ఒక్కొక్కరుగా దిగ్గజాల రిటైర్మెంట్, ఫిట్‌నెస్ సమస్యలు, బోర్డు పాలన వైఫల్యాలతో దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు ఫర్వాలేదనిపించిన ఆ జట్టు అనంతరం డీలా పడిపోయింది. ఆఖరికి శ్రీలంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక వన్డే ప్రపంచ కప్‌లో వారి వైఫల్యం దీనికి పరాకాష్ట. ప్రతిభావంతులను గౌరవించకపోవడం, సరైన సమయంలో నిర్ణయాలు
తీసుకోలేకపోవడం... ఇలా అనేక తప్పిదాలతో ప్రొటీస్ పరిస్థితి దిగజారింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు లేకుంటే మరింతగా పతనమయ్యే ప్రమాదమూ ఉంది.
సాక్షి క్రీడా విభాగం
పేరుకు 12 జట్లున్నా... ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న దేశాల్లో బలమైనవని చెప్పుకోదగ్గవి ఆరే! అవి... భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్. వీటిలోనూ విండీస్ ఆట మూడు దశాబ్దాలుగా అనిశ్చితం. ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో మరో జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది. మేటి అనదగ్గ ఆటగాళ్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండటంతో సఫారీలు నడి సంద్రంలో చుక్కాని లేని నావలా మిగిలారు. విధ్వంసక ఏబీ డివిలియర్స్‌తో మొదలైన రిటైర్మెంట్‌ల పరంపర... నిలకడకు మారుపేరైన హషీమ్ ఆమ్లా వరకు వచ్చింది.
వీరిద్దరి మధ్యలో ప్రధాన పేసర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వీడ్కోలు పలకడం ప్రొటీస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడా జట్టులో మిగిలిన నాణ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మాత్రమే. మిగతా వారిలో కొందరు అంతర్జాతీయ క్రికెట్‌లో తమ ముద్ర వేసే దిశలో ఉండగా... ఇంకొందరు ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తిగా సంధి కాలం అనదగ్గ ఇలాంటి దశను అధిగమించేందుకు దక్షిణాఫ్రికా బోర్డు గట్టి చర్యలు చేపట్టకుంటే... ఆ జట్టు ఓ సాధారణమైనదిగా మిగిలిపోవడం ఖాయం.
రెండు, మూడేళ్లయినా ఆడగలిగినవారే!
తమ దిగ్గజ ఆటగాళ్లు అర్ధంతర రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ దేశ క్రికెట్ బోర్డయినా ఏం చేస్తుంది? తక్షణమే సంప్రదింపులు జరిపి, వారి సేవలు ఎంత కీలకమో వివరించి నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకునేలా చేయడమో, మూడు ఫార్మాట్లలో వారి సేవలు ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ తగిన విధంగా వాడుకునేలా చేయడమో చేస్తుంది. కానీ, దక్షిణాఫ్రికా బోర్డు ఇలాంటి చొరవేదీ చూపుతున్నట్లు లేదు. డివిలియర్స్ ఉదంతమే దీనికి పక్కా నిదర్శనం.
ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే అతడు గతేడాది ఏప్రిల్‌లో అనూహ్యంగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపర్చాడు. అప్పటికి ఏబీ వయసు 34 ఏళ్లే. తన ఫామ్‌ను అంతకుమించిన ఫిట్‌నెస్‌ను చూస్తే కనీసం రెండేళ్లయినా మైదానంలో మెరుపులు మెరిపించగల స్థితిలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో 2018 మార్చి 30న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన టెస్టు తర్వాత ఇక ఆడనంటూ తప్పుకొన్నాడు. ఇదే టెస్టుతో, అంతకుమందే ప్రకటించిన మేరకు పేసర్ మోర్నీ మోర్కెల్ బై బై చెప్పాడు.
ఆ సమయంలో అతడికి 33 ఏళ్లే. గాయాలు వేధిస్తున్నాయని అనుకున్నా... మోర్కెల్ మరీ ఫామ్ కోల్పోయి ఏమీ లేడు. పెద్ద జట్లతో సిరీస్‌లైనా ఆడేలా అతడిని ఒప్పించలేకపోయారు. మోర్కెల్ లేని లోటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తెలిసొచ్చింది. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా... లంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక 36 ఏళ్ల స్టెయిన్‌ది మరో కథ. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన అతడు వరుసగా గాయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో టెస్టులకు రాం రాం చెప్పాడు.
దీంతో ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్ల సేవలను కోల్పోయినట్లైంది. మరో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ అద్భుత బౌలరే. అయితే, 34 ఏళ్లు దాటిన అతడు గాయాలతో కొంతకాలంగా ప్రధాన స్రవంతి క్రికెట్‌లో లేడు. తాజాగా హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్‌తో దక్షిణాఫ్రికా మరో స్టార్ ఆటగాడిని కోల్పోయినట్లైంది. వాస్తవానికి 36 ఏళ్ల ఆమ్లా విరమణపై ఊహాగానాలు ఉన్నా... కనీసం ఇంకో ఏడాదైనా టెస్టుల వరకు ఆడతాడని భావించారు. అతడు మాత్రం మూడు ఫార్మాట్లకు అస్త్రసన్యాసం చేశాడు.
టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎలాగో...
బ్యాటింగ్, బౌలింగ్‌లో మూలస్తంభాలైన నలుగురి రిటైర్మెంట్‌తో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎదుర్కోనున్న అసలు సవాలు టెస్టు చాంపియన్‌షిప్. ఆ జట్టు చాంపియన్‌షిప్‌లో 16 టెస్టులు ఆడనుంది. వీటిలో వచ్చే జనవరి లోపు భారత్ (3), ఇంగ్లండ్ (4 సొంతగడ్డపై)లతోనే ఏడు టెస్టులున్నాయి. విండీస్, పాక్, లంకలతోనూ రెండేసి ఆడాల్సి ఉంది. చివరగా ఆస్ట్రేలియాతో 3 టెస్టుల్లో తలపడుతుంది. బౌలింగ్‌లో రబడ మినహా ఇంకెవరిపైనా ఆశలు లేని నేపథ్యంలో డు ప్లెసిస్, డికాక్‌లకు తోడు ఓపెనర్ మార్క్‌రమ్, ఎల్గర్ సత్తా చాటితేనే సఫారీలు కనీసం పోటీ ఇవ్వగలరు.
పెద్దరికం లేని బోర్డు...
దూరదృష్టి లేని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్‌ఏ) తీరే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆటగాళ్లు, బోర్డు అధికారుల మధ్య సత్సంబంధాలు లేవు. వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందుండగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌కు నచ్చజెప్పి ఆపే పెద్దరికం, కప్‌నకు తుది జట్టును ప్రకటించే సమయంలో తిరిగొస్తానన్న అతడిని తీసుకునే విశేష చొరవ ఎవరికీ లేకపోయింది. గాయాలతో ఉన్న స్టెయిన్‌ను జాగ్రత్తగా కాపాడుకునే వ్యూహం, ఆమ్లాను కొన్నాళ్లు ఆగేలా చేసే ప్రయత్నమూ వారిలో కొరవడింది.
వన్డేలు, టి20ల కంటే స్టెయిన్ టెస్టుల్లోనే దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవసరం. కానీ, అతడు టెస్టులకే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడా బోర్డు నిష్క్రియాపరత్వం కనిపిస్తోంది. ఇప్పుడు సీఎస్‌ఏ... ఫుట్‌బాల్ తరహాలో జట్టుకు మేనేజర్‌ను నియమించి అతడే కోచింగ్ సిబ్బందిని, కెప్టెన్‌ను ఎంపిక చేసేలా కొత్త విధానం తీసుకురావాలని చూస్తోంది. ప్రధాన కోచ్ గిబ్సన్, సహాయ సిబ్బంది కాంట్రాక్టు కూడా ముగియనుంది. వచ్చేవారైనా దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలిసితీసి బాధ్యతలను సమర్థంగా నెరవేరిస్తేనే ప్రొటీస్ జట్టు పటిష్టంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment