Joe Root Catches Getting Anderson And Broad To 600 Test Wickets - Sakshi
Sakshi News home page

అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్‌, బ్రాడ్‌లకు ఒకడే లక్కీ హ్యాండ్‌..!

Published Thu, Jul 20 2023 3:43 PM | Last Updated on Thu, Jul 20 2023 3:54 PM

Joe Root Catches Getting Anderson And Broad To 600 Test Wickets - Sakshi

మాంచెస్టర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ (48) వికెట్‌ పడగొట్టడం ద్వారా బ్రాడ్‌ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్‌ చరిత్రలో బ్రాడ్‌ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్‌కు ముందు మురళీథరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708), జేమ్స్‌ ఆండర్సన్‌ (688), అనిల్‌ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్‌ మార్క్‌ను దాటారు. వీరిలో బ్రాడ్‌, అతని సహచరుడు ఆండర్సన్‌ మాత్రమే పేసర్లు కావడం విశేషం. 

కాగా, టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్‌ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్‌ 600వ వికెట్‌లో, బ్రాడ్‌ 600వ వికెట్‌లో వీరి సహచరుడు జో రూట్‌ పాత్ర ఉంది. ఆండర్సన్‌, బ్రాడ్‌లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్‌ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్‌లను రూటే అందుకున్నాడు.

ఆండర్సన్‌ 600వ వికెట్‌ పాక్‌ ఆటగాడు అజహర్‌ అలీ క్యాచ్‌ను, బ్రాడ్‌ 600వ వికెట్‌ ట్రవిస్‌ హెడ్‌ క్యాచ్‌ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్‌ తన 600వ వికెట్‌ను ఆండర్సన్‌ సొంత మైదానంలో అండర్సన్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్‌ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. 

ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌ తొలి రోజు ఇంగ్లండ్‌ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో  8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (51), లబుషేన్‌ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (41) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా..
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్‌ బ్రాడ్‌ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇయాన్‌ బోథమ్‌ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్‌ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement