ఉంటుంది. 25 ఏళ్ల రీక్స్ లెగ్‌స్పిన్నర్. దేశవాళీలో ఏసీటీ జట్టు తరఫున ఆడే ఆమె...ప్రస్తుతం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కేవలం 9 డాలర్ల బెట్టింగ్ ఒక మహిళా క్రికెటర్ కెరీర్‌ను నాశనం చేయడం విశేషం.