భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది.
వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..
అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment