బ్రిడ్జ్‌టౌన్: టెస్టుల్లో యాషెస్ సిరీస్, జింబాబ్వేలో భారత్, శ్రీలంక గడ్డపై దక్షిణాఫ్రికా... ఇలా ఒక వైపు అంతర్జాతీయ క్రికెట్ నిరాటంకంగా సాగిపోతుండగా, మరో వైపు తొలిసారి జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీ సంచలనాలకు వేదికవుతోంది. మరీ స్టార్లు లేకపోయినా గుర్తింపు పొందిన ఆటగాళ్లు బరిలోకి దిగిన ఈ లీగ్ అక్కడి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా బంగ్లాదేశ్ బౌలర్ షకీబుల్ హసన్ ఈ లీగ్‌లో సంచలన బౌలింగ్ గణాంకాలు (4-1-6-6) నమోదు చేశాడు.
వివరాల్లోకెళితే... సీపీఎల్‌లో శనివారం ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్ స్టీల్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ బౌలర్ షకీబ్ కేవలం 6 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ట్రినిడాడ్ 12.5 ఓవర్లలోనే 52 పరుగులకు ఆలౌటైంది. టి20 క్రికెట్ చరిత్రలో షకీబ్‌ది రెండో అత్యుత్తమ ప్రదర్శన. అత్యుత్తమ రికార్డు అరుల్ సపయ (సోమర్సెట్-6/5) పేరిట ఉంది. అన్నట్లు ఈ చిన్న లక్ష్యాన్ని చేధించేందుకు బార్బడోస్ 6 వికెట్లు కోల్పోయింది!