
మెల్‌బోర్న్: మూడో టెస్టు తొలి రోజు ‘జలంధర్ రైల్వే క్యాంటీన్ నౌకర్ల’ బౌలింగ్‌లో రంజీ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడంటూ మయాంక్ అగర్వాల్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ కెరీ ఓ కీఫ్ మళ్లీ మాట తూలాడు. తన గత వ్యాఖ్యపై క్షమాపణలు చెప్పిన అతను నాలుగో రోజు అదే తరహాలో భారత ఆటగాళ్ల గురించి పరుషంగా మాట్లాడాడు. జడేజా, పుజారాల పేర్లను సరిగ్గా పలకలేక సహచర కామెంటేటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కీఫ్ ఈ పేర్లపై తన అక్కసు వెళ్లగట్టాడు.
ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. కీఫ్ వ్యాఖ్యల గురించి భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ...‘ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే కొంత బాధిస్తాయి. కానీ వాటిని మనం నియంత్రించలేం. అయితే ఆ బాధను కసిగా మార్చుకొని మైదానంలో చెలరేగితే అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చినట్లే’ అని అభిప్రాయపడ్డారు. లెగ్‌స్పిన్ బౌలర్ అయిన 69 ఏళ్ల కెరీ ఒ కీఫ్ ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు.