టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. తాజాగా బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించారు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుత పోరాటం చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయినా సెమీస్‌కు చేరే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో ఛేదించి ఉంటే సెమీస్‌కు చేరి ఉండేది. అయితే ఇలా జరగకపోగా చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
లక్ష్య ఛేదనలో పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు. ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ ఈ స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. నవీన్ ఉల్ హక్ (3.5-0-26-4), రషీద్ ఖాన్ (4-0-23-4), ఫజల్ హక్ (2-0-15-1), గుల్బదిన్ నైబ్ (2-0-5-1) ధాటికి 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment