
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని శార్దుల్ ఠాకూర్
మొహసిన్ ఖాన్‌కు గాయంతో అనూహ్య అవకాశం
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున సత్తా చాటుతున్న ఆల్‌రౌండర్
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేస్తే... ఛేదనలో చెలరేగిపోయిన రైజర్స్ 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది!
దూకుడే మంత్రంగా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్‌లో రాజస్తాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ 286 పరుగులతో విజృంభించింది. రెండో మ్యాచ్‌లో లక్నోతో తలపడాల్సి రావడంతో మరింత భారీ స్కోరు ఖాయమే అని అభిమానులంతా అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే రైజర్స్‌కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇంకేముంది మరోసారి పరుగుల వరద ఖాయం అనుకుంటే... ఒకే ఒక్కడు హైదరాబాద్ జోరుకు అడ్డుకట్ట వేశాడు!!
ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని ఆ ప్లేయర్... అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు క్రితం మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి ఆరెంజ్ ఆర్మీని నిలువరించాడు. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన అతడే భారత సీనియర్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్. అనూహ్య అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్న శార్దుల్‌పై ప్రత్యేక కథనం...
జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 80కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం... మీడియం పేస్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయగల నైపుణ్యం... తాజా రంజీ ట్రోఫీలో అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ... శార్దుల్ ఠాకూర్‌ను ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌పై ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్‌రౌండర్‌కు... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చిoది.
‘ప్రయత్నాలు విడిచిపెట్టకు. నిన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిప్లేస్‌మెంట్‌గా నువ్వు టీమ్‌లో చేరితే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చెప్పిన మాటలతో శార్దుల్ తనను తాను టి20 ఫార్మాట్‌కు సిద్ధం చేసుకున్నాడు.
లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శార్దుల్ తొలి మ్యాచ్ నుంచే తనదైన ముద్ర వేశాడు.
తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లే...
విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో శార్దుల్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే శార్దుల్ 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి మెక్‌గుర్క్‌ను ఔట్ చేసిన ఈ ముంబైకర్... ఐదో బంతికి అభిõÙక్ పొరెల్‌ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది.
అయితే ఆ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్... శార్దుల్‌ను సరిగ్గా వినియోగించుకోలేదు. 2 ఓవర్ల తర్వాత అతడికి అసలు తిరిగి బౌలింగే ఇవ్వలేదు. దీంతో పంత్ సారథ్యంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కాగా... రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై దాన్ని పునరావృతం కానివ్వకుండా చూసుకున్నాడు.
దాని ఫలితమే శార్దుల్ ఐపీఎల్లో తన అత్యుత్తమ గణాంకాలు (4/34) నమోదు చేసుకోవడంతో పాటు లీగ్‌లో 100 వికెట్ల మైలురాయిని సైతం దాటాడు. షార్ట్‌బాల్‌తో అబిషేక్‌కు బైబై చెప్పిన శార్దుల్... తదుపరి బంతికే ఇషాన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మరోసారి బౌలింగ్‌కు వచి్చన అతడు... అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమీని ఔట్ చేశాడు.
రైజర్స్‌కు కళ్లెం...
హిట్టర్లతో దట్టంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు శార్దుల్ వెల్లడించాడు. ‘రైజర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను లాగేసుకుంటున్నారు. అలాంటిది వారిపై ఒత్తిడి పెంచితే ఫలితాలు రాబట్టవచ్చు అని ముందే అనుకున్నా. చాన్స్ తీసుకోవాలనుకున్నా.
ఫ్లాట్ పిచ్‌పై ఆరంభంలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడం సన్‌రైజర్స్ ప్లేయర్లకు అలవాటు. అలాంటిది వారిని భారీ స్కోరు చేయకుండా మొదట్లోనే అడ్డుకోవాలని భావించా. నా ప్రణాళికలకు తగ్గట్లే బౌలింగ్ చేశాను. మెరుగైన ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను. జట్టు విజయంలో నా వంతు పాత్ర ఉండాలని భావిస్తా’ అని శార్దుల్ అన్నాడు.
ఐపీఎల్‌లోని అన్నీ జట్లలో బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని విమర్శలు మూటగట్టుకున్న లక్నో... ఇప్పుడు శార్దుల్ మ్యాజిక్‌తో ముందుకు సాగుతోంది. లీగ్‌లో మున్ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నుట్లు ఈ ఆల్‌రౌండర్ వెల్లడించాడు.
జహీర్ ఫోన్ కాల్‌తో..
ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో... శార్దుల్ దేశవాళీల్లో మరింత పట్టుదలగా ఆడాడు. 2024–25 రంజీ సీజన్‌లో ముంబై జట్టు తరఫున ఈ ఆల్‌రౌండర్ 35 వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి 500 పైచిలుకు పరుగులు చేశాడు.
‘రంజీ నాకౌట్ మ్యాచ్‌ల సమయంలో జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సాధన కొనసాగించా. వేరే జట్లు కూడా సంప్రదించినప్పటికీ... జహీర్ ముందు ఫోన్ చేయడంతో అతడి మాటకు విలువ ఇచ్చి లక్నో జట్టులో చేరేందుకు అంగీకరించా’ అని శార్దుల్ చెప్పాడు. ఐపీఎల్ వేలంలో కొనుగోలు ఏ జట్టు కొనుగోలు చేసుకోక పోవడంతో ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని శార్దుల్... మరింత క్రమశిక్షణతో తన బౌలింగ్ అ్రస్తాలను పెంచుకొని ఫలితాలు రాబడుతున్నాడు.
–సాక్షి, క్రీడావిభాగం