jonathan trott
-
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్ర ముగిసింది. ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ ఓటమితో ఆఫ్ఠనిస్తాన్ వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ సెమీస్ దాకా చేరిన ఆఫ్ఘనిస్తాన్ అవమానకర రీతిలో వైదొలగడం ప్రతి క్రికెట్ అభిమానిని కలిచి వేస్తుంది. ఈ ఓటమి అనంతరం ఆఫ్ఘన్ల గుండెలు బద్దలయ్యాయి. ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశ అభిమానుల బాధ అయితే వర్ణణాతీతంగా ఉంది. ఆఫ్ఘన్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిన అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్, కోచ్ జోనాథన్ ట్రాట్ ముఖాల్లో విషాద ఛాయలు కనిపించాయి. వారి ముఖాలు చూస్తే ఎంత కఠినాత్ములకైనా జాలేయాల్సిందే. రషీద్ ఖాన్ కన్నీటిపర్యంతమవుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఓటమి అనంతరం డగౌట్‌కు చేరుకునే క్రమంలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఏడ్చినంత పని చేశారు. ఆఫ్ఘన్ ఆటగాళ్ల విషాద ముఖాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఆఫ్ఘన్లను ఓదారుస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తలెత్తుకో కెప్టెన్ అని ట్వీట్ చేసింంది. Chin up, Skipp! You've given us the World this event! 🙌@RashidKhan_19#AfghanAtalan | #T20WorldCup | #GloriousNationVictoriousTeam pic.twitter.com/jFu6SO2vmX— Afghanistan Cricket Board (@ACBofficials) June 27, 2024మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్‌కు తొలిసారి సెమీస్‌కు చేరామన్న సంతోషం కనీసం రెండ్రోజులైనా లేకుండా పోయింది. ఈ బాధ నుంచి వారు బయటపడాలంటే సమయం తీసుకుంటుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మెరుగైన జట్లకు షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆసీస్, బంగ్లాదేశ్‌లపై విజయాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంతోషం వర్ణణాతీతంగా ఉండింది. ఆఫ్ఘన్ల సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా సెమీఫైనల్లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్లను, ఆ దేశ అభిమానులను కలిచి వేస్తుంది.ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో చిత్తు ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.ఇవాళ రాత్రి 8 గంటలకు జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంది ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్.. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ, ఇంగ్లండ్‌పై ఆఫ్ఘన్ల గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై పూర్తి అవగాహన కలిగిన ట్రాట్.. నిన్నటి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు అన్నీ తానై వ్యవహరించి, ఆఫ్ఘన్ల గెలుపుకు దోహదపడ్డాడు. ప్రస్తుత ఇంగ్లండ్ టీమ్‌తో పాటు భారత పిచ్ పరిస్థితులపై కూడా సంపూర్ణ అవగాహన (2011లో భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ట్రాట్ ఇంగ్లండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు) కలిగిన ట్రాట్.. ఆఫ్ఘన్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చి వారి గెలుపుకు తోడ్పడ్డాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో టెన్షన్‌గా కనిపించిన ట్రాట్.. ఆఫ్ఘన్ల గెలుపు అనంతరం ఎంతో సంతోషంగా కనిపించాడు. స్వదేశంపై తన వ్యూహాలు విజయవంతంగా అమలు కావడంతో ట్రాట్ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం పట్టరాని అనందంతో స్టేడియం మొత్తం కలిగతిరిగాడు. ఇంగ్లండ్‌పై గెలుపు అనంతరం అతను మాట్లాడుతూ.. ఈ గెలుపు ఆఫ్ఘనిస్తాన్ యువతలో ఎంతో సూర్తిని నింపుతుందని అన్నాడు. ఇటీవల సంభవించిన భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘన్లకు ఈ విజయం ఎంతో ఊరట కలిగిస్తుందని తెలిపాడు. ఈ గెలుపు ఆఫ్ఘన్ల ముఖాల్లో చిరునవ్వులు చిగురింపజేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు ఇచ్చే స్పూర్తితో ఆఫ్ఘన్ యువత బ్యాట్ పడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇంగ్లండ్‌పై గెలుపులో కీలకపాత్ర పోషించిన ముజీబ్, రషీద్‌లు తమ చారిత్రక గెలుపును భూకంప బాధితులకు అంకితం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపంలో 1000 మందికిపైగా మరణించారు. కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ
రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే. సిరీస్ ఓటమితో బాధలో ఉన్న ఆఫ్గన్‌కు మరో గట్టిషాక్ తగిలింది. జట్టు హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్‌తో పాటు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జైయ్లకు ఐసీసీ శిక్షించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్-1 నిబంధన ఉల్లఘించినందుకు గానూ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన సమయంలో ఫీల్డ్ అంపైర్లు పిచ్‌ను పరిశీలించడానికి ఇన్స్పెక్షన్కు వచ్చారు. ఈ సమయంలో కోచ్ జొనాథన్ ట్రాట్ అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్టాడినట్లు తెలిసింది. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్లు కోచ్ ట్రాప్‌పై రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిర్ హృదయ్‌ను ఔట్ చేశాకా.. అజ్మతుల్లా ఒమర్జైయ్ హృదయ్‌ను టార్గెట్ చేస్తూ పరుష పదజాలం ఉపయోగిస్తూ పెవిలియన్ వైపు చేతిని చూపెట్టాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో ఆర్టికల్ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఇద్దరికి ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. ఇక షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అజ్మతుల్లా జజాయ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజర్ రెహమన్, షకీబ్ అల్ హసన్‌లు తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్ దాస్(35), షకీబ్(18 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. చదవండి: #MLC2023: దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం -
ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు..!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నియమితుడయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్రాహం థోర్ప్ స్థానంలో ట్రాట్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది మేలో తీవ్ర అస్వస్థతకు గురైన గ్రాహం థోర్ప్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఐర్లాండ్ సిరిస్‌తో ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన కోచ్‌గా ట్రాట్ ప్రయాణం మొదలుకానుంది. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ట్రాట్.. ఇంగ్లండ్‌కు 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ట్రాట్ 127 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 6792 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో 13 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు ఉన్నాయి. ట్రాట్ గతంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు మెంటార్‌గా, ఇంగ్లండ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. చదవండి: ZIM vs BAN: జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..! -
అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ వీడ్కోలు
లండన్ : ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 నెలల క్రితం ఆసీస్‌లో జరిగిన యాషెస్ సిరీస్ మధ్యలో మానసిక ఒత్తిడి కారణంగా ఈ 34 ఏళ్ల ఆటగాడు అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అనంతరం ఆదివారం ముగిసిన వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టులో చేరాడు. అయితే ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ట్రాట్ కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లున్నాయి. పేలవ ఫామ్ కనబరుస్తున్న తను రిటైర్ కావడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్నట్టు తెలిపాడు. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. ఇంగ్లండ్ జట్టుకు ఆడగల స్థాయి నా ఆటలో ఉందని అనుకోవడం లేదు. సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగినా రాణించలేకపోవడం నిరాశ కలిగించింది. ఇంతకాలం నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లడంతో పాటు విఫలమైన సందర్భాలూ ఉన్నాయి. వార్విక్షైర్ తరఫున మాత్రం నా ఆట కొనసాగుతుంది’ అని ట్రాట్ అన్నాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ట్రాట్ 2007లో విండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అనంతరం రెండేళ్ల తర్వాత 2009 యాషెస్ సిరీస్‌లో కెరీర్లో తొలి టెస్టు ఆడాడు. అందులో తన సెంచరీ సహాయంతో జట్టు యాషెస్‌ను నిలబెట్టుకోవడంతో ట్రాట్ పేరు మార్మోగింది. 2011లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. అయితే 2013-14 యాషెస్ సిరీస్‌లో షార్ట్ బంతులను ఆడడంలో ఘోరంగా విఫలమై మధ్యలోనే జట్టు నుంచి తప్పుకున్నాడు. ఓవరాల్‌గా ఎనిమిదేళ్ల పాటు అతడి అంతర్జాతీయ కెరీర్ కొనసాగింది. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ గుడ్ బై
లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ట్రాట్ ప్రకటించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి వచ్చిన ట్రాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించగల స్థాయిలో తన ఆటతీరులేదని, బాధాకరమైనా వైదొలగకతప్పలేదని ట్రాట్ చెప్పినట్టు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. 34 ఏళ్ల ట్రాట్ 52 టెస్టుల్లో 3835 పరుగులు చేశాడు. 68 వన్డేలాడిన ఇంగ్లండ్ క్రికెటర్ 2819 పరుగులు చేశాడు. -
బాబోయ్... నేనాడలేను
సిడ్నీ: యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. తీవ్ర ఒత్తిడి కారణంగా తిరిగి స్వదేశానికి వెళుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ధ్రువీకరించింది. ‘క్రికెట్ నుంచి ట్రాట్ కొంత విరామం తీసుకుంటున్నాడు. అయితే ఇది ఎంతకాలమనేది చెప్పలేం. దీని గురించి పూర్తి విషయాలు అతను వెల్లడించలేదు. ప్రస్తుతం అతను ఉన్న స్థితిలో ఆట ఆడలేడు. కాబట్టి మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండడు’ అని ఈసీబీ వెల్లడించింది. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్న తాను ఇక కోలుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు ట్రాట్ తెలిపాడు. 2006-07లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ట్రెస్కోథిక్ కూడా ఇలాగే ఒత్తిడి వల్ల కొన్నాళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. నిరాశలో ఉన్న ట్రాట్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ట్రెస్కోథిక్ ట్వీట్ చేశాడు.