David Warner: డేవిడ్‌ వార్నర్‌ గుడ్‌బై | David Warner Retires From International Cricket After Australia T20 WC 2024 Exit | Sakshi
Sakshi News home page

David Warner: డేవిడ్‌ వార్నర్‌ గుడ్‌బై

Published Tue, Jun 25 2024 3:34 PM | Last Updated on Wed, Jun 26 2024 5:03 PM

David Warner Retires From International Cricket After Australia T20 WC 2024 Exit

డేవిడ్‌ వార్నర్‌ ఓ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ అంతే! అంతేనా అంటే కచ్చితంగా కాదు... మనకు బాగా తెలిసిన వ్యక్తి... మనల్ని మైదానంలో (ఐపీఎల్‌) ఆటతో, వెలుపల సతీసమేతంగా రీల్స్‌తో తెలుగు వాళ్లకు సుపరిచితుడు.  

అతని గురించి మూడే మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓపెనింగ్‌లో విధ్వంసం, జట్టులో కీలకం, విజయాల్లో సంబరం! కానీ అతని బ్యాటింగ్‌ మెరుపులు ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించవు. 

ఆరు నెలల క్రితం టెస్టు, వన్డే ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఈ ఆస్ట్రేలియన్‌ తాజాగా టీ20లకూ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అతని విధ్వంసరచన ఇకమీదట ఫ్రాంచైజీ ప్రైవేట్‌ టీ20 లీగ్‌లకే పరిమితం కానుంది.  

ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించాడు. టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8లో భాగంగా అఫ్గనిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఫలితంతో ఈ స్టార్‌ బ్యాటర్‌ ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు తెరపడింది.

కాగా ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి రిటైర్‌ అయిన డేవిడ్‌ వార్నర్‌.. టీ20 వరల్డ్‌కప్‌-2024 తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి టోర్నీ అని ప్రకటించాడు. అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా సాగిన ఈ ఐసీసీ ఈవెంట్‌ తర్వాత తాను వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు.

ఈ క్రమంలో మంగళవారం నాటి ఉత్కంఠ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌- బంగ్లాదేశ్‌ను ఓడించడంతో.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నాకౌట్‌ అయింది. కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది.

టీమిండియాతో ఆడిన మ్యాచ్‌ చివరిది
ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌ ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది. ఆసీస్‌ తరఫున అతడు టీమిండియాతో సోమవారం ఆడిన మ్యాచ్‌ చివరిది కానుంది. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో వార్నర్‌ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు.

భారత యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కాగా 37 ఏళ్ల ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు.

తొలుత టీ20.. తర్వాత అదే ఏడాది వన్డేల్లో అడుగుపెట్టిన వార్నర్‌.. 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786,  6932, 3277 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ టెస్టుల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

కచ్చితంగా తనను మిస్‌ అవుతాం
టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ వార్నర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమంతా అతడిని కచ్చితంగా మిస్‌ అవుతాం. చాలా ఏళ్లుగా అతడితో మా ప్రయాణం కొనసాగుతోంది.

మూడు ఫార్మాట్లలో తను అద్భుతంగా రాణించాడు. తొలుత టెస్టులు.. తర్వాత వన్డేలకు.. ఇప్పుడు టీ20లకు ఇలా దూరమయ్యాడు. అతడు జట్టుతో లేకుండా ఉండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement