అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పరామర్శించాడు. కాంబ్లీతో ఫోన్‌లో సంభాషించి అతడికి ధైర్యం చెప్పాడు. అదే విధంగా కాంబ్లీకి చికిత్స అందించిన వైద్యులకు కపిల్ దేవ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఇటీవల అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.
కపిల్ దేవ్‌తో వీడియో కాల్
మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ఈ సందర్భంగా కాంబ్లీకి చికిత్స అందించిన ఆకృతి ఆస్పత్రి డైరెక్టర్.. కపిల్ దేవ్(Kapil Dev)కు వీడియో కాల్ చేసి కాంబ్లీతో మాట్లాడించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన కాంబ్లీ.. ‘‘హాయ్.. కపిల్ పాజీ ఎలా ఉన్నారు’’ అంటూ పలకరించగా.. కపిల్ దేవ్ కూడా ఆప్యాయంగా బదులిచ్చాడు.
లవ్ యూ.. తొందర్లోనే వస్తాను
‘‘నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుస్తాను. మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్తే మాత్రం అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా! గడ్డానికి కూడా రంగేసుకున్నావు.
కానీ దేనికీ ఇప్పుడే తొందరపడవద్దు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మునుపటి జీవితం గడుపగలవు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పక పాటించు. తొందర్లోనే నేను వచ్చి కలుస్తాను. సరేనా.. లవ్ యూ’’ అని కపిల్ దేవ్ కాంబ్లీకి భరోసా ఇచ్చాడు.
కాగా ఇంటికి చేరుకున్న అనంతరం కాంబ్లీ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు సందేశం ఇచ్చాడు. ‘‘మద్యం, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది’’ అని పేర్కొన్నాడు.
సచిన్ టెండుల్కర్ బాల్య మిత్రుడు
మరోవైపు.. కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని... కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ వివేక్ త్రివేది పేర్కొన్నారు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండుల్కర్(Sachin tendulkar)కు బాల్య మిత్రుడు. ఇద్దరూ ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.
అయితే, సచిన్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ లెజెండరీ బ్యాటర్‌గా ఎదగగా.. కాంబ్లీ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకున్నాడు. ఈ క్రమంలో.. ఇటీవల తమ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌ను కలిసిన కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.
కపిల్ సేన ఆర్థిక సాయం!
ఈ క్రమంలో అతడిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తగా. కపిల్ సారథ్యంలో 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, కాంబ్లీ చెడు అలవాట్లు మానేసి.. పునరావాస కేంద్రానికి వెళ్తేనే సహాయం అందిస్తామని షరతు పెట్టగా.. అతడు అందుకు అంగీకరించాడు. తాను మందు, పొగ తాగటం మానేశానని చెప్పాడు.
చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!?
Comments
Please login to add a commentAdd a comment