సన్నాహక మ్యాచ్‌లు ఆడకనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు కోల్పోయారన్న విమర్శల కారణంగా... ఆస్ట్రేలియాలో మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవాలన్న సూచనలతో... పర్యటన ప్రారంభానికి ముందు ఓ నాలుగు రోజుల మ్యాచ్ ఏర్పాటు చేసుకున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం సీఏ ఎలెవెన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ యువ సంచలనం పృథ్వీ షా మడమ గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత దృష్ట్యా పృథ్వీ ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో ప్రాక్టీస్ సంగతి ఏమో కాని, ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సేవలను కోల్పోయి అసలుకే ఎసరొచ్చినట్లయింది.
అనవసర ప్రయత్నంతో..
సీఏ ఎలెవెన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ దిశగా మ్యాక్స్ బ్రయాంట్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద పృథ్వీ అందుకునేందుకు యత్నించాడు. పరుగున వచ్చిన అతడు... బంతిని క్యాచ్ పట్టాడు కానీ, నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో అతడి ఎడమ పాదం పూర్తిగా మెలికపడింది. ఆ నొప్పితోనే అతడు బంతి సహా బౌండరీ లైన్ దాటేశాడు. అంతగా ప్రయత్నించాల్సిన పని లేకున్నా... పృథ్వీ అనవసరంగా తొందరపడి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. జట్టుకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. మరోవైపు పృథ్వీ ప్రస్తుతానికి తొలి టెస్టుకే అందుబాటులో ఉండడని అంటున్నారు. గాయం తీరు చూస్తే రెండో టెస్టు నాటికీ అతడు కోలుకోవడం అనుమానంగానే ఉంది. మైదానం నుంచి పృథ్వీని ఫిజియో, సహాయక సిబ్బంది చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లగా... ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడు క్రచెస్ (ఊత కర్రల)సాయంతో బయటకు రావడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది.
ఓపెనింగ్ జోడీ ఎవరో?
నిన్నటివరకు పృథ్వీకి ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహులా? మురళీ విజయా? అనే సందిగ్ధం ఉండేది. ఇప్పుడు యువ బ్యాట్స్‌మన్ గాయంతో వైదొలగడంతో అసలు ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరో తేలడం లేదు. ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే ప్రాథమికంగా స్పెషలిస్ట్ ఓపెనర్లైనందున రాహుల్, విజయ్‌నే దింపే అవకాశం ఉంది. కానీ, ఈ ఇద్దరి ఫామ్ దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పక్కనే ఉన్న న్యూజిలాండ్‌లో ‘ఎ’ జట్ల సిరీస్‌లో పాల్గొంటున్న మయాంక్ అగర్వాల్‌ను రప్పించినా, పూర్తిగా కొత్తవాడైన అతడిని ఆస్ట్రేలియా వంటి జట్టుపై బరిలో దింపడం సాహసమే అవుతుంది. అయితే, మరో ప్రయత్నమూ చేయొచ్చని అనిపిస్తోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ రోహిత్‌శర్మను ఓపెనర్‌గా పంపడం. రోహిత్ ఇప్పటివరకు ఆరో స్థానానికే పోటీదారుగా ఉన్నాడు. మరోవైపు జట్టు అవసరాలను గుర్తించిన అతడు కొంతకాలం క్రితం టెస్టుల్లో తాను ఓపెనింగ్‌కైనా సిద్ధమని ప్రకటించాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేమీ లేదని టీం మేనేజ్‌మెంట్ భావిస్తే... ఆడిలైడ్ టెస్టులో రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించినా ఆశ్చర్యం లేదు. చూద్దాం... ఏం జరుగుతుందో?
పృథ్వీషా ఔట్!
Published Sat, Dec 1 2018 12:49 AM | Last Updated on Sat, Dec 1 2018 12:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment