జొహన్నెస్‌బర్గ్: వాండరర్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ సేన 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు 6/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తొలుత భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే నాలుగో వికెట్ పడ్డ తర్వాత వారి ఇన్నింగ్స్ అంత సాఫీగా సాగలేదు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బూమ్రా 5 వికెట్ల ఇన్నింగ్స్ తో చెలరేగాడు. భువీ మూడు వికెట్లు తీశాడు. హషీం ఆమ్లా(61), రబాడా(30), ఫిలాందర్(35) మినహా ఇతర సఫారీ ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. బుమ్రా ఐదు వికెట్లు తీసి కట్టడి చేయడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన దక్షిణాఫ్రికా కేవలం 194 పరుగులకు ఆలౌటైంది.
భారత్ రెండో ఇన్నింగ్స్
7 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ కు దిగిన భారత్ ఆదిలోనే లైఫ్ లభించినా.. ఓపెనర్ పార్థివ్ పటేల్(16) వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ (13), కేఎల్ రాహుల్ (16)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. 42 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్, సఫారీల ముందు ఎంత లక్ష్యాన్ని నిలుపుతుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment