
స్వదేశంలో భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ విడుదల
విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది.
ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది.