
ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన భారత స్పిన్నర్
రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 15 పరుగులతో నెగ్గిన భారత్
ప్రతీక రావల్ అర్ధసెంచరీ
భారత ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా 5 వికెట్ల ప్రదర్శన... వీటిలో ఒకే ఓవర్లో తీసిన 3 వికెట్లు... ప్రతీక రావల్ మరో అర్ధసెంచరీతో అద్భుత ఫామ్ కొనసాగింపు... తజ్‌మీన్ బ్రిట్స్ వీరోచిత సెంచరీ వృథా... భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో హైలైట్స్ ఇవి. ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆడిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన హర్మన్ బృందం తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది.
కొలంబో: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత మహిళలు మరో విజయాన్ని అందుకున్నారు. మంగళవారం జరిగిన పోరులో భారత్ 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (91 బంతుల్లో 78; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. తజ్‌మీన్ బ్రిట్స్ (107 బంతుల్లో 109; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (5/43) ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ టీమ్‌ను పడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది.
కీలక భాగస్వామ్యాలు...
భారత్‌కు ప్రతీక, స్మృతి మంధాన (54 బంతుల్లో 36; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 18.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. స్మృతి వెనుదిరిగిన తర్వాత ప్రతీకకు హర్లీన్ డియోల్ (47 బంతుల్లో 29; 4 ఫోర్లు) సహకారం అందించింది. 58 బంతుల్లో ప్రతీక అర్ధ సెంచరీ పూర్తయింది.
ప్రతీక, హర్లీన్ మూడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... హర్మన్, జెమీమా 59 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. చివర్లో రిచా ఘోష్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆటను ప్రదర్శించగా...ఆఖరి 10 ఓవర్లలో భారత్ 82 పరుగులు సాధించింది.
బ్రిట్స్ సెంచరీ వృథా...
బ్రిట్స్ వరుస బౌండరీలతో చెలరేగిపోవడంతో ఛేదనలో దక్షిణాఫ్రికాకు మరింత ఘనమైన ఆరంభం దక్కింది. బ్రిట్స్‌తో తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ లౌరా వాల్‌వార్ట్ (75 బంతుల్లో 43; 3 ఫోర్లు) అవుట్ కాగా, ఆ తర్వాత 103 బంతుల్లో బ్రిట్స్ శతకం పూర్తయింది. ఆ తర్వాత తీవ్ర వేడి కారణంగా బ్రిట్స్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది.
80 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఐదు వికెట్లతో చివరి 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా... 48వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. తిరిగి మైదానంలోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన బ్రిట్స్ కూడా ఇదే ఓవర్లో అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (బి) ఎమ్‌లాబా 78; స్మృతి (సి) మెసో (బి) డెర్క్‌సన్ 36; హర్లీన్ (బి) ఎమ్‌లాబా 29; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 41; జెమీమా (సి) ఖాకా (బి) క్లాస్ 41; రిచా (సి) లూస్ (బి) ఖాకా 24; దీప్తి (సి) ట్రైయాన్ (బి) డిక్లెర్క్ 9; కాశ్వీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–83, 2–151, 3–154, 4–213, 5–247, 6–259. బౌలింగ్: ఖాకా 8–1– 42–1, క్లాస్ 9–1–43–1, లూస్ 4–0–24–0, డిక్లెర్క్ 9–1–39–1, ఎమ్‌లాబా 10–0–55–2, డెర్క్‌సన్ 3–0– 40–1, ట్రైయాన్ 7–0–33–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్‌వార్ట్ (ఎల్బీ) (బి) దీప్తి 43; బ్రిట్స్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 109, గుడాల్ (బి) స్నేహ్ రాణా 9; మెసో (బి) అరుంధతి రెడ్డి 7; లూస్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) శ్రీచరణి 28; ట్రైయాన్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) స్నేహ్ రాణా 18; డెర్క్‌సన్ (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 30; డిక్లెర్క్ (బి) స్నేహ్ రాణా 0; క్లాస్ (రనౌట్) 2; ఎమ్‌లాబా (రనౌట్) 8; ఖాకా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–140, 2–151, 3–181, 4–207, 5–240, 6–250, 7–251, 8–252, 9–253, 10–261. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 7.2–0–47–0, అరుంధతి రెడ్డి 9–0–59–1, స్నేహ్ రాణా 10–0–43–5, శ్రీచరణి 10–0–51–1, దీప్తి శర్మ 10–0–40–1, ప్రతీక 3–0–17–0.