
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే దుమ్ములేపుతున్నారు. 14 ఏళ్ల సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరపున సంచలనాలు సృష్టిస్తుండగా.. ఆయుష్ మాత్రే సీఎస్‌కే తరపున అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ రికార్డు సెంచరీతో చెలరేగాడు.
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో జట్టులోకి వచ్చిన మాత్రే తన మెరుపు ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకుంటున్నాడు.
అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు యువ క్రికెటర్లు తిరిగి భారత అండర్-19 జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్‌కు సూర్యవంశీ, మాత్రే వెళ్లనున్నారు. సూర్యవంశీ గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేశాడు.
ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. గతేడాది అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత యువ జట్టుకు తొలి టూర్ కావడం గమనార్హం. అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. కాగా ఇదే జూన్‌లో భారత సీనియర్ జట్టు కూడా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది.