అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ వీడ్కోలు
లండన్ : ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 నెలల క్రితం ఆసీస్‌లో జరిగిన యాషెస్ సిరీస్ మధ్యలో మానసిక ఒత్తిడి కారణంగా ఈ 34 ఏళ్ల ఆటగాడు అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అనంతరం ఆదివారం ముగిసిన వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టులో చేరాడు. అయితే ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ట్రాట్ కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్‌లున్నాయి. పేలవ ఫామ్ కనబరుస్తున్న తను రిటైర్ కావడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్నట్టు తెలిపాడు.
‘ఇది చాలా కఠిన నిర్ణయం. ఇంగ్లండ్ జట్టుకు ఆడగల స్థాయి నా ఆటలో ఉందని అనుకోవడం లేదు. సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగినా రాణించలేకపోవడం నిరాశ కలిగించింది. ఇంతకాలం నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లడంతో పాటు విఫలమైన సందర్భాలూ ఉన్నాయి. వార్విక్‌షైర్ తరఫున మాత్రం నా ఆట కొనసాగుతుంది’ అని ట్రాట్ అన్నాడు.
దక్షిణాఫ్రికాలో జన్మించిన ట్రాట్ 2007లో విండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అనంతరం రెండేళ్ల తర్వాత 2009 యాషెస్ సిరీస్‌లో కెరీర్‌లో తొలి టెస్టు ఆడాడు. అందులో తన సెంచరీ సహాయంతో జట్టు యాషెస్‌ను నిలబెట్టుకోవడంతో ట్రాట్ పేరు మార్మోగింది. 2011లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. అయితే 2013-14 యాషెస్ సిరీస్‌లో షార్ట్ బంతులను ఆడడంలో ఘోరంగా విఫలమై మధ్యలోనే జట్టు నుంచి తప్పుకున్నాడు. ఓవరాల్‌గా ఎనిమిదేళ్ల పాటు అతడి అంతర్జాతీయ కెరీర్ కొనసాగింది.