రోహిత్ శర్మతో రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2024లో సంచలనం.. పసికూనగా భావించే అఫ్గనిస్తాన్ తొలిసారిగా ఓ ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్ చేరింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పూర్తిస్థాయి సభ్యత్వ దేశంగా మారిన ఏడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనత సాధించింది అఫ్గన్ జట్టు.
దేశంలోని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా అనేక కష్టనష్టాలకోర్చి ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షించి స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో హేమాహేమీలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఓడించి సత్తా చాటింది.
ఈ రెండు మేటిజట్లను దాటుకుని.. కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌లో సగర్వంగా అడుగుపెట్టింది. ట్రినిడాడ్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికాతో తొలి సెమీ ఫైనల్లో తలపడనుంది. మరి అఫ్గనిస్తాన్ జట్టు ఇక్కడిదాకా రావడం వెనుక భారత్ పాత్ర కూడా ఉందన్న విషయం తెలుసా?!
అవును.. అండర్‌డాగ్స్‌గా ఉన్న అఫ్గనిస్తాన్ జట్టు ఈ స్థాయికి ఎదగడం వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి హస్తం కూడా ఉంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, సదుపాయాల లేమి దృష్ట్యా అఫ్గనిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌లకు ఆతిథ్యం కల్పించే అవకాశం లేకుండా పోయింది.
పెద్దన్నగా ఆపన్నహస్తం
అలాంటి సమయంలో బీసీసీఐ అఫ్గన్ బోర్డుకు పెద్దన్నగా ఆపన్నహస్తం అందించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న షాహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తమ హోం గ్రౌండ్‌గా వాడుకునేందుకు 2015లో బీసీసీఐ అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో 2017లో అఫ్గనిస్తాన్ గ్రేటర్ నోయిడా వేదికగా ఐర్లాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ పాల్గొంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తమ మకాంను షార్జాకు మార్చిన అఫ్గన్ జట్టు.. మళ్లీ ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడేందుకు సిద్దమైంది.
అంతర్జాతీయ వేదిక కల్పించి
ఇలా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును బీసీసీఐ ఆదుకుంది. అంతర్జాతీయ వేదిక కల్పించి వారిని ప్రోత్సహించింది.
మనవాళ్లే ముందుండి నడిపించి
ఇక అఫ్గన్ జట్టు బలోపేతం కావడంలో పలువురు భారత మాజీ క్రికెటర్ల పాత్ర కూడా ఉండటం విశేషం. లాల్‌చంద్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజా గతంలో ఈ జట్టుకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు.
వన్డే వరల్డ్‌కప్-2023 సమయంలో అజయ్ జడేజా అఫ్గన్ మెంటార్‌గా ఉండి ముందుకు నడిపించగా.. అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు మొట్టమొదటిసారి పాకిస్తాన్‌పై వన్డేలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
దేశాల మధ్య సత్సంబంధాలు
భారత్- అఫ్గనిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ పార్లమెంట్ భవనం నిర్మాణం విషయంలోనూ భారత్ ఆర్థిక సహాయం చేసింది.
ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ గతంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఇండియాకు ఆహ్వానించింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో అఫ్గన్ తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వేళ.. మ్యాచ్ వీక్షించేందుకు స్వాగతం పలికింది. ఇరు దేశాల అనుబంధం, క్రికెట్ జట్ల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్‌లో అఫ్గన్ ఆటగాళ్లు
ఇటీవల ఆస్ట్రేలియాపై విజయం తర్వాత అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. లీగ్ క్రికెట్ ఆడుతుండటం వల్లే తమ జట్టు టీ20 ఫార్మాట్లో మరింత దృఢంగా మారిందని పేర్కొన్నాడు.
ముమ్మాటికీ అది నిజమే.. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆడటం ద్వారా అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల ఆర్థిక స్థితి మెరుగుపడటమే గాకుండా.. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా వారి నైపుణ్యాలు మరింత విస్తృతంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
రషీద్ ఖాన్ సహా మహ్మద్ నబీ, రహ్మనుల్లా గుర్బాజ్.. ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై అఫ్గన్ గెలుపొంది.. సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నవీన్ ఉల్ హక్ కూడా ఐపీఎల్‌లో ఆడుతున్నవాడే!
చదవండి: David Warner: డేవిడ్ వార్నర్ గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment