దిగ్గజ పేసర్, ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. యాషెస్ సిరీస్-2023లో ఇంగ్లండ్ నష్టపోవడానికి ఆండర్సన్ ప్రధాన కారణమని ఆరోపించాడు. లెజెండ్ బౌలర్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు ఇంగ్లండ్ టీమ్ తగిన మూల్యం చెల్లించుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఆండర్సన్ ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఒక్కటంటే ఒక్క కీలక వికెట్ కూడా తీసి జట్టుకు ఉపయోగపడింది లేదని ఫైరయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను ఆండర్సన్‌ను తూర్పారబెట్టిన వాన్.. మరోవైపు నుంచి కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు.
ఆండర్సన్‌ను దిగ్గజ బౌలర్‌గా పరిగణించడాన్ని ఎవరూ కాదనలేరని, జట్టులో చోటుకు అతను వంద శాతం అర్హుడే అని అంటూనే ఆండర్సన్ సేవల వల్ల ఇంగ్లండ్‌కు ఒరిగిందేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం బీబీసీ యాషెస్ డైలీ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, ఇప్పటివరకు జరిగిన 4 యాషెస్ టెస్ట్‌ల్లో 3 మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 114 ఓవర్లు వేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. వాన్ చెప్పినట్లు ఆండర్సన్ పేలవ ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆండర్సన్ స్థానంలో మరే బౌలర్‌ను తీసుకున్నా ఫలితాలు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉండేవి.
నాలుగో టెస్ట్‌లో అయితే ఆండర్సన్ ప్రదర్శన అరంగేట్రం బౌలర్ కంటే దారుణంగా ఉండింది. నాలుగో రోజు ఆండర్సన్ ఏ మాత్రం ప్రభావం చూపించినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకునేది. మొత్తంగా చూస్తే కెరీర్‌లో సుమారు 1000 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్ ప్రస్తుతం జట్టుకు భారంగా మారాడు.
ఐదో టెస్ట్‌లో అయినా ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ మేల్కొనకపోతే ఇంతకుమించిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిగ్గజ బౌలర్, కెరీర్ చరమాంకంలో ఉన్నాడు అని ములాజకు పోతే ఐదో టెస్ట్‌లో కూడా ఇంగ్లండ్‌కు భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో ఆండర్సన్‌ను పక్కకు పెట్టి ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్‌లలో ఎవరో ఒకరిని ఆడించాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే, నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆ జట్టు యాషెస్‌ను ఈ దఫా కూడా తమ వద్దనే ఉంచుకోనుంది. ఒకవేళ ఇంగ్లండ్ ఆఖరి టెస్ట్ గెలిచినా సిరీస్ 2-2తో డ్రా అవుతుందే తప్ప ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment