న్యూఢిల్లీ: అంతర్జాతీయ టి20ల్లో మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో అతను జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం ధోనిని సెలక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు. భారత్ ఆడిన గత రెండు టి20 సిరీస్‌లలో (సొంతగడ్డపై వెస్టిండీస్‌తో, ఆస్ట్రేలియాతో) ధోనికి చోటు దక్కలేదు. దాంతో పొట్టి ఫార్మాట్‌లో అతని ఆటకు ఫుల్‌స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా ధోనికి మరోసారి అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లు, న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ కోసం సోమవారం సెలక్టర్లు జట్లను ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు మాజీ కెప్టెన్‌కు సాధ్యమైనంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకే అతడిని తిరిగి టి20 జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ మరో ఎనిమిది వన్డేలు (ఆసీస్‌తో 3, న్యూజిలాండ్‌తో 5) మాత్రమే ఆడనుంది. ధోని గైర్హాజరులో పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, దినేశ్ కార్తీక్ రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. ఇప్పుడు ధోనితో పాటు వీరిద్దరు కూడా 15 మంది సభ్యుల టి20 జట్టులో ఉండటం విశేషం. ‘టి20 ఫార్మాట్‌లో పంత్‌లాంటి కుర్రాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిదని ధోని భావించాడు. అందుకే తనంతట తానే తప్పుకున్నాడు’ అని విండీస్‌తో సిరీస్‌కు ముందు కోహ్లి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడాలని నిర్ణయించుకోవడం అనూహ్యం.
వన్డేలకు కార్తీక్...
ఆసియా కప్ తర్వాత వన్డే టీమ్‌లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్ కూడా పునరాగమనం చేశాడు. పంత్ స్థానంలో అతనికి చోటు లభించింది. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాకు ఊహించినట్లుగానే రెండు ఫార్మాట్‌లలో కూడా స్థానం దక్కింది. వెస్టిండీస్ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడి స్థానం కోల్పోయిన షమీని కూడా వన్డేల కోసం ఎంపిక చేశారు. మరో పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు జట్లలోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో రెగ్యులరే అయినా టి20ల్లో పెద్దగా ఆడని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు కూడా చోటు దక్కింది. జాదవ్ తన ఆఖరి టి20 మ్యాచ్‌ను 2017 అక్టోబరులో ఆడాడు.
పాండే, ఉమేశ్ ఔట్...
మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే రెండు జట్లలోనూ స్థానం కోల్పోయాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఆసీస్‌తో మూడు టి20ల్లోనూ పాండేకు ఆడే అవకాశమే రాలేదు. విండీస్‌తో రెండు టి20లు ఆడిన అతను 19, 4 నాటౌట్ పరుగులు చేశాడు. వన్డే, టి20ల్లోనూ సభ్యుడిగా ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు పక్కన పెట్టారు. పునరాగమనం తర్వాత 2 వన్డేలు, 1 టి20 ఆడిన ఉమేశ్ ఘోరంగా విఫలమయ్యాడు. టి20 టీమ్ సభ్యులుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశం లభించకుండానే చోటు కోల్పోయారు.
‘ఎ’ జట్టు తరఫున పంత్...
భారత సీనియర్ జట్టులోకి వేగంగా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ జోరుకు సెలక్టర్లు చిన్న విరామం ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న పంత్‌పై వన్డేల్లో వేటు పడింది. విండీస్‌తో సిరీస్‌లో పంత్ మూడు వన్డేలు ఆడగా... ధోని జట్టులో ఉండటంతో వికెట్ కీపింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు టి20ల్లో కూడా ధోని పునరాగమనం చేయడంతో అతను ఇక్కడా తుది జట్టులో ఉండటం సందేహమే. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే పంత్ స్వదేశం పయనమవుతాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతను భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జనవరి 12, 15, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న భారత్... జనవరి 23నుంచి ఐదు వన్డేలు, 3 టి20ల కోసం కివీస్ పర్యటనకు వెళుతుంది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్,
అంబటి రాయుడు, జడేజా, షమీ.
న్యూజిలాండ్‌తో టి20లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, పంత్.
ధోని మళ్లీ వచ్చాడు
Published Tue, Dec 25 2018 1:12 AM | Last Updated on Tue, Dec 25 2018 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment