Cheteshwar Pujara: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఘనంగా పునరాగమనం చేశాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 90 పరుగులు చేసిన నయా వాల్.. పూర్వవైభవాన్ని చాటుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 203 బంతులను ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో భారీ అర్ధ సెంచరీ సాధించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాని పుజారా.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. పుజారాకు తోడుగా శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే, బంగ్లాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పుజారా.. మునుపటి కంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. జట్టులో స్థానం కోల్పోయానని బాధ పడకుండా దేశవాలీ టోర్నీలు, కౌంటీలు ఆడిన పుజారా.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. ఫామ్‌లోకి రావడమే కాకుండా మునుపటి కంటే చాలా మెరుగయ్యాడు. గతంలో పుజారాపై టెస్ట్ ప్లేయర్, నిదానంగా ఆడతాడు అనే ముద్ర ఉండేది.
అయితే ఇంగ్లండ్‌లో జరిగిన లండన్ వన్డే కప్ తర్వాత పుజారాపై ఆ ముద్ర తొలిగిపోయింది. ఆ టోర్నీలో అతను స్టైల్‌కు భిన్నంగా వేగంగా, భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టీమిండియాలో చోటు కోల్పోయానన్న కసితో తనలోని కొత్త యాంగిల్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ సీజన్‌లో అతను ఏకంగా 3 సెంచరీలు బాదాడు. అందులో ఒకటి 73 బంతుల్లో శతకం కాగా మరొకటి 75 బంతుల సెంచరీ.
ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పుజారా.. ఆ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాలో చోటు కోల్పోయానన్న కసితో ఉగ్రరూపం దాల్చిన పుజారా.. తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి పరుగుల వరద పారించాడు.
తద్వార భారత సెలెక్టర్లకు మరో ఛాన్స్ లేకుండా చేసి జట్టులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతి విలువైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను ఆదుకున్నాడు. ఆటగాళ్లెవరైనా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైతే తనలా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని మెసేజ్ పాస్ చేశాడు.
టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే క్రమంలో పుజారా ప్రస్తానాన్ని గమనించిన అభిమానులు.. ఫామ్ కోల్పోయినప్పుడు దేశవాలీ టోర్నీలు ఆడకుండా ఇంట్లోనే కూర్చొనే ఆటగాళ్లకు చురకలంటిస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న పంత్, రోహిత్ శర్మ.. పుజారాను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఫామ్‌లో లేనప్పుడు స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకుని దేశవాలీ టోర్నీలు ఆడాలని గడ్డి పెడుతున్నారు. ఈ విషయంలో పుజారాలోని కసిని చూసి సిగ్గు పడాలని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment