సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, బ్యాటింగ్ లెజెండ్ హషీమ్ ఆమ్లా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ దిగ్గజ ఓపెనర్ జొహనెస్‌బర్గ్ బేస్‌డ్ ఫ్రాంచైజీ గౌటెంగ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. మూడేళ్ల పాటు ఆమ్లా ఈ పదవిలో కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ స్థానంలో ఆమ్లా గౌటెంగ్ లయన్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ పనిచేసిన ఆమ్లా.. ఈ ఏడాదే ప్లేయర్‌గా చివరిసారిగా మైదానంలో కనిపించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అతను వరల్డ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
దిగ్గజ బ్యాటర్‌గా ఖ్యాతి గడించిన 40 ఏళ్ల ఆమ్లా 2004-19 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో 50కు దగ్గరగా సగటు కలిగిన ఆమ్లా.. తన 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ 2000, 3000, 4000, 6000, 7000 పరుగుల రికార్డులు ఇప్పటికీ ఆమ్లా ఖాతాలోనే ఉన్నాయి.
కెరీర్‌లో 124 టెస్ట్‌లు ఆడిన ఆమ్లా.. 28 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీల సాయంతో 46.6 సగటున 9282 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ స్కోర్ 311 నాటౌట్‌గా ఉంది. అలాగే 181 వన్డేలు ఆడిన ఆమ్లా... 27 సెంచరీలు, 39 హాఫ్‌సెంచరీల సాయంతో 49.5 సగటున 8113 పరుగులు చేశాడు.
2009-18 మధ్యలో 44 టీ20 ఆడిన ఆమ్లా.. 8 అర్ధశతకాల సాయంతో 1277 పరుగలు చేశాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఆమ్లా 2016, 2017 సీజన్లలో 16 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 141.8 స్ట్రయిక్‌రేట్‌తో 577 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment