
44 బంతుల్లో 13 ఫోర్లతో 75 నాటౌట్
ఖాతాలో మూడు వికెట్లు కూడా
ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ గెలుపు
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్లతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. నాట్ సివర్ బ్రంట్ (75 నాటౌట్; 3 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై సూపర్ ఓవర్‌లో నెగ్గిన యూపీ వారియర్స్... ఈ మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితమైంది. గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), దినేశ్ వృందా (30 బంతుల్లో 33; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు.
కెప్టెన్ దీప్తి శర్మ (4), కిరణ్ నవగిరె (1), తాలియా మెక్‌గ్రాత్ (1), షినెల్ హెన్రీ (7) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో సివర్ బ్రంట్ 3 వికెట్లు... షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సివర్ బ్రంట్ (44 బంతుల్లో 75 నాటౌట్; 13 ఫోర్లు), హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు.
యూపీ బౌలర్లు సైమా, షినెల్ హెన్రీ, సోఫీ ఎకిల్‌స్టోన్ ఓవర్లలో సివర్ మూడు బౌండరీల చొప్పున కొట్టింది. రెండో వికెట్‌కు హేలీ, సీవర్ 133 పరుగులు జోడించి ముంబై జట్టుకు అలవోక విజయాన్ని అందించారు. సివర్ బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment