
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.
పాతాళానికి పడిపోయాడు
ముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్‌కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్‌తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.
సాయం చేస్తాం.. కానీ ఓ షరతు
ఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్‌తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్‌కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.
నా కుటుంబం నాతో ఉంది
‘‘రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.
అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్‌లో ఉన్నాడు.
నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్‌కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.
ఇప్పుడు అన్నీ వదిలేశాను
ఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.
తొమ్మిదేళ్ల కెరీర్‌లో
ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్‌గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.
చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment