1983 World Cup: భారత క్రికెట్‌ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్‌.. | 1983 WC: A historic cricket World Cup win that transformed a nation | Sakshi
Sakshi News home page

1983 World Cup: భారత క్రికెట్‌ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్‌..

Published Sun, Aug 18 2024 10:54 AM | Last Updated on Fri, Sep 20 2024 2:44 PM

1983 WC: A historic cricket World Cup win that transformed a nation

"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆట‌లో గెలుపు ఓటము‌లు స‌హ‌జం. కానీ గెలిచేందుకు మ‌నం తీవ్రంగా శ్ర‌మించాలి. ఇది మ‌న‌కు చావో రేవో. ప్ర‌త్య‌ర్ధి ఎవ‌ర‌న్న‌ది మ‌న‌కు అన‌వ‌స‌రం.

మ‌నం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గెలిచిన ఓడినా ఒకేలా ఉండాలి. అంతే త‌ప్ప త‌ర్వాత అన‌వ‌స‌ర చ‌ర్చ‌లు పెట్టుకోవ‌ద్దు. ఆల్ ది బెస్ట్ ”.. ఇవీ 1983 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు భార‌త ఆట‌గాళ్లకు కెప్టెన్‌ క‌పిల్ దేవ్ చెప్పిన మాటలు.

25 జూన్ 1983.. భార‌త క్రికెట్‌లో సరికొత్త చరిత్ర అవిష్కతృమైంది. అప్పటివరకు పసికూనలుగా ముద్రపడిన భారత జట్టు.. ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించింది. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. 

ఫైనల్లో ఓటమంటూ ఎరుగని వెస్టిండీస్‌ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను కపిల్ డేవిల్స్ ముద్దాడింది. తొలి వరల్డ్‌కప్‌ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను కపిల్ సేన రెపలాప‌డించింది. ఈ విజయంతో యావత్తు భారత్‌ గర్వంతో ఉప్పొంగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ క‌పిల్ దేవ్ ప‌ట్టిన క్యాచ్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు భార‌త క్రికెట్ చ‌రిత్ర‌ను మార్చేసింది.



నిప్పులు చేరిగిన విండీస్ బౌల‌ర్లు..
అప్ప‌ట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌల‌ర్ల‌కు పెట్టింది పేరు. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో భార‌త కెప్టెన్ క‌పిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధి ముందు భారీ స్కోర్ ఉంచి.. ల‌క్ష్య‌చేధ‌న‌లో ఒత్తిడి పెంచాలని క‌పిల్ భావించాడు.

కానీ అక్క‌డ ఉంది క‌రేబియ‌న్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెన‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్‌ను ఔట్ చేసి విండీస్ బౌల‌ర్లు భార‌త్‌ను దెబ్బ కొట్టారు. ఆ త‌ర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫ‌స్ట్‌డౌన్‌లో వచ్చిన మోహిందర్ అమర్‌నాథ్ భారత ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు.

శ్రీకాంత్, అమర్‌నాథ్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్ద‌రూ భార‌త స్కోర్ 90  ప‌రుగుల వ‌ద్ద వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు చేరారు. దీంతో టీమిండియా ప‌త‌నం మొద‌లైంది. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయిన భార‌త జ‌ట్టు..  54.4 ఓవ‌ర్ల‌లో 183 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.  శ్రీకాంత్(38), అమర్‌నాథ్(26) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ల‌గా నిలిచారు.

ఆరంభం ఆదుర్స్‌..
ఇక 184 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని విండీస్ ఊదిప‌డేస్తుంద‌ని అంతా భావించారు. భార‌త ఓట‌మితో ఇంటిముఖం ప‌ట్టక‌త‌ప్ప‌ద‌ని అభిమానులు నిరాశ‌లో కూరుకుపోయారు. కానీ భార‌త బౌల‌ర్లు అద్భుతం చేశారు. భార‌త పేస‌ర్ బల్వీందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్‌ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఔట్ చేసి భార‌త్‌కు శుభారంభం అందించాడు. ఆ త‌ర్వాత మ‌ద‌న్‌లాల్ వ‌రుస‌గా రెండు వికెట్లు ప‌డ‌గొట్టి విండీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. అయితే ఈ స‌మ‌యంలో దిగ్గ‌జ ఆట‌గాడు వివియన్ రిచర్డ్స్ మాత్రం భార‌త బౌల‌ర్ల‌పై ఎదురు దాడికి దిగాడు.

మ‌ద‌న్ లాల్ మ్యాజిక్‌..
మ్యాచ్‌పై భార‌త ప‌ట్టు బిగిస్తున్న స‌మ‌యంలో రిచ‌ర్డ్స్ ఎటాక్ చేయ‌డంతో కెప్టెన్ క‌పిల్‌దేవ్ ముఖంలో కాస్త టెన్ష‌న్ క‌న్పించింది. రెండు వికెట్ల ప‌డగొట్టిన మ‌ద‌న్‌లాల్‌ను సైతం రిచ‌ర్డ్స్ టార్గెట్ చేశాడు. మదన్‌లాల్ వేసిన ఓ ఓవ‌ర్‌లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను త‌మ‌వైపు తిప్పే ప్ర‌య‌త్నం రిచ‌ర్డ్స్ చేశాడు. 

ఈ క్ర‌మంలో రోజర్ బిన్నీని క‌పిల్ దేవ్ ఎటాక్‌లోకి తీసుకువ‌చ్చి రిచ‌ర్డ్స్ దూకుడును క‌ట్ట‌డి చేయాల‌ని భావించాడు. బిన్నీ ప‌రుగులు రాకుండా ఆపిన‌ప్ప‌టికి.. అత‌డి వికెట్ మాత్రం సాధించ‌లేక‌పోయాడు. అయితే మ‌ళ్లీ మ‌ద‌న్‌లాల్.. క‌పిల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పాడు.

కానీ అంత‌కుముందు ఓవ‌రే మూడు ఫోర్లు ఇవ్వడంతో కపిల్ దేవ్ మదన్‌లాల్‌ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయినా స‌రే మ‌ద‌న్ మాత్రం త‌న‌కు ఒక్క ఓవ‌ర్ వేసే అవ‌కాశాన్ని ఇవ్వ‌మ‌న్నాడు. అందుకు స‌రే అని క‌పిల్ అత‌డికి మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ ఓవ‌ర్‌లో మ‌ద‌న్ లాల్ మ్యాజిక్ చేశాడు.

క‌పిల్ సూప‌ర్ క్యాచ్‌..
ఈసారి మాత్రం కెప్టెన్ న‌మ్మ‌కాన్ని మ‌ద‌న్‌లాల్ వ‌మ్ముచేయలేదు. ఆ ఓవ‌ర్‌లో మ‌ద‌న్ లాల్ అద్భుతం చేశాడు. వీవీ రిచర్డ్స్‌ను ఔట్ చేసి మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ మ‌ద‌న్ లాల్ కంటే కెప్టెన్ క‌పిల్ దేవ్‌కే ఇవ్వాలి. సంచ‌ల‌న క్యాచ్‌తో వీవియ‌న్‌ను క‌పిల్ దేవ్ పెవిలియ‌న్‌కు పంపాడు. 

ఆ ఓవ‌ర్‌లో మూడో బంతిని మ‌ద‌న్ లాల్ రిచర్డ్స్‌కు షార్ట్ పిచ్ డెలివ‌రీగా సంధించాడు. అత‌డు ఆ డెలివరీని  హుక్ షాట్ ఆడాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి స‌రిగ్గా షాట్ కన‌క్ట్‌కాక‌పోవ‌డంతో బంతి డీప్ మిడ్ వికెట్ దిశ‌గా గాల్లోకి లేచింది. ఈ స‌మ‌యంలో మిడ్-ఆన్‌లో ఉన్న కపిల్ దేవ్.. డీప్ మిడ్-వికెట్ వైపు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి సంచ‌ల‌న క్యాచ్‌ను అందుకున్నాడు.

ఆ క్యాచ్‌తో విండీస్ ఖేల్ ఖత‌మైంది. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయి 140 ప‌రుగుల‌కే క‌రేబియ‌న్ జ‌ట్టు కుప్ప‌కూలింంది. దీంతో 43 ప‌రుగులతో భార‌త్ చారిత్ర‌త్మక విజ‌యాన్ని సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో అమ‌ర్ నాథ్, మ‌ద‌న్ లాల్ తలా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సంధు రెండు, బిన్నీ ఒక్క వికెట్ సాధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement