
అడిలైడ్: చేతిలో ఆరు వికెట్లున్నాయి. చివరి రోజు చేయాల్సిన పరుగులు 178. కెప్టెన్ రూట్ (114 బంతుల్లో 67 బ్యాటింగ్; 9 ఫోర్లు) కుదురుకున్నాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ, బెయిర్ స్టో ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఇదీ యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయ సమీకరణం. ఓవర్‌నైట్ స్కోరు 53/4తో నాలుగో రోజు మంగళవారం రెండో ఇన్నింగ్ కొనసాగించిన ఆసీస్... అండర్సన్ (5/43), వోక్స్ (4/36) ధాటికి 138 పరుగులకే కుప్పకూలింది. లోయర్ ఆర్డర్‌లో స్టార్క్ (20; ఒక ఫోర్, సిక్స్) కాస్త బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 215 కలుపుకొని ఇంగ్లండ్ ముందు 354 పరుగుల లక్ష్యం నిలిచింది.
ఓపెనర్లు కుక్ (16; 2 ఫోర్లు), స్టోన్‌మన్ (36; 6 ఫోర్లు) పట్టుదల ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఛేదన సాఫీగానే ప్రారంభమైంది. తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించాక ఒక్క పరుగు వ్యవధిలో ఈ ఇద్దరు పెవిలియన్‌కు చేరారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ విన్స్ (15; ఒక ఫోర్) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో మలాన్ (29; 4 ఫోర్లు) సహకారంతో రూట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. నాలుగో వికెట్‌కు 78 పరుగులు జత చేశాక మలాన్ అవుటయ్యాడు. ఆట ముగిసే సమయానికి రూట్‌తో పాటు వోక్స్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓవర్టన్, బ్రాడ్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవారే అయినందున అయిదో రోజు మ్యాచ్ ఎటువైపు తిరుగుతుందోననే ఆసక్తి నెల కొంది.
►ఉదయం గం. 9.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం