ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. వెలుగు వెంటే చీకటి.. సుఖం వెంటే దుఃఖం.. ఇలా ఒకదాని వెనుక మరొకటి రావడం సహజం. కానీ కొందరి జీవితంలో అంతా బాగుందనుకునేలోపే.. మొత్తం తలకిందులైపోతుంది. దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికినవాళ్లు సైతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుత స్థితి ఇందుకు నిదర్శనం.
ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వచ్చిన మేటి ఆటగాళ్లలో కాంబ్లీ ఒకడు. భారత క్రికెట్ దిగ్గజం అంటూ నీరజనాలు అందుకుంటున్న సచిన్ టెండుల్కర్‌కు బాల్య స్నేహితుడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న వీళ్లిద్దరిలో ఒకరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు అగాథంలో కూరుకుపోయారు. ఇందుకు కారణాలు అనేకం.
ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా!
కాంబ్లీ కెరీర్ ఊపుమీద ఉన్నపుడు అతడి పరిస్థితి బాగానే ఉండేది. అప్పట్లో అతడి నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల వరకు ఉండేదని జాతీయ మీడియా వర్గాల అంచనా. అయితే, ఇప్పుడు మాత్రం కాంబ్లీ దీనస్థితిలో కూరుకుపోయాడు. 2022 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. ఇందుకు కాంబ్లీ క్రమశిక్షణా రాహిత్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.
ఏదేమైనా.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 30 వేలతో కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌తో కలిసి కాంబ్లీ ఒకే వేదికపై కనిపించిన తర్వాత.. మరోసారి అతడి గురించి చర్చ మొదలైంది.
ముఖ్యంగా కాంబ్లీ ఆరోగ్య స్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడికి సాయం అందించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసన్ బల్విందర్ సంధు చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.
కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!
వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉందని బల్విందర్ తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని భావిస్తే తప్పకుండా సాయం చేద్దామని కపిల్ దేవ్(1983 వరల్డ్‌కప్ విజేత జట్టు కెప్టెన్) నాతో చెప్పాడు. ఆర్థికంగానూ సాయం అందిద్దామన్నాడు.
అయితే, అతడు రిహాబ్ సెంటర్‌కు వెళ్లినపుడు మాత్రమే అక్కడి బిల్లులు చెల్లిస్తామని.. చికిత్స పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నీ భరిస్తామని చెప్పాడు. ఒకవేళ కాంబ్లీ అందుకు సిద్ధంగా లేకపోతే మేమేమీ చేయలేము’’ అని బల్విందర్ సంధు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment