మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడారు.
ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
త్రిష స్పిన్ మ్యాజిక్..
భారత స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు.
బ్యాటింగ్‌లోనూ అదుర్స్..
అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఊదిపడేసింది. త్రిష బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన త్రిష.. 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. త్రిషతో పాటు సానికా చాల్కే(26 నాటౌట్) కూడా రాణించింది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన త్రిష..67.25 సగటుతో 309 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment