IPL 2025: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్‌ తగలనుందా? | IPL 2025 Mega Auction: Indians Who Have Registered For Rs 2 Crore Base Price, Check Out More Details | Sakshi
Sakshi News home page

IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్‌ తగలనుందా?

Published Thu, Nov 7 2024 7:28 AM | Last Updated on Thu, Nov 7 2024 10:01 AM

IPL 2025 mega auction: Indians who have registered for Rs 2 crore base price

ఐపీఎల్‌ వేలంలో భారత క్రికెటర్లపై ఈసారీ కాసుల వర్షం ఖాయం

2 కోట్ల రూపాయల కనీస ధరతో బరిలో 23 మంది భారత క్రికెటర్లు

ఇటలీ నుంచి తొలిసారి ఒకరు వేలంలోకి  

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా ఐపీఎల్‌–2025 వేలం జరగనుండగా... ఇందులో భారత్‌ నుంచి 23 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో పాల్గొననున్నారు. 

రిషబ్‌ పంత్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో పాటు... చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు దూరమైన ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, నటరాజన్‌ వంటి వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్, దేవదత్‌ పడిక్కల్‌ కూడా తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. 

శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకుంటున్న సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ, హైదరాబాద్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్‌ కుమార్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, హర్షల్‌ పటేల్, దీపక్‌ చహర్, శార్దూల్‌ ఠాకూర్, హర్షల్‌ పటేల్, ప్రసిధ్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్, అశ్విన్‌, యుజువేంద్ర చహల్‌ కూడా ఉన్నారు. మూడేళ్ల కోసం చేపడుతున్న ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే కాగా... ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 

అండర్సన్‌ తొలిసారి... 
టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌ ఈసారి ఐపీఎల్‌ వేలానికి దూరమయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తొలిసారి ఐపీఎల్‌ వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 42 ఏళ్ల అండర్సన్‌ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్‌... టి20 మ్యాచ్‌ ఆడి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అండర్సన్‌ చివరిసారిగా 2014లో ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌ ఆడాడు. 

అండర్సన్‌ తన కనీస ధరను రూ. 1 కోటీ 25 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. గత వేలంలో అత్యధిక ధర (రూ. 24 కోట్ల 50 లక్షలు) పలికిన ప్లేయర్‌గా ఘనత సాధించిన ఆ్రస్టేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో పాటు, మినీ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా ఇదే ధరతో వేలంలో పాల్గొననున్నాడు. 
 
రూ. 75 లక్షలతో  సర్ఫరాజ్‌  
గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు... పేలవ ఫామ్‌తో ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో ఉండగా... ఆ్రస్టేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్‌ నుంచి 52 మంది, న్యూజిలాండ్‌ నుంచి 39 మంది, వెస్టిండీస్‌ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్‌ తమ పేరు నమోదు చేసుకున్నారు.   

ఇటలీ నుంచి తొలి ఎంట్రీ... 
ఇటలీ పేసర్‌ థామస్‌ డ్రాకా ఐపీఎల్‌ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా... ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్‌ వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా డ్రాకా నిలిచాడు. ఇటలీ తరఫున ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల డ్రాకా... గ్లోబల్‌ టి20 కెనడా టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. 

ఆ టోరీ్నలో 11 వికెట్లు పడగొట్టిన డ్రాకా... ఆల్‌రౌండర్ల జాబితాలో ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్‌ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఐఎల్‌ టి20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఎమిరేట్స్‌ జట్టుకు డ్రాకా ఎంపికయ్యాడు. ఇక అండర్‌–19 స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ అటు ఉద్యోగంతో పాటు ఇటు క్రికెట్‌లో రాణిస్తున్న నేత్రావల్కర్‌ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి రానున్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement