దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు రోజుల వ్యవధిలో మరో దిగ్గజ క్రికెటర్ సేవలు కోల్పోయింది. సోమవారం స్టెయిన్ టెస్టుల రిటైర్మెంట్ తర్వాత మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. దశాబ్దన్నర కాలం పాటు సఫారీ బ్యాటింగ్ మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచిన హషీమ్ మొహమ్మద్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్‌లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు.
జొహన్నెస్‌బర్గ్: రుషిలాంటి ఏకాగ్రత...వీరుడిలాంటి పోరాటపటిమ... హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్ సందర్భంగా సహచర క్రికెటర్ ఒకరు చేసిన ప్రశంస ఇది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోయే తత్వం, చూడముచ్చటైన స్ట్రోక్‌లు, వివాదాలు లేని, బ్యాట్‌తోనే తప్ప ఏనాడూ నోటితో సమాధానం చెప్పని తనదైన ప్రత్యేక వ్యక్తిగత జీవన శైలి...ఇవన్నీ హషీం ఆమ్లాను విశేష క్రికెటర్‌గా నిలబెట్టాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు.
అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్‌లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆమ్లా కెరీర్‌లో చివరిది. లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ సఫారీ స్టార్ చివరకు ఆట ముగించాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు ల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన అతను... వన్డే ప్రపంచ కప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 203 పరుగులే చేయగలిగాడు.
అద్భుతమైన ప్రదర్శనలతో...
2002 అండర్–19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమ్లా కోల్‌కతాలో భారత్‌పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి 3 టెస్టుల్లో కలిపి 62 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 15 నెలల తర్వాత తిరిగి వచ్చి కివీస్‌పై భారీ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కొంత తడబడ్డా 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది.
మరుసటి ఏడాది లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతూ సెంచరీతో తన జట్టును రక్షించడంతో ఆమ్లా పోరాటపటిమ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 2012 సిరీస్‌లో చేసిన రెండు సెంచరీలు, అంతకు ముందు ఏడాది స్వదేశంలో అదే జట్టుపై సాధించిన రెండు వరుస శతకాలు ఆమ్లా కెరీర్‌లో చెప్పుకోదగ్గవి. 2012లో ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో 13 గంటలకు పైగా క్రీజ్‌లో నిలిచి అజేయంగా సాధించిన 311 పరుగులు అతని కెరీర్‌లో హైలైట్. 2006నుంచి 2015 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా జట్టు విదేశాల్లో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదంటే అందులో ఆమ్లా పోషించిన పాత్ర అద్భుతం. 14 టెస్టుల్లో సఫారీ జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు.
భారత్‌లో సూపర్...
ఆమ్లా భారత్‌లో 3 సార్లు పర్యటించాడు. 2004లో విఫలమైన అతను 2008 సిరీస్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 2010 సిరీస్‌లోనైతే ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 253 నాటౌట్, 114, 123 నాటౌట్ పరుగులతో మన బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 2015లో కెప్టెన్‌గా వచ్చి 0–3తో సిరీస్ చేజార్చుకున్నా...ఢిల్లీ టెస్టులో మ్యాచ్‌ను కాపాడేందుకు 244 బంతుల్లో 25 పరుగులు చేసిన అతని పట్టుదలను
ఎవరూ మరచిపోలేరు.
వన్డేల్లోనూ దూకుడు...
శైలిపరంగా చూస్తే టెస్టు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా అనిపించినా...వన్డేల్లోనూ ఆమ్లాకు అద్భుతమైన రికార్డు ఉంది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో అతని వన్డే సత్తా బయటపడింది. ఇదే ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 75 సగటు, 104 స్ట్రైక్‌రేట్‌లో 1058 పరుగులు చేయడం విశేషం. ఒక దశలో అతను వేగంలో కోహ్లితో పోటీ పడ్డాడు. కెరీర్‌లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగుల వరకు ప్రతీ వేయి పరుగుల మైలురాయిని అందరికంటే వేగంగా ఆమ్లానే చేరుకోవడం మరో ఘనత. దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (27) సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు.
టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్ ఆమ్లా
Comments
Please login to add a commentAdd a comment