క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే.
న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.
గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.
ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం.
ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..
రషీద్ ఖాన్
కెప్టెన్‌గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు.
బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు.
రహ్మనుల్లా గుర్బాజ్
ఓపెనర్‌గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
నవీన్ ఉల్ హక్
ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.
ట్రవిస్ హెడ్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్‌స్వింగర్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు.
‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా
(వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు)
డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి.
జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి.
మహ్మద్ నబీ
15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్‌వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి.
అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు.
కల నిజమైంది
సెమీస్‌కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం.
మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్
-సాక్షి. క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment