సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..! | Heartbreaking Picture For Afghanistan Fans After Losing To South Africa In T20 World Cup 1st Semi Final | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!

Published Thu, Jun 27 2024 10:54 AM | Last Updated on Thu, Jun 27 2024 11:10 AM

Heartbreaking Picture For Afghanistan Fans After Losing To South Africa In T20 World Cup 1st Semi Final

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఆఫ్ఘనిస్తాన్‌ జైత్రయాత్ర ముగిసింది. ఇవాళ (జూన్‌ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పోరాటం ముగిసింది. ఈ ఓటమితో ఆఫ్ఠనిస్తాన్‌ వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ సెమీస్‌ దాకా చేరిన ఆఫ్ఘనిస్తాన్‌ అవమానకర రీతిలో వైదొలగడం ప్రతి క్రికెట్‌ అభిమానిని కలిచి వేస్తుంది. 

ఈ ఓటమి అనంతరం ఆఫ్ఘన్ల గుండెలు బద్దలయ్యాయి. ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశ అభిమానుల బాధ అయితే వర్ణణాతీతంగా ఉంది. ఆఫ్ఘన్‌ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలిన అనంతరం కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌ ముఖాల్లో విషాద ఛాయలు కనిపించాయి. వారి ముఖాలు చూస్తే ఎంత కఠినాత్ములకైనా జాలేయాల్సిందే. 

రషీద్‌ ఖాన్‌ కన్నీటిపర్యంతమవుతూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఓటమి అనంతరం డగౌట్‌కు చేరుకునే క్రమంలో ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు ఏడ్చినంత పని చేశారు. ఆఫ్ఘన్‌ ఆటగాళ్ల విషాద ముఖాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఆఫ్ఘన్లను ఓదారుస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని నచ్చజెప్పే ‍ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అయితే తలెత్తుకో కెప్టెన్‌ అని ట్వీట్‌ చేసింంది. 

మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్‌కు తొలిసారి సెమీస్‌కు చేరామన్న సంతోషం కనీసం రెండ్రోజులైనా లేకుండా పోయింది. ఈ బాధ నుంచి వారు బయటపడాలంటే సమయం తీసుకుంటుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ లాంటి మెరుగైన జట్లకు షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆసీస్‌, బంగ్లాదేశ్‌లపై విజయాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్ల సంతోషం​ వర్ణణాతీతంగా ఉండింది. ఆఫ్ఘన్ల సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా సెమీఫైనల్లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్లను, ఆ దేశ అభిమానులను కలిచి వేస్తుంది.

ఇదిలా ఉంటే, ట్రినిడాడ్‌ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్‌ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ 9 వికెట్ల తేడాతో చిత్తు ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.

ఇవాళ రాత్రి 8 గంటలకు జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంది ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్‌-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement