Prithvi Shaw Ruled Out Of Remainder Of One-Day Cup Due To Knee Injury - Sakshi
Sakshi News home page

భీకర ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాకు గాయం.. టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమణ

Published Wed, Aug 16 2023 4:20 PM | Last Updated on Wed, Aug 16 2023 5:29 PM

Prithvi Shaw To Miss Remainder Of Royal London Cup 2023 Edition With Knee Injury - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌, నార్తంప్టన్‌షైర్‌ స్టార్‌ ఆటగాడు పృథ్వీ షా రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023 నుంచి అర్థంతరంగా నిష్క్రమించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర డబుల్‌ సెంచరీతో పాటు సుడిగాలి సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. ముందుగా అనుకున్న దాని కంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు.

నార్తంప్టన్‌ యాజమాన్యం షాను అయిష్టంగా జట్టును నుంచి రిలీజ్‌ చేసింది. ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది నిజంగా బాధాకరం.. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ తదుపరి మ్యాచ్‌లకు పృథ్వీ షా అందుబాటులో ఉండడు. డర్హమ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ షా గాయపడ్డాడు.

ఈ టోర్నీలో లిడింగ్‌ రన్‌ స్కోరర్‌ (4 మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీ, సెంచరీ సాయంతో 429 పరుగులు) అయిన షా జట్టులో లేకపోవడం​ పూరించలేని లోటు. స్కాన్‌ రిపోర్ట్‌ల్లో షాకు తగిలిన గాయం చాలా తీవ్రమైందని తెలిసింది. షా త్వరలో లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను కలుస్తారు. అతి తక్కువ వ్యవధిలో షా నార్తంప్టన్‌షైర్‌పై తీవ్ర ప్రభావం చూపాడు అంటూ ఆ జట్టు కోచ్‌ జాన్‌ సాడ్లర్‌ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

ఇదిలా ఉంటే, రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023తో ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. నార్తంప్టన్‌షైర్‌ తరఫున అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడి నుంచి షా సుడి తిరిగింది. ఆగస్ట్‌ 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఆతర్వాత ఆగస్ట్‌ 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. 

భీకర ఫామ్‌లో ఉండిన షా ఈ టోర్నీలో మరిన్న అద్భుతాలు చేస్తాడనుకున్న తరుణంలో అనూహ్యంగా గాయపడటంతో నార్తంప్టన్‌ యాజమాన్యంతోపాటు షా అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రదర్శనలతో షా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంగా గాయం షా కెరీర్‌ను మరో నాలుగు మెట్లు వెనక్కు వేసేలా చేసింది. ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు షాను ఆసియా కప్‌కు కాని, వన్డే వరల్డ్‌కప్‌కు కాని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement