భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.
కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్‌లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.
ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.
కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్‌కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.
సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్‌లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.
తన కెరీర్‌లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
Comments
Please login to add a commentAdd a comment