
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ కొడుకు హసన్ ఐసాఖిల్ స్వదేశంలో జరుగుతున్న ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో అమో రీజియన్‌కు ఆడతున్న 18 ఏళ్ల హసన్.. బాంద్-ఎ-అమీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 235 బంతుల్లో 143 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్‌లో హసన్‌కు ఇది తొలి సెంచరీ.
ఈ మ్యాచ్‌లో హసన్ కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అంతకుముందు కమాల్ ఖాన్ (105), సెదిఖుల్లా పచా (77) కూడా సత్తా చాటడంతో అమో రీజియన్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది.
అనంతరం బాంద్-ఎ-అమీర్ జట్టు ఓపెనర్ హరూన్ ఖాన్ (109) సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేయగలిగింది. అమో బౌలర్లలో సఖీ 4 వికెట్లు తీశాడు. 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమో టీమ్.. హసన్ సెంచరీతో సత్తా చాటడంతో 235 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
45 బంతుల్లో 150 పరుగులు
హసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న హసన్ తండ్రి నబీ కొడుకుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ముచ్చట పడుతున్నాడు.