భారత క్రికెట్‌లో ఇప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్నారు. కానీ 1990లలో ఇండియన్ క్రికెట్ పరిస్ధితి పేరు. అప్పటిలో జవగల్ శ్రీనాథ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు ఎవరూ లేరు. వెంకటేష్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, అజిత్ అగార్కర్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికి.. వారి పేస్ మాత్రం ప్రత్యర్ధులను భయపెట్టేది కాదు. సరిగ్గా అదే సమయంలో ఓ కర్ణాటక కుర్రాడు దేశీవాళీ క్రికెట్‌లో 157.8 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ అందరిని ఆకర్షించాడు. భారత క్రికెట్‌లో అప్పటివరకు ఎవరు కనీవినీ ఎరుగని స్పీడ్ అది.
అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్ధి బ్యాటర్లు భయపడేవారు. తన రా పేస్‌తో బ్యాటర్లను వణికించేవాడు. ఓ దశలో అతడు... షోయబ్ అక్తర్, జవగల్ శ్రీనాథ్‌ను మించిపోతాడని అంతా భావించారు. ఆ కుర్రాడు తన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్‌తో బీసీసీఐ సెలక్టర్లు దృష్టిలో పడ్డాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. 1996 అక్టోబరు 10న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో ఆ యంగ్ పేస్‌గన్ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు.
దీంతో భారత క్రికెట్ జట్టుకు ఓ ఆణిముత్యం లభించిందని అందరూ తెగ సంబర పడ్డారు. కానీ ఆ సంతోషం రెండు మ్యాచ్‌లకే ముగిసి పోయింది. మరో అక్తర్ అవుతాడనకున్న ఆ యువ సంచలనం కెరీర్ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆ యువకుడు తన కెరీర్‌నే కాదు తన జీవితాన్ని కూడా అర్ధంతరంగా ముగించాడు. భారత క్రికెట్‌కు జెట్ స్పీడ్ పరిచయం చేసిన ఆ కర్ణాటక కుర్రాడు.. ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద గాథ మరెవరిదో కాదు.. టీమిండియా మాజీ పేసర్, దివంగత కర్ణాటక ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్‌ది.
ఎవరీ డేవిడ్ జాన్సన్..?
డేవిడ్ జాన్సన్ 1971 అక్టోబరు 16న కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా అర్సికెరెలో జన్మించాడు. డేవిడ్ జాన్సన్ తండ్రి ఆంగ్లో-ఇండియన్. జాన్సన్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కవ. అందుకు తగ్గట్టే స్కూల్ డేస్ నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో 1992-93 రంజీ సీజన్‌లో కర్ణాటక తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సీజన్‌లోనే కేరళపై పది వికెట్ల హాల్ సాధించి సత్తాచాటాడు. ఆ తర్వాత జాన్సన్ వెనుదిరిగి చూడలేదు.
దేశీవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు దూసుకెళ్లాడు. కర్ణాటక జట్టుకు ఎన్నో సంచలన విజయాలుఅందించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాలుగేళ్లకు అతడికి భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. 1996లో ఢిల్లీలో ఆసీస్ జరిగిన ఏకైక టెస్టు కోసం జాన్సన్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌కు జవగల్ శ్రీనాథ్ గాయం కారణంగా దూరం కావడంతో జాన్సన్‌కు భారత జట్టులో చోటుదక్కింది.
తన తొలి మ్యాచ్‌లో జాన్సన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ తర్వాత అతడిని అదే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా తీసుకువెళ్లారు. డర్బన్ వేదికగా సఫారీలతో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. కానీ అదే తనకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందని జాన్సన్ అస్సలు ఊహించలేదు.
ఆ తర్వాత బీసీసీఐ అతడికి జట్టులో చోటివ్వలేదు. దీంతో కేవలం రెండు మ్యాచ్‌లతోనే అతడి కెరీర్ ముగిసిపోయింది. భారత జట్టు తరపున అత్యున్నత స్ధాయిలో సత్తాచాటాలన్న అతడి కల కలగానే మిగిలిపోయింది. తన అంతర్జాతీయ కెరీర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు సాధించిన జాన్సన్.. ఫస్ట్ క్రికెట్‌లో 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 125 వికెట్లు పడగొట్టాడు.
బీసీసీఐ సపోర్ట్ చేయలేదా?అయితే ఒక విధంగా చెప్పాలంటే జాన్సన్ కెరీర్ పతనానికి బీసీసీఐ కూడా ఓ కారణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 157 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ వేసే ఫాస్ట్‌బౌలర్‌కు కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితం చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఎంతో మంది గొప్ప క్రికెటర్లు సైతం తమ కెరీర్ ఆరంభంలో ఇబ్బంది పడి వచ్చినవారే.
అటువంటిది జాన్సన్‌ను మరికొన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఇచ్చి ఉంటే.. ఈ రోజు భారత క్రికెట్ మొత్తం తనను గుర్తు పెట్టుకుని ఉండేదేమో!!.. అతడు కూడా జవగల్ శ్రీనాథ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి కర్ణాటక దిగ్గజాల సరసన చేరే వాడేమో!!. కానీ అప్పట్లో భారత క్రికెట్‌లో రాజకీయాల జోక్యం వల్ల ఓ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్ కెరీర్ ఆదిలోనే అంతమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆత్మహత్యకు కారణం ఇదేనా? జూన్ 20 2024.. డేవిడ్ జాన్సన్ ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. 52 ఏళ్ల జాన్సన్ బెంగళూరులో తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జాన్సన్‌కు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. జాన్సన్ తన ఇంటికి సమీపంలోనే ఒక క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు.
అయితే అకాడమీ సజావుగా నడవకపోవడంతో ఆయన అప్పుల పాలైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీంతో గతకొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న జాన్సన్.. ఆ క్రమంలోనే ఆత్మహ్యత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment