
లండన్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త సారథిగా ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో నాయకత్వ మార్పు అనివార్యమైంది. తొమ్మిదేళ్లుగా హీథర్ నైట్ ఇంగ్లండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఆ జట్టు గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇక ఆ్రస్టేలియాతో మూడు ఫార్మాట్లలో కలిపి 16 మ్యాచ్‌లాడి ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు హీథర్ నైట్ స్థానంలో... మూడేళ్లుగా జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీవర్ బ్రంట్‌కు పగ్గాలు అప్పగించింది.
మూడు ఫార్మాట్లలోనూ బ్రంట్ జట్టును నడిపించనుంది. ‘ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవడం గర్వంగా భావిస్తున్నా. జట్టును విజయవంతంగా నడిపించేందుకు నావంతు కృషి చేస్తా. మెరుగైన ప్రదర్శనతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తాం’ అని 32 ఏళ్ల బ్రంట్ పేర్కొంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రంట్... ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 259 మ్యాచ్‌లాడింది.
2017లో ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉంది. టెస్టుల్లో 46.47, వన్డేల్లో 45.91, టి20ల్లో 28.45 సగటుతో పరుగులు చేసిన బ్రంట్... మూడు ఫార్మాట్లలో కలిపి 181 వికెట్లు సైతం పడగొట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బ్రంట్ 3వ స్థానంలో ఉంది. మే 21 నుంచి వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.