
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్‌లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్‌లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తాజాగా టాస్ ఓడింది.
రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3
వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్‌ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది.
ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్‌లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్‌లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.
పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్‌లో మరో వికెట్ తీశాడు.
అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్
ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్‌లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్‌లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు.
13 ఓవర్లలో 50 పరుగులు
13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment