
డబ్ల్యూపీఎల్ విజేత ముంబై ఇండియన్స్
రెండో సారి టైటిల్ సాధించిన హర్మన్ బృందం
వరుసగా మూడో ఫైనల్లో క్యాపిటల్స్ పరాజయం
8 పరుగులతో ఓడిన ఢిల్లీ
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో సారి జయకేతనం ఎగురవేసింది. రెండేళ్ల క్రితం టోర్నీ తొలి విజేతగా నిలిచిన జట్టు ఇప్పుడు మళ్లీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో తుది పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పట్టుదల, సమష్టితత్వంతో ఆడిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆల్‌రౌండర్ నాట్ సివర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించారు.
మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం విషాదంలో మునిగిపోయింది. వరుసగా మూడు సీజన్ల పాటు గ్రూప్‌లో టాపర్... వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌లు... మూడింటిలోనూ పరాజయాలు. ఛేదనలో 17 పరుగులకే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత పోరాడినా లాభం లేకపోయింది.
ముంబై: డబ్ల్యూపీఎల్ సీజన్–3లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.
14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా, నికీ ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.
మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (3), యస్తిక భాటియా (3)లను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్...జొనాసెన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడపడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు.
ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్‌లో ఉన్న లానింగ్ (13), షఫాలీ (4) రెండు పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జెమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయి చేయిదాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృథా అయింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ (బి) కాప్ 3; నాట్‌సివర్ (సి) మణి (బి) చరణి 30; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) (బి) జొనాసెన్ 0; కమలిని (స్టంప్డ్) బ్రైస్ (బి) చరణి 10; అమన్‌జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–103, 4–112, 5–112, 6–118, 7–132. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–11–2, శిఖా పాండే 4–0–29–0, అనాబెల్ సదర్లాండ్ 4–0–29–1, జొనాసెన్ 3–0–26–2, శ్రీ చరణి 4–0–43–2, మిన్ను మణి 1–0–10–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) (బి) షబ్నమ్ 4; జెస్ జాన్సన్ (సి) యస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; అనాబెల్ (స్టంప్డ్) యస్తిక (బి) సైకా 2; మరిజాన్ కాప్ (సి) హేలీ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్)25; శిఖ (బి) సివర్ 0; మిన్ను మణి (సి) సజన (బి) హేలీ 4; శ్రీ చరణి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–37, 4–44, 5–66, 6–83, 7–123, 8–123, 9–128. బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–15–1; నాట్‌సివర్ బ్రంట్ 4–0–30–3; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–25–2; సైకా 4–0–33–1.
Comments
Please login to add a commentAdd a comment